ఢిల్లీ: కర్ణాటక కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి పదవి మార్పుపై ఊహాగానాలు మళ్లీ ఊపందుకున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఢిల్లీకి వెళ్లి పార్టీ అధిష్టానంతో భేటీ కావాలని ప్రయత్నించినా, కాంగ్రెస్ సీనియర్ నేతలు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలన పూర్తి చేసుకుంటుండగా.. నవంబర్‌లో సీఎం మార్పు జరిగే అవకాశాలపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ గత కొన్ని నెలలుగా అధిష్టానంతో సంప్రదింపులు జరుపుతున్నారు.
తాజా పరిణామాల్లో, సిద్ధరామయ్య ఢిల్లీకి వెళ్లినా, పార్టీ పెద్దలు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం చర్చనీయాంశమైంది. అయినా కూడా, సిద్ధరామయ్య ఢిల్లీలో జరిగిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం, కర్ణాటకలో జరిగిన ఓ సభలో సిద్ధరామయ్య మాట్లాడుతూ, తన ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం ఉందని, రాబోయే రెండున్నరేళ్లూ తామే అధికారంలో ఉంటామని, తదుపరి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌దే విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా, సిద్ధరామయ్య శిబిరానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు ఢిల్లీలో సమావేశమయ్యారు. ఆయన సోదరుడు, కొప్పల్ ఎంపీ రాజశేఖర్ హిట్నాల్ తన నివాసంలో విందు ఏర్పాటు చేశారు. ఇది పేరుకే విందు అయినా.. అంతర్గతంగా సిద్ధరామయ్య బల ప్రదర్శనగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.


