స్పీడ్‌ పెంచిన కేసీఆర్‌.. రేపు బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో విడుదల.. | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ ఎన్నికల మేనిఫెస్టో.. ప్రతిపక్షాలకు షాకిచ్చేలా ప్లాన్‌!

Published Sat, Oct 14 2023 9:20 PM

CM KCR Will Release BRS Election Manifesto Tomorrow - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ జెట్‌ స్పీడ్‌లో దూసుకుపోతోంది. ఈ క్రమంలో రేపు(ఆదివారం) బీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనుంది. 

వివరాల ప్రకారం.. బీఆర్‌ఎస్‌ పార్టీ రేపు మధ్యాహ్నం 12:15 గంటలకు 2023 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టోను విడుదల చేయనుంది. ఆదివారం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ ఎన్నికల మేనిఫెస్టోను సీఎం కేసీఆర్‌ విడుదల చేయనున్నారు. ఇక, అంతకుముందు బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోపై మంత్రి హరీష్‌ రావు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో ప్రతిపక్షాలకు దిమ్మ తిరిగేలా ఉంటుందన్నారు. 

కాగా.. రైతుబంధు, ఆసరా పింఛన్ల పథకం కింద ఇస్తున్న మొత్తాన్ని పెంచడంపై కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం.  కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్‌ కిట్ల మొత్తాన్ని పెంచడంతో పాటు రైతులందరికీ పింఛన్‌ ఇవ్వాలనే ప్రతిపాదన సాధ్యాసాధ్యాలపై అధ్యయనం పూర్తయినట్లు తెలిసింది. రైతుబంధు, సామాజిక పింఛన్లు ఎంత మేర పెంచాలనే అంశంపై సీఎం కేసీఆర్‌ తుది నిర్ణ యం తీసుకోవాల్సి ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

ఇక, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్‌ తేదీకి ఐదు రోజుల ముందు మాత్రమే బీఆర్‌ఎస్‌ పార్టీ తన మేనిఫెస్టోను ప్రకటించింది. అయితే, చాలా తక్కువ వ్యవధి కారణంగా మేనిఫెస్టోలోని అంశాలను ప్రజల్లోకి సరిగా తీసుకెళ్లలేకపోయినట్లు ఆ తర్వాత పార్టీ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే ఈసారి వీలైనంత త్వరగా మేనిఫెస్టో విడుదల చేయాలని కేసీఆర్‌ భావిస్తున్నట్టు పార్టీవర్గాలు వెల్లడించాయి. 

విపక్షాల మేనిఫెస్టోలపై నజర్‌..
గతంలో యువత, రైతు డిక్లరేషన్లు ప్రకటించిన కాంగ్రెస్‌ ఇటీవల తుక్కుగూడ సభ వేదికగా ఆరు గ్యారంటీల పేరిట ఎన్నికల హామీలను ప్రకటించింది. కర్ణాటక ఎన్నికల్లో ఐదు గ్యారెంటీలు ఫలితాన్ని ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణలో ఆరు గ్యారంటీలను కాంగ్రెస్‌ ప్రధానంగా ప్రచారంలో పెడుతోంది. ఎన్నికల మేని ఫెస్టోలో మరిన్ని జనాకర్షక పథకాలను కూడా చేర్చే అవకాశముంది.

అన్ని పథకాల మొత్తాలు పెంపు?
బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తొలిసారిగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆసరా పింఛన్ల మొత్తాన్ని రూ.200 నుంచి రూ.1,000కి పెంచింది. వితంతువులు, వృద్ధులు తదితరులకు ఇచ్చే ఈ పింఛన్‌ను తర్వాత రూ.2,016కు పెంచింది. కాగా ఈ మొత్తాన్ని రూ.3,016కు పెంచే అవకాశముందని, ఈ మేరకు మేనిఫెస్టోలో చేరుస్తున్నట్టు తెలుస్తోంది. వికలాంగుల పింఛన్‌ రూ.1,500తో ప్రారంభమై ప్రస్తుతం రూ.4,016కు చేరింది.

ఈ మొత్తాన్ని కూడా మరో రూ.1,000 మేర పెంచే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక రైతుబంధు పథకం కింద ఏటా రెండు విడతల్లో కలుపుకొని ఎకరానికి రూ.10 వేలు చొప్పున ఇస్తుండగా, దీనిని రూ.12 వేలకు పెంచేలా ప్రతిపాదించినట్లు సమాచారం. అలాగే కేసీఆర్‌ కిట్‌ పథకం కింద ఇస్తున్న రూ.12 వేలను రూ.15 వేలకు పెంచాలనే ప్రతిపాదనపై సీఎం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని మేనిఫెస్టో రూపకల్పన కసరత్తులో పాల్గొంటున్న నేతలు చెప్తున్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకం కింద ఇస్తున్న మొత్తాన్ని కూడా పెంచడం ద్వారా విపక్షాల దూకుడుకు అడ్డకట్ట వేయాలని కేసీఆర్‌ భావిస్తున్నట్టు సమాచారం.

Advertisement
Advertisement