భీమిలి, దెందులూరును మించిపోయేలా రాప్తాడు ‘సిద్ధం’ | Sakshi
Sakshi News home page

భీమిలి, దెందులూరును మించిపోయేలా రాప్తాడు ‘సిద్ధం’

Published Sat, Feb 17 2024 6:59 PM

CM Jagan: Siddham Public Meeting In Raptadu On February 17 - Sakshi

సాక్షి, అనంతపురం: సిద్ధం సభకు సర్వం సిద్ధం అయింది. అనంతపురం జిల్లా రాప్తాడులో రేపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సిద్ధం సభ జరగనుంది. రాయలసీమ జిల్లాల నుంచి లక్షలాది మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమంలో హాజరుకానున్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ... సిద్ధం సభలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే భీమిలి, దెందులూరు బహిరంగ సభలు విజయవంతం అయ్యాయి. రేపు అనంతపురం జిల్లా రాప్తాడులో సిద్ధం సభ జరగనుంది.

రాప్తాడు సమీపంలోని బైపాస్ రోడ్డు వద్ద సుమారు 250 ఎకరాల మైదానం లో సిద్ధం సభ కోసం ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాలకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరుకానున్నారు. లక్షలాది మంది వచ్చే సిద్ధం సభ సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజినల్ కోఆర్డినేటర్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు.

రాప్తాడు బైపాస్ వద్ద బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. పరిసర ప్రాంతాల్లో 16 చోట్ల వాహనాల పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ - బెంగళూరు జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలను విధించారు పోలీసులు. బెంగళూరు నుంచి వచ్చే భారీ వాహనాలు కళ్యాణ దుర్గం మీదుగా మళ్లిస్తారు. అలాగే హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్లే భారీ వాహనాలను ధర్మవరం మీదుగా మళ్లిస్తారు. ఈ ఆంక్షలు భారీ వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది.‌ సాధారణ ప్రయాణికుల వాహనాలు యథావిధిగా రాప్తాడు హైవే పై వెళ్లవచ్చు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సిద్ధం సభకు పెద్ద సంఖ్యలో జనం వస్తారని... ఆ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సీఎం ప్రొగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం తెలిపారు.

రాప్తాడు సిద్ధం సభ నుంచి సీఎం జగన్‌ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. ఏపీలో  సీఎం జగన్‌ పరిపాలనలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగిందని.. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ప్రభంజనం మరోసారి ఖాయమని ఎమ్మెల్యే తోపుదుర్తి పేర్కొన్నారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement