ఓడలరేవులో బాధిత కుటుంబాలకు ధైర్యం చెబుతున్న మాజీ ఎంపీ చింతా అనురాధ
ఏడుగురు మత్స్యకారులు వెళ్లిన బోటు ఆచూకీ కోసం గాలింపు తీవ్రతరం
అల్లవరం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు తీరం నుంచి ఈ నెల 3న మత్స్యసంపద కోసం ఏడుగురు మత్స్యకారులు వెళ్లిన బోటు ఆచూకీ లభ్యంగాక పోవడంతో ఆయా కుటుంబాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. పదిరోజులకు సరిపడా ఆహారపదార్థాలు, వెయ్యి లీటర్ల డీజిల్‌తో మత్స్యకారులు వెళ్లిన ఈ బోటు ఈ నెల 13న తీరానికి చేరుకోవాల్సి ఉంది. బోటు తీరం నుంచి బయలుదేరిన గంటకే మత్స్యకారుల మొబైల్ నుంచి నెట్‌వర్క్ తెగిపోయినట్లు తెలిసింది. ఈ విషయం బోటు యజమాని కొపనాతి రామకృష్ణవర్మ సోదరుడు భవాని శంకరానికి తెలిసినా అధికారులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదనేది చర్చనీయాంశంగా మారింది. మత్స్యకారుల కుటుంబసభ్యులు అధికారులకు చెప్పేవరకు ఈ విషయాన్ని బోటు యజమాని గోప్యంగా ఉంచడం గమనార్హం.
సముద్రంలోకి చేపల వేటకు వెళ్లే రిజిస్టర్డ్ బోట్లకు మత్స్యశాఖ ఆధ్వర్యంలో ట్రాన్స్‌పాండర్ ఏర్పాటు చేయాల్సి ఉంది. బోటుకు ఉన్న జీపీఎస్ నుంచి కేవలం 120 నుంచి 150 కిలోమీటర్ల దూరం వరకు మాత్రమే పూర్తి సమాచారం ఉంటుంది. బోటు అంతకుమించి లోపలికి వెళితే జీపీఎస్ ట్రాకర్ పనిచేస్తున్నా సమాచారం ఇవ్వడంలో విఫలమవుతుంది. 150 కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరం బోటు పయనిస్తే ట్రాన్స్‌పాండరే కీలకం. ట్రాన్స్‌పాండర్ ఏర్పాటు చేయకపోవడంతో బోటు ఆచూకీపై గందరగోళం ఏర్పడింది. ట్రాన్స్‌పాండర్ ఉంటే తీరం నుంచి సుమారు 600 కిలోమీటర్ల వరకు నెట్‌వర్క్ ఉంటుంది.
ట్రాన్స్‌పాండర్‌కు ఉన్న ఎస్‌వోఎస్ బటన్ ప్రెస్ చేయగానే కోస్టుగార్డు, సంబంధిత మెరైన్ పోలీసులను అప్రమత్తం చేస్తుంది. బోటుకు ట్రాన్స్‌పాండర్ ఏర్పాటు చేయడంలో మత్స్యశాఖ అధికారుల నిర్లక్ష్యం ఉందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. జూలై 31 నుంచి ఆగస్టు 5 వరకు బంగాళాఖాతంలో తుపాను ప్రభావంతో తీరం వెంబడి వర్షాలు కురిశాయి. తుపాను నేపథ్యంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించామని, రెండురోజుల్లో బోటుకు ట్రాన్స్‌పాండర్‌ని ఏర్పాటుచేస్తామని చెప్పామని అధికారులు చెబుతున్నారు. అయినా వినకుండా వేటకు వెళ్లారని పేర్కొంటున్నారు.
బంగ్లాదేశ్ అధికారులతో సంప్రదింపులు
ఈ నెల 3న తీరం నుంచి బయలుదేరిన ఏపీ–ఈ8–ఎంఓ 135 బోటు తుపాను ప్రభావంతో బంగ్లాదేశ్, కోల్‌కతా పోర్టుల వైపు వెళ్లి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. బంగ్లాదేశ్ అధికారులతో సంప్రదింపులు చేస్తున్నారు. మత్స్యకారులను క్షేమంగా ఇంటికి తీసుకొచ్చేందుకు ఇండియన్ నేవీ, కోస్టుగార్డు, మెరైన్ పోలీసులు సంయుక్తంగా సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. సముద్రంలోకి వేటకు వెళ్లిన మిగిలిన మత్స్యకారులకు సమాచారం ఇవ్వడంతో పాటు నేవీ అధికారులతో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టామని మెరైన్ డీఎస్పీ కిరణ్‌కుమార్ తెలిపారు. ఆదృశ్యమైన మత్స్యకారుల కుటుంబీకులను మాజీ ఎంపీ చింతా అనూరాధ పరామర్శించి ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబాలకు అండగా నిత్యావసరాలను అందించారు. ఆర్డీవో సరళావతి, డీఎస్పీ టి.ఆర్.కె.ఎస్.ప్రసాద్, మత్స్యశాఖ జేడీ కరుణాకర్.. ఓడలరేవులోని బాధిత కుటుంబాలను పరామర్శించారు.


