పట్టపగలే ఇళ్లు గుల్లజేస్తాడు | - | Sakshi
Sakshi News home page

పట్టపగలే ఇళ్లు గుల్లజేస్తాడు

Aug 19 2026 1:18 AM | Updated on Aug 19 2026 1:18 AM

● నూజివీడులో జూలై ఒకటిన భారీ చోరీ ● ఒంగోలు పోలీసుల అదుపులో అంతర్రాష్ట్ర దొంగ!?

నూజివీడు: పట్టణంలోని గాంధీనగర్‌లోని గాజుల మురళీకృష్ణ ఇంటిలో పట్టపగలు జూలై ఒకటో తేదీన జరిగిన భారీ చోరీలో నిందితుడు ఒంగోలు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. తాళం వేసి ఉన్న ఇంటిలో మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో చోరీ జరగగా దాదాపు 40 కాసుల బంగారం చోరీకి గురైంది. అప్పటి నుంచి సీఐ ఐవీ నాగేంద్రకుమార్‌ నేతృత్వంలో నూజివీడు నుంచి హైదరాబాద్‌ వరకు సీసీ కెమెరాల్లోని ఫుటేజీని పరిశీలించి దొంగను గుర్తించి దాదాపు 20 రోజులు హైదరాబాద్‌లో మకాం వేసి కంటిమీద కునుకు లేకుండా గాలించినప్పటికీ దొరకలేదు. ఆ తరువాత ఒంగోలులో మరో దొంగతనానికి పాల్పడి 90 కాసుల బంగారంను దొంగిలించాడు. ఈ సంఘటనలో క్లూస్‌ టీంకు వేలిముద్రలు లభ్యమవ్వడంతో దొంగను గుర్తించారు. నూజివీడు, మైలవరం, నర్సరావుపేటలలో కూడా ఇదే దొంగ దొంగతనాలకు పాల్పడినట్లు గుర్తించారు. ఆ దొంగ ముంబాయి వైపు వెళ్తుండగా ఒంగోలు పోలీసులు హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల సహకారంతో పూనే దాటిన తరువాత లూనావాలా వద్ద అదుపులోకి తీసుకొని ఒంగోలుకు తీసుకువచ్చారు.

పగటిపూటే చోరీలు

కర్ణాటకకు చెందిన ఈ దొంగ హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో నివసిస్తూ ద్విచక్ర వాహనంపైనే వందల కిలోమీటర్లు తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇళ్లల్లో పగటిపూట మాత్రమే దొంగతనాలు చేస్తాడు. హైదరాబాద్‌ నుంచి 250 నుంచి 350 కిలోమీటర్ల దూరం వెళ్లి అక్కడి పట్టణాల్లో దొంగతనాలు చేస్తూ ఉంటాడు. ఇదే తరహాలో ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం, ఏలూరు జిల్లా నూజివీడు, పల్నాడు జిల్లా నర్సారావుపేట, ఒంగోలులలో దొంగతనాలకు పాల్పడ్డాడు. నాలుగు చోట్ల కలిపి దాదాపు 240 కాసుల బంగారు నగలను చోరీ చేశాడు. చోరీల తరువాత ద్విచక్ర వాహనంపై వెళ్లేటప్పుడు ఎక్కడా కూడా హెల్మెట్‌ను తలపై నుంచి తీయకుండా జాగ్రత్త పడతాడు. పెట్రోలు బంకుల్లో, మద్యం షాపుల వద్ద ఎక్కడా హెల్మెట్‌ తీయకుండానే పెట్రోలు కొట్టించుకోవడం, మద్యం కొనుక్కోవడం చేస్తుంటాడు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఒంగోలు నగరం చేసిన దొంగతనం సంఘటనలో క్లూస్‌ టీంకు వేలిముద్రలు లభ్యమవ్వడంతో దొంగ దొరికాడు.

పిల్లలకు ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో విద్య

ఈ దొంగకు ఇరువురు కుమారులు, ఒక కుమార్తె ఉండగా వీరిని బెంగళూరు, హైదరాబాద్‌లలోని ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో చదివిస్తున్నట్లు తెలిసింది. ఒక్కొక్కరికి ఏడాదికి రూ.3 లక్షలు చొప్పున ఫీజులు చెల్లిస్తూ చదివిస్తుండటం గమనార్హం. దొంగతనాలు చేస్తూ పిల్లలను ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌లో చదివిస్తుండటం చూసి విస్తుపోవడం పోలీసు అధికారుల వంతైంది. భారీ దొంగతనాలు చేసిన అంతర్రాష్ట్ర దొంగ దొరకడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement