కలలో కూడా ఈ పరిస్థితి వస్తుందనుకోలేదు: పీవీఆర్‌

Congress Denied Ticket P Vishnu Vardhan Reddy Harish Rao Comments - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పీజేఆర్‌ కొడుకు, కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి ఇంటికి మంత్రి హరీష్‌రావు వెళ్లారు. హైదరాబాద్‌లోని విష్ణు నివాసంలో సోమవారం ఆయన్ను కలిసి బీఆర్‌ఎస్‌లో చేరాలని ఆహ్వానించారు.

కాగా కాంగ్రెస్‌ జూబ్లీహిల్స్‌ టికెట్‌ను తనకు కాకుండా అజారుద్దీన్‌కు ఇవ్వడంతో విష్ణువర్దన్‌రెడ్డి అసహానం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే విష్ణువర్ధన్‌రెడ్డి ఆదివారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసిన విషయం తెలిసిందే. దీంతో విష్ణు బీఆర్‌ఎస్‌లో చేరడం లాంఛనంగా మారింది.

ఈ సందర్భంగా విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో ఈ పరిస్థితి వస్తుందని కలలోకూడా ఊహించలేదని పేర్కొన్నారు. మా నాన్న(పీజేఆర్‌) 35 ఏళ్లు, తాను 17 ఏళ్లు కాంగ్రెస్‌కు సేవ చేశామని తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో గాంధీభవన్‌ను అమ్మేసే పరిస్థితులు వచ్చాయని విమర్శించారు. అతి త్వరలోనే తాను బీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు వెల్లడించారు.

బీఆర్‌ఎస్‌ పార్టీలో విష్ణుకు సరైన గౌరవం కల్పిస్తామని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన చురుకుగా పాల్గొన్నారని తెలిపారు. విష్ణును బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానిస్తున్నామని, ఆయనకు బీఆర్‌ఎస్‌ మంచి భవిష్యత్తును ఇస్తుందని చెప్పారు. తెలంగాణ కోసం నిలబడిన వ్యక్తి విష్ణు అని, బీఆర్‌ఎస్‌లో చేరేందుకు సుముకుత వ్యక్తం చేశారని తెలిపారు. తాము, విష్ణు అయిదేళ్లు శాసనసభ  సభ్యులుగా ఉన్నామని, అనేక ఉద్ధమాల్లో ఆయన తమతో కలిసి పోరాడినట్లు ప్రస్తావించారు.

తెలంగాణ వాదులకు, ద్రోహులకు మధ్య యుద్ధం జరుగుతోందని హరీష్‌ రావు విమర్శించారు. పట్టపగలు డబ్బు కట్టలతో దొరకిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ. 5 కోట్లకు ఒక్కో ఎమ్మెల్యే టికెట్‌ అమ్ముకుంటున్నారని కాంగ్రెస్‌ నేతలే చెప్తున్నారని మండిపడ్డారు. పీసీసీ పదవిని కూడా కొనుక్కున్నారని ఆ పార్టీ నేతలే చెప్తున్నారని అన్నారు. కేసీఆర్‌ పాలనలో హైదరాబాద్‌ శరవేగంగా అభివృద్ధి జరగుతోందని,  సీఎం పాలనలో హైదరాబాద్‌లో తాగునీటి సమస్య లేదని తెలిపారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top