చిత్రం.. చరిత్రకు సాక్ష్యం | - | Sakshi
Sakshi News home page

చిత్రం.. చరిత్రకు సాక్ష్యం

Aug 19 2026 1:18 AM | Updated on Aug 19 2026 1:18 AM

అరచేతిలో అద్భుతమైనా...ఫొటోగ్రాఫర్‌తోనే సాధ్యం

అపురూప దృశ్యాల విపంచిక.. అన్ని వేడుకలను తనలో నిబిఢీకృతం చేసుకుని కొత్తగా చూపించే మౌన రుషి కెమెరా. 1816 నుంచి 2026వ సంవత్సరం వరకు రెండు శతాబ్దాల పైబడిన సుదీర్ఘ పయనంలో ఎన్నో ఆధునికతలను తనలో నింపుకుంటూ ముందుకు సాగుతోంది కెమెరా. ఈ క్రమంలో నాటి తరం నుంచి యువతరం ఉపాధి మార్గంగా నిలుస్తుంది.

తాడేపల్లిగూడెం రూరల్‌: ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే నానుడి మనుషులకే కాదు...పరికరాలకు వర్తిస్తుందా ? అంటే...అవుననే చెప్పాలి. ఎందుకంటే ఈ నానుడి అక్షరాలా నిజమే. ఈ కోవలోనే ఒకనాటి భారీ సరంజామాతో కూడుకున్న కెమెరా నేడు అరచేతిలో అద్భుతం అనే స్థాయికి చేరుకుంది. నాడు వెలుగు ఆధారితంగానే ఈ కెమెరాల్లో చిత్రాలను బంధించేవారు. నేడు వెలుగు...చీకటి ఏదైనా సరే చిత్రాలను అత్యద్భుతంగా రూపొందించే టెక్నాలజీ మనకు అందుబాటులోకి వచ్చింది. అసలు కెమెరా సృష్టికర్త జోసఫ్‌ నైస్‌ఫోర్‌ నీప్సి. ఫ్రెంచ్‌ దేశానికి చెందిన ఇతను 1816లో స్వయంకృతంగా కెమెరాను రూపొందించారు. తదుపరి 1826 – 29వ సంవత్సరం మధ్య లూయిస్‌ డాగూరేతో కలిసి జోసఫ్‌ శాశ్వతమైన కెమెరాను తయారు చేశారు. అప్పట్లో 124జి ఫిల్మ్‌పై చిత్రాలను ప్రింట్‌ వేసేవారు. మారుతున్న కాలానికనుగుణంగా 35 ఎంఎం ఫిల్మ్‌పై ఛాయాచిత్రాలను తీసి, ఆ ఫిల్మ్‌కు డార్క్‌ రూమ్‌లో మెరుగులద్ది ఇచ్చేవారు. అనంతరం 1975లో స్టీవ్‌ శాసన్‌ అనే వ్యక్తి 23 సెకన్లలో దృశ్యీకరించే డిజిటల్‌ కెమెరాను తయారు చేశారు. డిజిటల్‌ రంగంలో చోటు చేసుకున్న సరికొత్త మార్పుగా దీనిని పేర్కొనవచ్చు. 1980వ దశకంలో కమర్షియల్‌ డిజిటల్‌ కెమెరా అందుబాటులోకి వచ్చింది. ఇదే కెమెరా మారుతున్న డిజిటల్‌ రంగానికనుగుణంగా సరికొత్త సొబగులను అందిపుచ్చుకుంది. అదే విధంగా 1930వ సంవత్సరంలో వీడియో కెమెరా అందుబాటులోకి వచ్చింది. 1980వ దశకంలో వీడియో కెమెరా వినియోగం విస్తరించింది. ప్రస్తుతం 5డి సిరీస్‌లో డిజిటల్‌ కెమెరాలు, 4కె సిరీస్‌లో వీడియో కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి. వీటితో ఎంత దూరంలో ఉన్న చిత్రాన్నైనా మరింత స్పష్టంగా చిత్రీకరించవచ్చు. ఎత్తయిన ప్రదేశాల నుంచి సైతం ఫొటో, వీడియోలను చిత్రీకరించే డ్రోన్‌ వంటి పరికరాలు అందుబాటులోకి వచ్చాయి.

ఉపాధి రంగంగా...!

ఫొటో, వీడియోగ్రఫీ రంగం ఎందరికో ఉపాధి అందిస్తుంది. జిల్లాలో రమారమీ ఐదు నుంచి ఆరు వేల మంది ఫొటోగ్రాఫర్లు పనిచేస్తున్నారని యూనియన్‌ నాయకులు పేర్కొంటున్నారు. వీరు కాకుండా ఫ్రీలాన్సర్లుగా, అమెచ్యూవర్స్‌ (స్వతంత్రులు) ప్రత్యామ్నాయ ఉపాధి మార్గంగా ఈ రంగాన్ని ఎంచుకుని పనిచేస్తున్నారు. మారుతున్న కాలానికనుగుణంగా ఒకనాడు ఫిల్మ్‌లపై ఫొటోలను అందించిన సీనియర్లు సైతం డిజిటల్‌ కెమెరాలపై అవగాహన పెంచుకుంటూ ఉపాధి అవకాశాలను మెరుగుపర్చుకుంటున్నారు. ఎందరో ఈ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వం సైతం ముందుకొచ్చి వృత్తి శిక్షణా తరగతులు నిర్వహించడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు లభించగలవని సీనియర్‌ ఫొటోగ్రాఫర్లు పేర్కొంటున్నారు.

నేడు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం నేపథ్యంలో అరచేతిలో అద్భుతాలు సృష్టిస్తున్నాయి కెమెరాలు. అవే మొబైల్‌ కెమెరాలు. డిజటల్‌ కెమెరాలకు తగ్గట్టుగా కెమెరా, వీడియో విజువల్స్‌ను స్పష్టంగా చిత్రీకరిస్తూ మొబైల్‌ వినియోగదారులకు చిన్ని తెరపైనే అద్భుతాలు పంచుతున్నాయి. ఎంత ఖరీదు మొబైల్‌ అయినా వాటిని తీసే వారి చేతిలోనే పనితనం ఉంటుందనేది ప్రతీతి. అందుకే లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మొబైల్స్‌, కెమెరాలు కొనుగోలు చేసినా ఫొటోగ్రాఫర్‌కు సాటి రావనేది జగమెరిగిన సత్యం. అయితే, మొబైల్‌ కెమెరాలు కొంత మేర ఫొటో, వీడియోగ్రఫీ వృత్తిపై ప్రభావం చూపిందని చెప్పక తప్పదు.

మొబైల్‌ రాకతో కనుమరుగవుతున్న ఫొటోగ్రఫీ

స్వీయ ఫొటోగ్రఫీతో కొరవడుతున్న ఆదాయం

నేడు ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement