నేను గుంపు మేస్త్రీనే | CM Revanth Reddy launches free accident insurance scheme for employees | Sakshi
Sakshi News home page

నేను గుంపు మేస్త్రీనే

Jun 26 2026 1:26 AM | Updated on Jun 26 2026 1:26 AM

CM Revanth Reddy launches free accident insurance scheme for employees

ఉద్యోగుల ఉచిత ప్రమాద బీమా ఎంవోయూతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. చిత్రంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వివేక్‌ వెంకటస్వామి, అజహరుద్దీన్‌ తదితరులు

ప్రభుత్వ ఉద్యోగులంతా నా గుంపే.. 

ఈ గుంపే నా బలం.. ధైర్యం.. ప్రజలకు, ప్రభుత్వానికి వారధి

ఉద్యోగులకు ఉచిత ప్రమాద బీమా పథకం ప్రారంభంలో సీఎం రేవంత్‌రెడ్డి 

ఉద్యోగుల భద్రత ప్రభుత్వ బాధ్యత.. అందుకే ప్రమాద బీమా  

బతికున్నప్పుడే బంధాలు.. కుటుంబానికి భరోసా ఇచ్చేందుకే ఈ పథకం 

ప్రజల కోసం పనిచేసే ఉద్యోగులకు ప్రభుత్వం తోడుగా ఉంటుందన్న సీఎం

ప్రభుత్వ ఆదాయం పెంచేందుకు రోజుకు ఒక గంట అదనంగా పనిచేయాలని విజ్ఞప్తి  

త్వరలోనే పీఆర్సీ అంశాన్ని ఫైనల్‌ చేయాలని డిప్యూటీ సీఎంకు ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: ‘అవును.. నేను గుంపు మేస్త్రీనే. ఈ మంత్రులు, ప్రభుత్వ ఉద్యోగులందరూ నా గుంపు. వారికి నేను మేస్త్రీని. కొందరు నన్ను గుంపు మేస్త్రీ అని అవహేళనగా మాట్లా డినా నేనేం బాధ పడను. ఉద్యోగుల గుంపే నా బలం..నా ధైర్యం. ప్రజలకు, ప్రభుత్వానికి వారధి ఈ గుంపే..’అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఉద్యోగుల ఉచిత ప్రమాద బీమా పథకాన్ని గురువారం రవీంద్రభారతిలో ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ మేరకు వివిధ బ్యాంకులు, రాష్ట్ర ప్రభుత్వం మధ్య పలు ఎంఓయూలకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొని ఉద్యోగులనుద్దేశించి ప్రసంగించారు.  

అనుకోని ఘటనలు జరిగినప్పుడు ఆదుకునేలా.. 
‘ఉద్యోగులుగా విధులు నిర్వహించే వారి భద్రత ప్రభుత్వ బాధ్యత. వారి సంక్షేమాన్ని ప్రభుత్వం బాధ్యతగా నిర్వహించాలి. మొదటగా సింగరేణి కార్మికులకు రూ.కోటి బీమా కల్పించేందుకు డిప్యూటీ సీఎం ప్రతిపాదించినప్పుడు నమ్మకం కలగలేదు. ఒక్క రూపాయి చెల్లించకుండా కోటి రూపాయల బీమా ఎలా సాధ్యమని నాకు సందేహం వచ్చింది. కానీ ప్రమాదవశాత్తూ మరణించిన 45 మంది సింగరేణి కార్మికుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున బీమా సొమ్మును వారికి అందించడంతో ఇది సాధ్యమని నిరూపణ అయ్యింది. అందుకే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ప్రమాద బీమాను అమలు చేయాలని నిర్ణయించాం. బతికున్నప్పుడు ఉన్న బంధాలు చనిపోయిన తరువాత సానుభూతి మాత్రమే చూపుతాయి. ఆర్థికంగా ఆదుకునేవారు చాలా తక్కువ. అనుకోని సంఘటనలు జరిగినప్పుడు కూడా ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించి కుటుంబానికి భరోసా ఇచ్చేందుకే ఈ పథకాన్ని అమలు చేస్తున్నాం. ప్రమాద బీమా ఉద్యోగుల కుటుంబానికి ధైర్యం, భరోసా ఇస్తుంది..’అని సీఎం స్పష్టం చేశారు.  

నేను మీకు ఎప్పటికీ రేవంతన్ననే.. 
‘మేము దొరలం.. మాకు గడీలున్నాయని కొందరిలా నేను గొప్పలు చెప్పుకోను. నా హోదా, పదవి మారినా నేను మీకు ఎప్పటికీ రేవంతన్ననే. మన మధ్యనున్నది అన్నదమ్ముల అనుబంధమే. మీ సోదరుడు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మనందరం కలిసి తెలంగాణను దేశంలోనే నంబర్‌ వన్‌గా తీర్చిదిద్దుదాంం. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను.. పదేళ్ల కేసీఆర్‌ ప్రభుత్వం రూ.8.11 లక్షల కోట్ల అప్పులు చేసి దివాలా తీయించింది. పదేళ్లలో వందేళ్ల విధ్వంసం చేసింది. పదేళ్లలో మొదటి తారీఖున జీతాలు ఇచ్చిన పరిస్థితి ఉందా? ఎన్ని అవాంతరాలు ఎదురైనా ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే ఒకటో తేదీన ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తున్నాం. ఇచ్చిన మాట ప్రకారం విడతల వారీగా రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ విడుదల చేస్తున్నాం..’అని రేవంత్‌ చెప్పారు. 

ఆదాయం పెంచితే మరింత ఖర్చు చేస్తాం 
‘ప్రజలకు విజయవంతంగా అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకంలో ఉద్యోగుల కృషి ఉంది. మీ నమ్మకమే మా బలం. ఉద్యోగులు రోజుకో గంట అదనంగా పనిచేసి రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెంచాలి. ఆదాయాన్ని పెంచితే ప్రజలు, ఉద్యోగుల సంక్షేమం కోసం మరింత ఖర్చు పెడతాం. ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే ఉద్యోగుల చేతుల్లోనే ఉంది. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడి పెట్టుబడులను ఆకర్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. దేశంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలబడాలంటే మీ అందరి సహకారం అవసరం. అక్రమార్కులను కట్టడి చేస్తే ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగుల పీఆర్సీ అంశాన్ని పరిష్కరించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను ఆదేశిస్తున్నా. ప్రజల కోసం తెచ్చుకున్న తెలంగాణలో ఆ ప్రజల కోసం పనిచేసే ఉద్యోగులకు ప్రభుత్వం తోడుగా ఉంటుందని మాట ఇస్తున్నా..’అని ముఖ్యమంత్రి అన్నారు. 

అవన్నీ వద్దని అడ్డుకుంటున్నారు.. 
‘పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్ర అభివృద్ధి కోసం పలు కార్యక్రమాలను కాంగ్రెస్‌ ప్రతిపాదించింది. అసెంబ్లీ వేదికగా ఎన్నో అంశాలను చర్చించింది. ఇప్పుడు వాటిని అమలు చేస్తుంటే ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ అడ్డుకుంటోంది. మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ వద్దంటున్నారు. ఓట్లు వేయని ప్రజలు బాగుపడొద్దన్నట్టుగా ఊరిమీద పడి తిరుగుతున్నారు. ఫామ్‌హౌస్‌లో ఉంటే కుంభకర్ణుడు.. బయటకొస్తే బకాసురుడు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ కోసం సర్వం కోల్పోయినవారికి పదవులు ఇస్తుంటేం అడ్డు పడుతున్నారు. 30 నెలలుగా నేను ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు. మేం రూపొందించిన ప్రణాళికలన్నీ ఇప్పుడు కొలిక్కి వస్తున్నాయి. రాష్ట్ర ప్రయోజనాల కోసం పదే పదే ఢిల్లీ వెళ్తున్నా. పలు ప్రాజెక్టులకు ఆమోదం కోసం కృషి చేస్తున్నా..’అని సీఎం చెప్పారు. 

ఉద్యోగుల సిబిల్‌ స్కోర్‌ను దెబ్బతీశారు: భట్టి 
రాష్ట్రంలో పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉద్యోగుల సిబిల్‌ స్కోర్‌ను పూర్తిగా దెబ్బతీసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. ఉద్యోగుల వేతనాలను 15నుంచి 20వ తేదీ మధ్య ఇచ్చేవారని, దీంతో వారి బ్యాంకు ఖాతాలు బ్యాడ్‌ అయ్యాయని, వారి ఫైనాన్షియల్‌ కమిట్‌మెంట్టు గాడి తప్పాయని అన్నారు. వారి సిబిల్‌ స్కోర్‌ దెబ్బతినడంతో రుణాలు అందే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. ఆ పరిస్థితిని ఇప్పుడు పూర్తిగా చక్కబెడుతున్నామని చెప్పారు. క్రమం తప్పకుండా వేతనాలు, రిటైర్మెంట్‌ బెనిఫిట్లు, ఇతర ఆర్థిక లబ్ధిని వేగంగా ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా సరికొత్తగా ఉచిత బీమా పథకాన్ని ఆమోదించి అమలు చేస్తున్నామన్నారు. ఈ పథకం కింద.. ప్రభుత్వంపై కానీ, ఉద్యోగులపై కానీ ఒక్క రూపాయి కూడా అదనపు భారం పడకుండా, బ్యాంకులతో మాట్లాడి భారీ బీమా రక్షణను కలి్పస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, పొన్నం ప్రభాకర్, మహ్మద్‌ అజహరుద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement