సీపీఎంకు భంగపాటు.. తమ్మినేనికి ఎదురుదెబ్బ! | Sakshi
Sakshi News home page

సీపీఎంకు భంగపాటు.. తమ్మినేనికి ఎదురుదెబ్బ!

Published Sun, Dec 10 2023 9:12 AM

CPM Lost Deposit In Telangana Assembly Elections - Sakshi

ఉమ్మడి ఖమ్మం జిల్లాను ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోట అనేవారు. ఇప్పుడు కంచుకోట కనుమరుగైపోయింది. కాంగ్రెస్ మద్దతుతో సీపీఐ ఒక సీటు గెలుచుకుంది. ఒంటరిగా బరిలోకి దిగిన సీపీఎం కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శికి కూడా డిపాజిట్‌ దక్కలేదు. ఇంత పతనాన్ని సీపీఎం నాయకులు ఊహించలేదా? ఊహించినా నిర్లక్ష్యంగా వ్యవహరించారా? తాజా ఎన్నికలతో కమ్యూనిస్టుల ప్రస్తుత వాస్తవ బలం ఎంతో తెలిసిందా?..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు ప్రస్తుతం ఉన్న ప్రజా బలం ఎంతో తేలిపోయింది. సీపీఐ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం సీటు ఒక్కటి తీసుకుని కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంది. సీపీఎం మాత్రం సీట్ల బేరం కుదరక ఒంటరిగా బరిలోకి దిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 19 స్థానాల్లో పోటీ చేయగా.. కనీసం ఒక్క చోట కూడా డిజాజిట్ దక్కలేదు. పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు సొంత ఊరులో కూడా అతి స్వల్పంగా ఓట్లు రావడం ఆ పార్టీ దయనీయ పరిస్థితిని కళ్లకు కడుతోంది. ఒకనాడు ఎర్ర జెండాల రెపరెపలతో కళకళలాడిన ఖమ్మం జిల్లాలో సీపీఎంకు ఇంతటి దారుణమైన ఫలితాలు వస్తాయని ఆ పార్టీ నేతలు కూడా ఊహించి ఉండరనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. తమ బలాన్ని అతిగా అంచనా వేసుకుని తమకు సీట్లు ఇవ్వని కాంగ్రెస్‌ను దెబ్బ కొడదామనుకున్నారా? లేక వాస్తవాలు తెలిసినా కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన సమయంలో 2014లో జరిగిన ఎన్నికల్లో సీపీఎం, సీపీఐలకు చెరో సీటు దక్కింది. గత సభలో రెండు పార్టీలు ఒక్కో స్థానం కూడా పొందలేకపోయాయి. తాజా ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కలిసి పోటీ చేస్తామని చెప్పినా.. ఆచరణలో అలా జరగలేదు. కాంగ్రెస్‌తో సీపీఐ పొత్తు పెట్టుకోగా.. సీపీఎం ఒంటరిగా పోటీ చేసింది. పాలేరు నుంచి పోటీ చేసిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు కూడా సీపీఎం ఓటర్లు ఝలక్ ఇచ్చారు. నియోజకవర్గ వ్యాప్తంగా సీపీఎంకు 18 వేల నుంచి 20 వేల ఓట్లు ఉన్నట్లు చెబుతున్నా.. తమ్మినేని కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు. రాష్ట్రంలో సీపీఎం పరిస్థితిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. తమ్మినేని వీరభద్రంకు కేవలం 5వేల 308 ఓట్లు మాత్రమే వచ్చాయి. సొంతూరు తెల్దారపల్లిలో సైతం అతి తక్కువ ఓట్లు రావడంతో తమ్మినేని జీర్ణించుకోలేని పరిస్థితి ఏర్పడింది.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీపీఎంకు అన్ని నియోజకవర్గాల్లో కొంత ఓటు బ్యాంకు ఉంది. పాలేరు, మధిర, వైరా, భద్రాచలం నియోజకవర్గాల్లో సీపీఎంకు ఓట్‌ బ్యాంక్ ఉంది. ఈ నాలుగు స్థానాల్లోనూ గత ఎన్నికల్లో కంటే ఈసారి చాలా తక్కువ ఓట్లు సీపీఎంకు దక్కాయి. ఈసారి మధిర నియోజకవర్గంలో పోటీ చేసిన సీపీఎం అభ్యర్థికి అత్యధికంగా 6,575 ఓట్లు వచ్చాయి. ఈ ఓట్లు గత ఎన్నికల్లో నాలుగో వంతు మాత్రమే. ఇక అత్యల్పంగా హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌ అభ్యర్థికి 835 మాత్రమే పోలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసిన 19 సీపీఎం అభ్యర్థులకు కలిపినా మొత్తం 50 వేల ఓట్లు కూడా పోలవ్వలేదు. పొత్తుల్లో భాగంగా కాంగ్రెస్ ప్రతిపాదించినట్లు మిర్యాలగూడెం అసెంబ్లీ సీటుతో పాటు రెండు ఎమ్మెల్సీలకు అంగీకరించి ఉంటే గౌరవంగా ఉండేదన్న అభిప్రాయాలు ఇప్పుడు సీపీఎం నాయకత్వంలో వ్యక్తమవుతున్నట్లు టాక్ నడుస్తోంది. 

అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవకపోగా.. కనీసం ఆశించిన స్థాయిలో కూడా ఓట్లు రాకపోవడంతో మండలాల వారీగా సమావేశం ఏర్పాటు చేసి జరిగిన పొరపాట్లను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. లోపం ఎక్కడ జరిగిందో తెలుసుకుని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసుకుని మళ్లీ జిల్లాలో పార్టీని బలోపేతం చేసుకోవాలని సీపీఎం నాయకత్వం భావిస్తోంది.

Advertisement
 
Advertisement