మోసగాళ్లను నమ్మొద్దు | Sakshi
Sakshi News home page

మోసగాళ్లను నమ్మొద్దు

Published Sat, Mar 30 2024 2:11 AM

Chief Minister YS Jagan call to the people in Emmiganoor Sabha - Sakshi

వారి తోకలు కత్తిరించేలా మీరే స్టార్‌ క్యాంపెయినర్లు కావాలి

ఎమ్మిగనూరు సభలో ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పిలుపు

మీ బిడ్డ మంచి చేసి ఉంటే ఆ మంచిని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి

ఆడబిడ్డల కష్టాలు కళ్లారా చూశా.. అందుకే విప్లవాత్మక పథకాలు

దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళలకు 50% నామినేటెడ్‌ పదవులు

పిల్లల బంగారు భవిష్యత్‌ కోసం విద్యారంగంలో సంస్కరణలు

అన్ని వర్గాల వారికి మంచి చేసిన ప్రభుత్వానికి రాఖీ కట్టండి

మళ్లీ ఆ ముగ్గురు మోసాలు చేసేందుకు కూటమిగా వస్తున్నారు 

వ్యవసాయం దండగన్న బాబు ఓవైపు.. భూమి పుత్రుడైన మీ బిడ్డ మరోవైపు

పేదల తల రాతలు మార్చే ఈ ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయండి

చంద్రబాబు ఈ రోజు శింగనమలకు వెళ్లారు. వైఎస్సార్‌సీపీ ఓ టిప్పర్‌ డ్రైవర్‌కు టికెట్‌ ఇచ్చిందని హేళన చేసి తూలనాడారు. ఆ పిల్లోడు చదువుపై కూడా తప్పులు చెప్పారు. అవునయ్యా.. పేదవాడికి టికెట్‌ ఇచ్చాం. తప్పేముందయ్యా చంద్రబాబూ? వీరాంజనేయులు టిప్పర్‌ డ్రైవరే. కాదని చెప్పలేదు. కానీ అతను చదివింది చంద్రబాబు కంటే పెద్ద చదువులు. ఎంఏ ఎకనామిక్స్‌ చదివి బీఈడీ కూడా చేశాడు. చంద్రబాబు హయాంలో ఉద్యోగాలు దొరక్క టిప్పర్‌ డ్రైవర్‌గా తన కాళ్లపై నిలబడ్డాడు.

వీరాంజనేయులు చాలా ఏళ్లుగా మనకు తోడుగా ఉన్నాడు. అలాంటి పేద కార్యకర్తకు మీ జగన్‌ ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చారు. మీ జగన్‌ 175 అసెంబ్లీ, 25 ఎంపీలలో 200 స్థానాల్లో ఏకంగా 50 శాతం  అంటే 100 సీట్లు నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చారు. పేదవారికి అండగా ఉండే జగన్‌కు, పెత్తందారీ మనస్తత్వం ఉన్న చంద్రబాబుకు మధ్య తేడాను గమనించాలని కోరుతున్నా.

అదే అనంతపురం జిల్లాలో మడకశిర నియోజకవర్గం ఎస్సీలది. అక్కడ మన అభ్యర్థి పేరు లక్కప్ప. చంద్రబాబు అక్కడికి వెళ్లి ఉపాధి హామీ కూలీకీ జగన్‌  టికెట్‌ ఇచ్చారు అని అంటారు. అవునయ్యా.. ఉపాధి కూలీ, పేదవాడైన లక్కప్పకు  టికెట్‌ ఇచ్చాం. జగన్‌కు, చంద్రబాబుకు మధ్య ఇదీ తేడా. మాది పేదల పార్టీ.    – ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

‘పొత్తులు, జిత్తులు, మోసాలు, అబద్దాలు, కుట్రలతో వారు మళ్లీ మీ ముందుకు వస్తున్నారు. మాట నిలబెట్టుకున్న మనకూ, మాట తప్పిన చంద్రబాబుకూ మధ్య ఎన్నికలు జరగబోతున్నాయి. మనందరి ప్రభుత్వంలో లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ జగన్‌ చేసిన మంచిని, చంద్రబాబు మోసాలను ఇంటింటికీ వెళ్లి చెప్పాలి. మోసం చేసిన వారి తోకలు కత్తిరించే స్టార్‌ క్యాంపెయినర్లు మీరే. ఈ ఐదేళ్ల పాలనలో మేలు చేసి చూపించి ప్రజల ఇళ్ల వద్దకు వెళుతున్నాం.

మీకు మంచి జరిగి ఉంటేనే మీ బిడ్డకు అండగా నిలిచేందుకు స్టార్‌ క్యాంపెయినర్లుగా రావాలి’ అని ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా మూడో రోజు శుక్రవారం ఆయన ఎమ్మిగనూరు బహిరంగ సభలో మాట్లాడారు. జన సముద్రంగా మారిన ఎమ్మిగనూరు సభ చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతుందని చెప్పారు.

మే 13న జరిగే కురుక్షేత్ర యుద్ధంలో పేదల పక్షాన నిలిచి పెత్తందారులను ఓడించేందుకు మీరంతా సిద్ధమా.. అని ప్రశ్నించారు. సిద్ధం అంటూ చేతులు పైకెత్తిన ఈ మహా సైన్యం.. పైకి లేచిన ప్రతి చేయి, ఉప్పొంగిన ప్రతి గుండె మా ఇంట గత ఐదేళ్లుగా మంచి జరిగింది అని చెబుతోందన్నారు. ఈ సభలో సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..,  – సాక్షి ప్రతినిధి, కర్నూలు


పిల్లల భవిష్యత్‌ కోసమే సంస్కరణలు  
♦ మా ప్రభుత్వ బడులు బాగుపడుతున్నాయని, మా పిల్లల చదువులు మెరుగు పడుతున్నాయని ప్రతీ గుండె చెబుతోంది. రాష్ట్రంలో ఈ 58 నెలల్లో కనీవినీ ఎరుగని విధంగా విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. 10–16 ఏళ్ల తర్వాత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మన బడుల్లో, విద్యా రంగంలో మార్పులు తీసుకొచ్చిన ప్రభుత్వం మనది. నిలబెట్టే చదువు, తలెత్తుకునే ఉద్యోగాలు, ప్రపంచంలో ఎక్కడైనా బతికేలా అవకాశాలు మన విద్యా విధానంలో తీసుకొచ్చాం.  బడులకు పంపే తల్లులను ప్రోత్సహించేందుకు అమ్మ ఒడిని తీసుకొచ్చాం. నాడు–నేడు, ఇంగ్లిష్‌ మీడియం, తరగతి గదులు, కార్పొరేట్‌ కంటే గొప్పగా 6వ తరగతి నుంచి ఐఎఫ్‌బీ ప్యానల్‌ ద్వారా డిజిటల్‌ బోధన, 8వ తరగతి నుంచి ట్యాబ్‌లు, విద్యా కానుక కిట్లు, గోరుముద్ద, 3వ తరగతి నుంచి సబ్జెక్ట్‌ టీచర్లు, సీబీఎస్‌ఈ నుంచి ఐబీ వరకు మంచి మార్పులు తీసుకొచ్చాం.  

పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తూ పేదల పెద్ద చదువులకు అండగా నిలిచాం. బోధనలో మార్పులు, ఇంటర్న్‌షిప్‌తో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాం. పిల్లలకు ఓట్లు ఉండవని, వారి చదువుల గురించి గతంలో ఏ పాలకుడు పట్టించుకోలేదు. వారి బతుకులు మారాలన్న తపన, తాపత్రయంతో మనం అడుగులు ముందుకు వేశాం. ఈ ఎన్నికలు కేవలం ఓ ఎమ్మెల్యేనో, ఎంపీనో ఎన్నుకునేందుకు తూతూ మంత్రంగా ఓటు వేసేవి కాదు. పిల్లల భవిష్యత్, వారి తల్లిదండ్రుల భవిష్యత్‌ మారుతుందని జ్ఞాపకం ఉంచుకోవాలి.  

ఆడబిడ్డలు ఎదిగేలా అడుగులు వేశాం  
మన బంగారు తల్లులు ఆడబిడ్డలు, అవ్వల కోసం గత ప్రభుత్వం ఏం చేసిందని అడిగితే చెప్పేందుకు ఒక్కటైనా ఉందా? మన రాష్ట్రంలో నూటికి 30 మంది ఆడపిల్లలు పదో తరగతి కూడా పూర్తి చేయలేదు. బాల్య వివాహాలను ఆపే పరిస్థితి కూడా లేదు. తన బిడ్డను, వారి భవిష్యత్‌ను నిర్ణయించే శక్తి తల్లుల చేతుల్లో లేదంటే.. అలాంటి పాలకులు ఉన్నా, లేకున్నా ఒకటే.   

పాదయాత్రలో నా కళ్లతో చూసిన మరో విషయం చెబుతా. పూలు, వరి, తృణధాన్యాల దాకా ప్రతి గింజ ఎవరి నోట్లోకి వెళుతుందో భగవంతుడు రాస్తాడు. ప్రతీ గింజ పండించడంలో అక్క చెల్లెమ్మల పాత్ర ఎంత ఉందో నా కళ్లతో చూశా. పని వాళ్లుగా, రోజు కూలీలుగా చిన్న చిన్న పనులు చేసుకుని జీవిస్తున్న లక్షల మంది వారి బతుకులను ఎంత కష్టంగా లాగుతున్నారో చూశా. వారి బతుకులు మారాలని ఈ 58 నెలల్లో అడుగులు ముందుకు వేశాం. 

రోజు కూలీ, దోశలు.. ఇడ్లీలు అమ్మే ఓ అక్క, కుట్టుమిషన్‌ నడిపే ఓ చెల్లి ఇలా వీరంతా బాగుపడాలి. వీరందరి జీవితాల్లో వెలుగులు రావాలని పథకాలు తీసుకొచ్చాం. ఈ ఆలోచనల నుంచే అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, తోడు, చేదోడు, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా పుట్టాయి.  కుదేలైన పొదుపు సంఘాలు ఆసరా, సున్నా వడ్డీ పథకాలతో ఇవాళ తలెత్తుకుని నిలబడ్డాయి. 45–60 ఏళ్ల వయస్సులో నా అక్కచెల్లెమ్మల జీవితాలను బాగు చేసేందుకు చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం అనే పథకాలు పుట్టాయి.   

చేతల్లో సామాజిక న్యాయం   
స్వాతంత్య్రం వచ్చిన ఈ 77 ఏళ్లలో సామాజిక న్యాయం అంశంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అంటూ అణగారిన వర్గాలకు భరోసా ఇచ్చింది మీ బిడ్డ ప్రభుత్వం. ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు ఇందులో 75 శాతం పైచిలుకు నా.. నా.. అని పిలిచే నా సామాజిక వర్గాలకే వచ్చాయి. మీ బిడ్డ ప్రభుత్వం వచ్చే వరకూ రాష్ట్రంలో 4 లక్షల ఉద్యోగాలు ఉంటే, ఇప్పుడు ఏకంగా మరో 2.30 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం.

ఇందులో 80 శాతం ఉద్యోగాలు ఈ వర్గాల వారే. నామినేషన్‌పై ఇచ్చే ఉద్యోగాలు, కాంట్రాక్టులు ఏకంగా 50 శాతం చట్టం చేసి ఈ వర్గాలకే వచ్చేట్లు చేసింది కూడా మీ ప్రభుత్వమే. రాజ్యసభ నుంచి ఎమ్మెల్సీ, మంత్రి పదవుల వరకూ ఈ వర్గాలకే ప్రాధాన్యత ఇస్తూ పదవులు ఇవ్వడం సప్తవర్ణాల మిశ్రమం, సామాజిక ఇంధ్ర ధనస్సు అని చెప్పేందుకు సంతోష పడుతున్నా.   

భవిష్యత్‌ను మార్చే ఎన్నికలివి 
దేశంలో తొలిసారి ఆలయ బోర్డులు, మార్కెట్‌ కమిటీలు, రాజకీయ నియామకాల్లో ఏకంగా 50 శాతం పదవులకు చట్టం చేసి మహిళలకు ఇచ్చిన ప్రభుత్వానికి రక్షాబంధన్‌ కట్టాలి. బ్యాంకులకు వెళ్లి.. మహిళల అకౌంట్లలో చంద్రబాబు ఐదేళ్ల వివరాలు, మన ప్రభుత్వంలోని ఐదేళ్ల వివరాలు చూడండి. చంద్రబాబు పాలనలో మీ ఖాతాలకు ఒక్క రూపాయి అయినా వచ్చిందా? మీ బిడ్డ ప్రభుత్వ హయాంలో రూ.2.70 లక్షల కోట్లు జమ చేశాం. ప్రతిపక్షం మాయలు, మోసాల్ని నమ్ముకుంటే.. మీ ప్రభుత్వం మీకు చేసిన మంచిని నమ్ముకుంది. ఈ ఎన్నికలు 2.5 కోట్ల మంది అక్క చెల్లెమ్మలు.. వారి భవిష్యత్, వారి పిల్లల భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలని గుర్తు పెట్టుకోవాలి. 

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని గట్టిగా నమ్మిన ప్రభుత్వం ఇది. రైతు భరోసా ద్వారా పెట్టుబడి సాయంగా ఏటా రూ.13,500 చొప్పున ఈ 58 నెలల్లో ఏకంగా రూ.67,500 ప్రతీ రైతు చేతిలో పెట్టాం. చంద్రబాబు ఐదేళ్లలో రూ.87,612 కోట్లు రుణమాఫీ చేస్తానని మోసం చేశారు. చంద్రబాబు హయాంలో రాత్రి పూట 12 గంటలకు ఎప్పడో కరెంట్‌ వచ్చేది. ఈ రోజు పగటి పూటే నాణ్యమైన విద్యుత్‌ ఇస్తున్నాం. విత్తనం నుంచి పంట కొనుగోలు దాకా ఆర్బీకేలు చేయి పట్టుకుని నడిపిస్తున్నాయి.

ప్రతి ఎకరాకు ఈ క్రాప్‌ చేసి రైతులకు ఉచిత పంటల బీమా ఇస్తున్నాం. వరదలు, తుపాన్‌లు వచ్చి రైతులకు నష్టం జరిగితే ఆ సీజన్‌లోనే ఇన్‌ఫుట్‌ సబ్సిడీ ఇచ్చేది మీ బిడ్డ ప్రభుత్వంలోనే. అసైన్డ్, ఇనాంతో పాటు 22ఏకు సంబంధించిన 35 లక్షల ఎకరాల భూములపై శాశ్వత భూ హక్కులు కల్పించిన ప్రభుత్వం ఇది. రైతు పేరు పలకడమే నేరంగా భావించి, వారిని మోసం చేయడం, వ్యవసాయం దండుగ అనే పార్టీలకు మద్దతిస్తారా? మీకు అండగా నిలిచే మీ భూమిపుత్రుడికి అండగా నిలుస్తారా?   

మంచి చేసిన ప్రభుత్వానికి రాఖీ కట్టండి  
 నా చేతికి మాత్రమే కాదు.. మంచి చేసిన మీ ప్రభుత్వానికి రాఖీ కట్టాలని కోరుతున్నా. 31 లక్షల ఇళ్లపట్టాలు ఇచ్చిన, 22 లక్షల ఇళ్లు నిర్మిస్తున్న ప్రభుత్వానికి రాఖీ కట్టాలి. దిశ యాప్‌ ద్వారా 35 వేల మంది అక్క చెల్లెమ్మలు ఆపదలో ఉంటే వారికి భద్రత కల్పించిన ప్రభుత్వానికి రక్షా బంధన్‌ కట్టాలి. మహిళా పోలీసును ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి రక్షాబంధన్‌ కట్టాలి. అవ్వా, తాతలకు.. అభాగ్యులైన అక్కచెల్లెమ్మలకు, దివ్యాంగులకు ఒకటో తేదీన, సెలవైనా సూర్యోదయానికి ముందే వారి చేతిలో పింఛన్‌ పెట్టేందుకు వలంటీర్‌ను ఇంటికే పంపిన ప్రభుత్వానికి రాఖీ కట్టాలి. 

పింఛన్‌ తీసుకునే 66 లక్షల మందిలో అవ్వలు, వితంతు అక్క చెల్లెమ్మలు 45 లక్షల మంది ఉన్నారు. వీరందరూ మీ ప్రభుత్వానికి రక్షాబంధన్‌ కట్టాలని కోరుతున్నా. ఈ 58 నెలల్లో లంచాలు, వివక్ష లేకుండా నేరుగా రూ.2.70 లక్షల కోట్లు ప్రజలకు ఇచ్చాం. అందులో రూ.1.90 లక్షల కోట్లు కేవలం నా అక్క చెల్లెమ్మలకు ఇచ్చి మహిళ సాధికారతను ఉద్యమంగా నడిపిన ప్రభుత్వం ఇది. వారి భవిష్యత్‌ కోసం రక్షాబంధన్‌ కట్టాలని కోరుతున్నా. 

బాబు తోక కత్తిరించండి  
ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్‌ మీడియం వద్దని అడ్డుకున్న వారికి బుద్ది చెప్పండి. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కులాల మధ్య సమతుల్యత దెబ్బతింటుందని కోర్టుల్లో కేసులు వేసిన వారు, బీసీల తోకలు కత్తిరిస్తాం.. ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా? అనే చంద్రబాబు తోకను మరోసారి కత్తిరించాలని కోరుతున్నా. నాన్న ఇచ్చిన 4 శాతం రిజర్వేషన్లను పణంగా పెట్టడమే కాకుండా, గత 30 ఏళ్లుగా చెలగాటం ఆడుతున్న బాబును ఏ ఒక్కరైనా సమర్థిస్తారా? ఈ వర్గాలన్నీ నేను అక్కున చేర్చుకున్న వర్గాలు.  

బాబుకు నా.. నా.. అని పిలచుకునే వర్గాలు హైదరాబాద్‌ మెట్రోలో హైటెక్‌సిటీలో ఉన్నాయి. ఇక్కడ లేవు. ఓ ఈనాడు, ఆంధ్ర‡జ్యోతి, టీవీ–5 వీరికి తోడు ఓ దత్తపుత్రుడు. వీరు మన రాష్ట్రంలో ఉండరు. చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చేది వెన్నుపోటు, మోసాలు మాత్రమే. ఐదేళ్ల కిందట ఓ దత్తపుత్రుడు, ఢిల్లీ నుంచి మోడీని తెచ్చుకుని ఇదే చంద్రబాబు 2014లో మేనిఫెస్టో అని చెప్పి రంగు రంగుల కాగితాలు తీసుకొచ్చారు. 650 హామీలు ఇచ్చారు. ఇవి ప్రజలు మర్చిపోతారు అని ముఖ్యమైన హామీలు అంటూ ఓ కరపత్రం (చేత్తో పట్టుకుని చూపిస్తూ) సంతకం చేసి ప్రతీ ఇంటికి పంపారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5లో ప్రకటనలు ఇచ్చారు. 

చంద్రబాబు మోసాలు ఇవిగో.. 
 రైతులకు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నారు. రూ. 87,612 కోట్లు మాఫీ చేశాడా? 
 డ్వాకా రుణాలు పూర్తిగా రద్దు చేస్తామన్నారు. రూ.4,205 కోట్లు. ఒక్క రూపాయి అయినా మాఫీ చేశారా?   
 ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు బ్యాంకులో డిపాజిట్‌ చేస్తామన్నారు. ఎవరికైనా రూపాయి డిపాజిట్‌ చేశారా?   
 ఇంటింటికీ ఓ ఉద్యోగం.. లేదా నెలకు రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఐదేళ్లలో రూ.1.20 లక్షలు ఇచ్చారా?  
 అర్హులైన వారికి 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు సాయం ఇస్తామన్నారు. ఒక్కరికైనా సెంటు స్థలం ఇచ్చారా?  
రూ.10వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్, చేనేత, మహిళ రుణాలు మాఫీ, ఉమెన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్, రాష్ట్రాన్ని సింగపూర్‌కు మించి అభివృద్ధి, ప్రతీ నగరాన్ని హైటెక్‌సిటీగా నిర్మించడం ఇలా ఎన్నో హామీలు ఇచ్చారు. మీ నగరంలో, జిల్లాలో హైటెక్‌సిటీ ఎక్కడైనా కన్పించిందా? 
ఇదే చంద్రబాబు, దత్తపుత్రుడు మోడీ ఫొటో పెట్టుకుని ఇంటింటికీ పంపిన ఈ కరపత్రంలో కనీసం ఒక్కటైనా చేశారా? పోనీ ప్రత్యేక హోదా అయినా తెచ్చారా? 

మన టార్గెట్‌ 175కు 175 
ఒక్క హామీ నెరవేర్చకపోగా, ఇప్పుడు ఎన్నికలు వచ్చేసరికి, మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమయ్యారు. మళ్లీ దత్తపుత్రుడు, చంద్రబాబు, మోడీ ఇదే ముగ్గురూ కలిసి సూపర్‌సిక్స్, సూపర్‌సెవన్‌ అంటున్నారు. ప్రతి ఇంటికీ కిలో బంగారం, బెంజ్‌ కారు కొనిస్తారట. ఇలాంటి మోసాల నుంచి రాష్ట్రంలోని పేదల భవిష్యత్‌ను కాపాడుకోవాలా? వద్దా? ఈ యుద్ధానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమేనా? సిద్ధం అంటే జేబులో నుంచి సెల్‌ఫోన్‌లు బయటకు తీసి పేదవాడి భవిష్యత్‌ కోసం మేమంతా సిద్ధం అని లైట్‌ వేసి పిలుపునివ్వండి. (ప్రజలందరూ సెల్‌లో టార్చ్‌ ఆన్‌ చేసి మద్దతు పలికారు).

మీకు మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు అండగా నిలిచేందుకు స్టార్‌ క్యాంపెయినర్లుగా రావాలి. ఈ ఎన్నికల్లో మన టార్గెట్‌ 175కు 175. 25కు 25 ఎంపీలు గెలవాలి. కర్నూలు పార్లమెంట్‌ అభ్యర్థి బీవై రామయ్య, ఎమ్మిగనూరు, ఆదోని, ఆలూరు, కర్నూలు, కోడుమూరు, మంత్రాలయం, పత్తికొండ ఎమ్మెల్యేలుగా బుట్టారేణుక, సాయిప్రసాద్‌రెడ్డి, విరూపాక్షి, ఇంతియాజ్, డాక్టర్‌ సతీశ్, బాలనాగిరెడ్డి, శ్రీదేవిని నిండు మనస్సుతో ఆశీర్వదించి ఫ్యాన్‌ గుర్తుకు ఓట్లు వేసి, వేయించి గెలిపించాలి. 

సంక్షేమంతో ఎమ్మిగనూరుకు రూ.650 కోట్లు..
పేదలకు కార్పొరేట్‌ స్థాయి విద్య, వైద్యాన్ని అందించేందుకు ముఖ్యమంత్రి జగన్‌ తీసుకున్న చర్యలు అమోఘం. ముఖ్యమంత్రి జగన్‌ చొరవతో ఒక ఎమ్మిగనూరు నియోజకవర్గంలోనే వివిధ సంక్షేమ పథకాల రూపంలో పేదలకు రూ.650 కోట్ల మేర లబ్ధి చేకూరింది. దశాబ్ద కాలంగా పెండింగ్‌లో ఉన్న నాగలదిన్నె బ్రిడ్జిని పూర్తి చేసిన ఘనత సీఎం జగన్‌దే. గాజులదిన్నె ప్రాజెక్టును ఆధునీకరించడం, గాజులదిన్నెకు హంద్రీనీవా నుంచి 3 టీంఎంసీల నీటిని తరలించే అవకాశాన్ని కల్పించింది కూడా ముఖ్యమంత్రి జగనే.

సామాజిక న్యాయం లక్ష్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుంది. ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేశాక ఎమ్మిగనూరు నియోజకవర్గంలో చేనేతల సంక్షేమానికి టైక్స్‌టైల్‌ హబ్‌ను విస్తరించడంతోపాటు సాగు, తాగునీటి అవసరాలు తీర్చేందుకు మరిన్ని ఎత్తిపోతల పథకాలను చేపట్టాలని కోరుతున్నా.

పేద వర్గాలకు అందుతున్న పథకాలు కొనసాగాలన్నా, మరింత మెరుగుపర్చాలన్నా వైఎస్‌ జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ప్రతి పేదవాడి గుండెల్లో ఆనందం నింపాలనే లక్ష్యంతో ఐదేళ్ల పాటు సుపరిపాలన అందించిన ముఖ్యమంత్రి జగన్‌ ప్రభుత్వానికి మరోసారి పట్టం కట్టాలి. బీసీ మహిళనైన నాకు ఎమ్మిగనూరు అభ్యర్థిగా అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నా.– బుట్టా రేణుక, ఎమ్మిగనూరు వైఎస్సార్‌సీపీ అసెంబ్లీ అభ్యర్థి  

చిన్నా.. నేనున్నా! 
♦ చూపులేని చిన్నారికి సీఎం భరోసా
♦ తక్షణమే స్పందించిన సీఎంవో 
కర్నూలు జిల్లా పెంచికలపాడులో సీఎం వైఎస్‌ జగన్‌ రాత్రి బస చేసిన శిబిరం నుంచి శుక్రవారం ఉదయం బస్సు యాత్ర ప్రారంభమైన సమయంలో గ్రామానికి చెందిన రేష్మ అనే మహిళ తన నాలుగేళ్ల కుమార్తె పింజరి జుహతో కలసి ఆయన వద్దకు వచ్చింది. పుట్టుకతోనే తన కుమార్తెకు రెండు కళ్లు కనిపించవని సీఎం జగన్‌ వద్ద ఆవేదన వ్యక్తం చేసింది.

మూడు ఆసుపత్రుల చుట్టూ తిరిగినా పాపకు కంటి చూపు రాదని డాక్టర్లు చెప్పారని విలపించింది. కనీసం పెన్షనైనా మంజూరు చేస్తే పాపకు అవసరమైన మందులకు ఉపయోగపడుతుందని అభ్యర్థించారు. దీనిపై తక్షణమే స్పందించిన ముఖ్యమంత్రి జగన్‌ తన పీఏ ద్వారా సమాచారాన్ని సీఎంవోకు చేరవేశారు. సీఎంవో కార్యాలయం అధికారులు పాపకు సంబంధించి వివరాలను సేకరించారు. 

Advertisement
 
Advertisement