అందుకే ఉద్ధవ్‌కు రెబల్‌గా మారా: సీఎం ఏక్‌నాథ్‌ షిండే | Sakshi
Sakshi News home page

అందుకే ఉద్ధవ్‌కు రెబల్‌గా మారా: సీఎం ఏక్‌నాథ్‌ షిండే

Published Mon, Apr 8 2024 10:49 AM

cm Eknath Shinde Explains Why He Rebelled Against Uddhav Thackeray - Sakshi

నాగ్‌పూర్‌: బాలా సాహేబ్‌ ఠాక్రే స్థాపించిన శివసేనలో ఏక్‌నాథ్‌ షిండే రెబల్‌ నేతగా మారి.. బీజేపీ మద్దతుతో ముఖ్యమంత్రి అ‍య్యారు. తాను ఉద్ధవ్‌ ఠాక్రేకు రెబల్‌ నేతగా మారడానికి గల కారణాన్ని సీఎం ఏక్‌నాథ్‌ షిండే వివరించారు. ఆదివారం పార్టీ కార్యకర్తల మీటింగ్‌లో సీఎం ఏక్‌నాథ్‌ షిండే మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. 

‘నాకు ముఖ్యమంత్రి కావాలనే కోరిక లేదు. కానీ, శివసేన పార్టీలో బాలా సాహేబ్‌ ఠాక్రే సిద్ధాంతాలకు రాజీపడటం వల్లే ఉద్ధవ్‌ ఠాక్రేకు రెబల్‌గా మారాను. బాల సాహేబ్‌ ఠాక్రే పార్టీ కార్యకర్తలను ఎ‍ప్పుడూ స్నేహితుల్లా భావించేవారు. అయితే ఉద్ధవ్‌ ఠాక్రే మాత్రం పార్టీ కార్యకర్తలను పని మనుషులుగా చూశారు’ అని సీఎం ఏక్‌నాథ్‌ షిండే అన్నారు. బలమైన నేతగా ఎదగాలంటే క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలతో కలిసి పని చేయాలన్నారు. ఇంట్లో కూర్చుంటే గొప్ప నేతగా ఎదగలేమని ఉద్ధవ్‌ ఠాక్రేను ఉద్దేశించి ఎద్దేవా చేశారు.

మోదీ మూడోసారి ప్రధాని అయ్యేందుకు అధికారంలో ఉన్న పార్టీకే ఓటు వేయాలని ప్రజలను కోరారు. అదేవిధంగా ప్రతిపక్ష మహావికాస్‌ ఆఘాఢీకి అభివృద్ది చేయాలనే అజెండా లేదని అన్నారు. అధికార కూటమిలోని ఇరు పార్టీల మధ్య సీట్ల పంపకం రెండు, మూడు రోజుల్లో కొలిక్కి వస్తుందన్నారు. అలాగే విదర్భలోని అన్ని సీట్లను అధికార కూటమి కైవసం చేసుకుంటుందని సీఎం షిండే  తెలిపారు.

ఇక.. 2022 జూన్‌లో పలువురు రెబల్‌ ఎమ్మెల్యేలతో కలిసి ఏక్‌నాథ్‌ షిండే శివసేనలో చీలిక తెచ్చి బీజేపీ మద్దతుతో ముఖ్యమంత్రి అ‍య్యారు. అసలు శివసేన పార్టీ ఎవరిదని శివసేన చీలిక వర్గాలు పిటిషన్లు వేయగా.. షిండే వర్గమే అసలైన శివసేన అని స్పీకర్‌  ప్రకటించిన విషయం తెలిసిందే. 

 
Advertisement
 
Advertisement