కేసీఆర్‌కు పదవులిచ్చింది కాంగ్రెస్సే.. | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌కు పదవులిచ్చింది కాంగ్రెస్సే..

Published Sun, Dec 17 2023 4:28 AM

The Chief Minister lashed out at KTRs speech in the Assembly - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘పదే పదే గత కాంగ్రెస్‌ పాలన గురించి, ప్రభుత్వాల గురించి (కేటీఆర్‌) మాట్లాడుతున్నారు. గత పాలనలోనే కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు యూత్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిందే కాంగ్రెస్‌ పార్టీ. కాంగ్రెస్‌ తరఫున సింగిల్‌ విండో డైరెక్టర్‌గా పోటీకి అవకాశమిస్తే ఓడిపోయారు. కేసీఆర్‌ను ఎంపీగా గెలిపించింది కాంగ్రెస్‌ పార్టీనే. ఆయనకు నౌకాయాన శాఖ, ఆ తర్వాత కార్మిక శాఖ మంత్రి పదవులు ఇచ్చింది.

కేసీఆర్‌ కుటుంబ సభ్యుడి (హరీశ్‌రావు)ని ఎమ్మెల్యే కాక ముందే మంత్రిని చేసింది. ఆ తర్వాత ఎమ్మెల్యే కావడానికి సహకరించింది’ అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానంపై శనివారం అసెంబ్లీలో జరిగిన చర్చలో బీఆర్‌ఎస్‌ సభ్యుడు కేటీఆర్‌ చేసిన విమర్శలకు ముఖ్యమంత్రి గట్టి కౌంటర్‌ ఇచ్చారు.

వారి గౌరవానికి తగదు: ‘కొంతమంది ఎన్నారైలకు ప్రజాస్వామిక స్ఫూర్తి అర్థం కాదు. ప్రజాస్వామ్యంలో 49కి సున్నా, 51కి వంద శాతం విలువ ఉంటది. 51 శాతం సీట్లు ఉన్న వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తరు. 49 శాతం ఉన్న వారు ప్రతిపక్షంలో కూర్చొని ప్రభుత్వం తీసుకునే పరిపాలన నిర్ణయాలు, శాసనాలను సహేతుకంగా విశ్లేషించి సలహాలు, సూచనలు ఇస్తారు. వారు 64 మంది ఉంటే, మేము 39 మంది ఉన్నం. మేము అచ్చోసిన ఆంబోతుల్లాగా ఉన్నం. మేం పోడియంలోకి వచ్చి కుస్తీలు కొట్లాడుతం అని మాట్లాడటం సరికాదు. ఈ రకమైన భాష వారి గౌరవానికి, ఈ సభను నడిపించుకోవడానికి సహకరించదు’ అని కేటీఆర్‌పై రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. 

గత కాంగ్రెస్‌ పాలనలో బీఆర్‌ఎస్‌కూ భాగస్వామ్యం
గతం గురించి మాట్లాడాలని ఉంటే సభలో ఒక రోజంతా జూన్‌ 2, 2014కి ముందు జరిగిన 55 ఏళ్ల పరిపాలనపై చర్చ పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని రేవంత్‌రెడ్డి అన్నారు. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి నాయకత్వమే దేశానికి బలమైనదని, బీఆర్‌ఎస్‌ నేతలు అందులో మంత్రులుగా పనిచేశారన్నారు. ‘పోతిరెడ్డిపాడు పొక్కపెద్దది చేసినప్పుడు నాయిని నరసింహారెడ్డి కడప జిల్లా ఇన్‌చార్జి మంత్రి. దానికి వ్యతిరేకంగా ఆనాడు పోరాడింది పి.జనార్దన్‌ రెడ్డి ఒక్కరే.

ఇక్కడ ఉన్నోళ్లు ఎవరూ (బీఆర్‌ఎస్‌ సభ్యులు) ప్రాణత్యాగాలు చేస్తామని కొట్లాడలేదు. 2014 జూన్‌ 2 నుంచి జరిగిన పరిపాలన, విధ్వంసం, నాయకత్వ వ్యవహారశైలి మీదే ప్రస్తుతం చర్చిస్తున్నాం. గత కాంగ్రెస్‌ పాలనలో చాలామంది బీఆర్‌ఎస్‌ సభ్యులకు పాత్ర ఉంది. వారు మంత్రులుగా కూడా చేశారు. దానం నాగేందర్, శ్రీనివాస్‌ యాదవ్, హరీశ్‌రావు, కడియం, పోచారం, గంగుల కమలాకర్‌ వంటి వాళ్లందరూ కాంగ్రెస్‌ పాలనలో పనిచేసిన వారే.

ఏవైతే పాపాలు జరిగాయని కేటీఆర్‌ అంటున్నారో, ఆ పాపాల్లో సంపూర్ణమైన బాధ్యత వాళ్లదే’ అని రేవంత్‌ చెప్పారు. వరంగల్‌లో జరిగిన ఎన్‌కౌంటర్లకు కారణం ఎవరని ఆయన ప్రశ్నించారు. తమకు ఐదేళ్ల సమయం ఉందని, గత పదేళ్లలో జరిగిన పాలనపై ఎక్స్‌రే తీసినట్టుగా ఎక్కడ ఏం ఉన్నాయో అన్ని వివరిస్తామని చెప్పారు. గత పదేళ్లలో జరిగిన విధ్వంసం, ఆర్థిక నేరాలపై చర్చకు పెడతామని రేవంత్‌ పేర్కొన్నారు. 

చీమలు పెట్టిన పుట్టలో చేరిన పాము..
‘‘ఇప్పుడు మాట్లాడుతున్న ఆయన (కేటీఆర్‌) ఎలా ఎమ్మెల్యే అయ్యారు? వారి తండ్రి (కేసీఆర్‌) గురువు అయిన చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని ఆ పార్టీ (టీడీపీ) కండువా కప్పుకున్నారు. కేకే మహేందర్‌ రెడ్డి సిరిసిల్లలో (టీఆర్‌ఎస్‌) పార్టీని నిర్మించుకుని తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడారు. చీమల పుట్టలో పాములు దూరినట్టు ఎన్‌ఆర్‌ఐగా.. అంటే ‘నాన్‌ రిలయబుల్‌ ఇండియన్‌’గా మేనేజ్‌మెంట్‌ కోటాలో టికెట్‌ తీసుకుని సిరిసిల్ల నుంచి కేటీఆర్‌ పోటీ చేశారు. మహేందర్‌ రెడ్డికి అన్యాయం చేసి ఈరోజు ఇక్కడికి వచ్చారు’’ అని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

Advertisement
Advertisement