కాంగ్రెస్‌ సర్కార్‌కు కేసీఆర్‌ వార్నింగ్‌ | Elkathurthy Public Meeting: Kcr Warning To Telangana Congress Govt | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ సర్కార్‌కు కేసీఆర్‌ వార్నింగ్‌

Apr 27 2025 8:00 PM | Updated on Apr 28 2025 8:04 AM

Elkathurthy Public Meeting: Kcr Warning To Telangana Congress Govt

సాక్షి, వరంగల్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఫెయిల్‌ అయ్యిందని.. ఏడాదిన్నర పాలనలో ఏం చేశారంటూ బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు నిలదీశారు. సంచులు నింపుడు.. మోయడంలోనే కాంగ్రెస్‌ పాస్‌ అయ్యిందంటూ మండిపడ్డారు. వరంగల్‌ శివారులోని ఎల్కతుర్తిలో ‘రజతోత్సవ సభ’పేరిట నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ఒక్కడిగా బయల్దేరి తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టానని.. 25 ఏళ్లనాడు గులాబీ జెండా ఎగరేశాం.. ఉద్యమంతో తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం.. అందరూ అశ్చరపోయేలా పదేళ్లపాటు తెలంగాణను పాలించామని కేసీఆర్‌ అన్నారు.

 తెలంగాణకు నెంబర్‌ వన్ విలన్‌ కాంగ్రెస్సే
‘‘తెలంగాణ ఉద్యమం నుంచి  వెనక్కిపోతే నన్ను రాళ్లతో కొట్టి చంపమని చెప్పా. ఆనాడు పదవుల కోసం టీడీపీ, కాంగ్రెస్‌ వాళ్లు.. పెదవులు మూశారు. బీఆర్‌ఎస్‌ నేతలు పదవులను త్యాగం చేశారు. ఆనాడైనా ఈనాడైనా తెలంగాణకు నెంబర్‌ వన్ విలన్‌ కాంగ్రెస్సే. ప్రజలు ప్రాణం  పోసి ఊపిరి ఊదితే అద్భుతమైన ఉద్యమాన్ని నిర్మించాం. బలవంతంగా ఆనాడు తెలంగాణను ఆంధ్రాలో విలీనం చేసింది కాంగ్రెస్సే. కాంగ్రెస్‌  మెడలు వంచి తెలంగాణను సాధించుకున్నాం. నేను ఆమరణ దీక్షకు దిగితే కాంగ్రెస్‌ దిగవచ్చి తెలంగాణపై ప్రకటన చేసింది’’ అని కేసీఆర్‌ గుర్తు చేశారు.

డ్యాన్స్‌లు చేసి హామీలు ఇచ్చారు..
‘‘పదేళ్ల పాలనలో తెలంగాణను అనేక రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపాం. తెలంగాణ అంటే ఒక్కప్పుడు వెనకబడిన ప్రాంతం. మన పాలనలో రూ.90 వేలు ఉన్న తలసరి ఆదాయం మూడున్నర లక్షలకు పెంచుకున్నాం. మూడేళ్లలో కాళేశ్వరం కట్టుకున్నాం. పడావు భూములను పంటపొలాలుగా మార్చుకున్నాం. పంజాబ్‌ను తలదన్నే పంటలను పండించుకున్నాం. రైతాంగాన్ని కడుపులో పెట్టి చూసుకున్నాం. గోల్‌మాల్‌ చేయడంలో అబద్ధాలను చెప్పడంలో కాంగ్రెస్‌ను మించినవారు లేరు. మాట్లాడితే కేసీఆర్‌పై నిందులు వేస్తున్నారు. ఇక్కడ ఉన్నవాళ్లు చాలరని.. ఢిల్లీ నుంచి గాంధీలు వచ్చి డ్యాన్స్‌లు చేసి హామీలు ఇచ్చారు’’ అంటూ కేసీఆర్‌ మండిపడ్డారు.

ఆశపడి.. కాంగ్రెస్‌ను నమ్మి ప్రజలు మోసపోయారు..
‘‘కల్యాణ లక్ష్మికి కేసీఆర్‌ లక్ష రూపాయలే ఇస్తున్నారు.. మేము వస్తే తులం బంగారం కూడా ఇస్తామన్నారు. పెన్షన్లు పెంచుతామన్నారు.. స్కూటీలు కొనిస్తామన్నారు.. జాబ్‌ కార్డులు ఇస్తామన్నారు.. ఇచ్చారా?. ఇప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న ఆయన.. ఎన్ని హామీలైనా అమలు చేసి చూపిస్తామన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో ఉన్న దేవుళ్ల అందరిపైనా ఒట్లు వేశారు. మహిళలే ఆర్టీసీలో ఉచిత ప్రయాణం వద్దని అంటున్నారు. ఆశపడి.. కాంగ్రెస్‌ను నమ్మి ప్రజలు మోసపోయారు. మమ్మల్ని ఎవరూ నమ్మడం లేదు.. అప్పు పుట్టడం లేదని.. ఇప్పుడు కాంగ్రెస్‌ వాళ్లు అంటున్నారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితిని దెబ్బతీశారు.. పరిపాలన చేయడం రాక రాష్ట్రాన్ని ఆగమాగం చేశారు. తెలంగాణను నంబర్‌వన్‌ స్థానంలో నిలబెడితే.. ఇప్పుడు 14వ స్థానానికి తీసుకెళ్లిపోయారు. హైడ్రా పేరు చెప్పి పేదల ఇళ్లు కూలగొడుతున్నారు’’ అని కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేవారు.

ఇక నుంచి నేను కూడా ఊరుకోను..
యూనివర్శిటీ భూములను ఎవరైనా అమ్ముతారా?. కేసీఆర్‌ కిట్స్‌ను ఎందుకు బంద్‌ చేశారు? ఎవరైనా వాటిని ఆపుతారా?. ఇవాళ హైదరాబాద్‌ యూనివర్శిటీ రేపు ఉస్మానియా యూనివర్శిటీ అమ్మేస్తారు. వైఎస్సార్‌  తెచ్చిన ఆరోగ్యశ్రీని కొనసాగించాలని చెప్పాను. ఆరోగ్యశ్రీ పథకం మంచిది.. కొనసాగించాలని నేను సీఎం అయ్యాక చెప్పాను. ఇప్పుడున్న సీఎం కేసీఆర్‌ ఆనవాళ్లు లేకుండా చేస్తామంటున్నారు. ఇక నుంచి నేను కూడా ఊరుకోను. ఎక్కడ ఎవరు బీఆర్‌ఎస్‌ నేతలపై కేసులు పెట్టినా న్యాయస్థానాల్లో పోరాడదాం. కమీషన్లు అడుతున్నారని కాంట్రాక్టర్లు అంటున్నారు. ఈ సోది కబుర్లు వినడానికి నేను అసెంబ్లీకి రావాలా?’’ అని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.

ఆపరేషన్‌ కగార్‌ వెంటనే ఆపేయాలి..
ఆపరేషన్‌ కగార్‌ వెంటనే ఆపేయాలి. మావోయిస్టులతో చర్చలు జరపాలి. మావోయిస్టులను ఏరిపారేస్తామనడం సరికాదు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు. బీఆర్‌ఎస్‌ శ్రేణులు ధైర్యంగా ఉండాలి. తెలంగాణను మళ్లీ అద్భుతంగా చేసుకుందాం. ప్రభుత్వాన్ని పడగొట్టే ఆలోచన మాకు లేదు. కాంగ్రెస్‌ సంగతేంటో ప్రజలే తేలుస్తారు. పోలీసులు ఎందుకు అత్యుత్సాహం చేస్తున్నారు. పోలీసులు డైరీల్లో రాసుకోండి. మళ్లీ వచ్చేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే. బీఆర్‌ఎస్‌ రాకుండా ఎవరు కూడా ఆపలేరు. పోలీసులకు రాజకీయాలు ఎందుకు?. మీ డ్యూటీ మీరు చేయండి’’ అంటూ కేసీఆర్‌ హెచ్చరించారు.

 

 


 

 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement