ముసునూరు: మండల కేంద్రం ముసునూరు–కాట్రేనిపాడు సరిహద్దులోని ఓ ప్రైవేటు పాప్‌కార్న్ కంపెనీలో రసాయనిక వాయువులు వెలువడి కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వివరాల ప్రకారం.. పాప్‌కార్న్ కంపెనీలో కార్మికులు ఉదయం పని చేస్తున్న సమయంలో ఇద్దరికి ఊపిరి పీల్చుకునే విషయంలో ఇబ్బందులు తలెత్తాయి. చూస్తూ ఉండగానే వారు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో యాజమాన్యం స్పందించి ముసునూరు పీహెచ్‌సీకి తరలించారు. వైద్యాధికారి గంగాధరరావు ప్రథమ చికిత్స అందించి, పరిస్థితి విషమంగా ఉండడంతో నూజివీడుకు రిఫర్ చేశారు. అక్కడి నుంచి అంబులెన్స్‌లో ఏరియా ఆసుపత్రికి తరలించారు. తక్షణ వైద్య సేవలు అందించడంతో క్షతగాత్రుల ఆరోగ్యం కుదుట పడింది. తక్షణమే ఆసుపత్రికి తరలించడం వలన అన్ని రకాల పరీక్షలు నిర్వహించి, వైద్య సేవలు అందించినట్లు ఏరియా ఆసుపత్రి రెసిడెంట్ డాక్టర్ వరప్రసాద్ తెలిపారు. గాలి ప్రవేశించకుండా ఉండడం వలన విష వాయువులు, రసాయనాలతో తీవ్ర ప్రమాదం సంభవిస్తుందని జాగ్రత్త వహించాలని హెచ్చరించారు. ప్రమాదంపై యజమాని మాట్లాడుతూ కార్మికులు రాత్రి ఒంగోలులో పని చేసి అలసటతో వచ్చి, ఏమీ తినకుండానే ఇక్కడ పనిలోకి రావడంతో ఆందోళనకర పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. బాధితులకు సంపూర్ణ ఆరోగ్యం చేకూరేంత వరకు పూర్తి వైద్య సేవలు అందించే ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
చింతలపూడి (జంగారెడ్డిగూడెం): జంగారెడ్డిగూడెం పట్టణం అశ్వరావుపేట రోడ్డులోని కే–కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గుర్తుతెలియని వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై ఎన్‌వీ ప్రసాద్ తెలిపారు. ఈనెల 13న రాత్రి 9:30 గంటల సమయంలో ప్రమాదానికి గురైన సుమారు 55 నుంచి 60 ఏళ్ల వయస్సు గల వ్యక్తిని మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఈనెల 17న మృతి చెందారని ఎస్సై పేర్కొన్నారు. మృతుని ఆచూకీ తెలిసిన వారు వెంటనే జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు.


