
నల్లగొండలో మీడియాతో మాట్లాడుతున్న కేటీఆర్. చిత్రంలో జగదీశ్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి
కమీషన్ల గురించి మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చెబుతున్నారు
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో శవాలూ తీయలేని దద్దమ్మ ప్రభుత్వమిది
నోటీసులకు, విచారణకు భయపడం.. ప్రభుత్వాన్ని వదిలిపెట్టం
బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నల్లగొండ టూటౌన్: ఎన్నికల వాగ్దానాలను అమలు చేయకుండా ప్రజల దృష్టి మరల్చేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ప్రచారం చేస్తోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ప్రభుత్వం కుట్ర పూరితంగా ఇచ్చే నోటీసులకు, విచారణలకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. నల్లగొండ పట్టణంలో బుధవారం ఓ వివాహానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వానిది ప్రజాపాలన కాదని, పర్సంటేజీల పాలన అని విమర్శించారు.
కమీషన్లు ఇవ్వనిదే ఈ ప్రభుత్వంలో పనులు కావని స్వయంగా మంత్రులు, ఎమ్మెల్యేలే బహిరంగ వేదికలపైనే చెబుతున్నారని అన్నారు. 20 శాతం, 30 శాతం కమీషన్లు తీసుకుంటున్నారని కాంట్రాక్టర్లు రాష్ట్ర సచివాలయంలోనే ధర్నా చేశారని గుర్తుచేశారు. ఈ కమీషన్ల వ్యవహారం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కమిషన్ల ఏర్పాటు, నోటీసులు అంటున్నారని ఎద్దేవా చేశారు.
ఇది దద్దమ్మ ప్రభుత్వం: ఇచ్చిన హామీలు నెరవేర్చే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని కేటీఆర్ విమర్శించారు. ‘ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ కూలిపోయి గురువారానికి మూడు నెలలు పూర్తవుతుంది. అందులో చనిపోయినవారి శవాలను కూడా తీసుకురాలేని దద్దమ్మ ప్రభుత్వం ఇది. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోతే ఇప్పటివరకు విచారణ లేదు. అందుకు కారణమైన సంస్థపై చర్యలు లేవు. కాంగ్రెస్ వచ్చాక వట్టెం పంపుహౌస్ మునిగింది. పెద్దవాగు రెండుసార్లు కొట్టుకుపోయినా చర్యలు లేవు.
కాంగ్రెస్, బీజేపీ కలిసి కాళేశ్వరం ప్రాజెక్టును విఫల ప్రాజెక్టుగా ప్రచారం చేస్తున్నా ప్రజలకు వాస్తవాలు తెలుసు. దేశంలో చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద తమకు సంపూర్ణ నమ్మకం ఉంది. ఎన్ని నోటీసులు ఇచ్చినా న్యాయం, ధర్మమే గెలుస్తుంది. తెలంగాణకు మేలు చేసినవారిని ఆ దేవుడే కాపాడుతాడు. ఎన్ని నోటీసులు ఇచ్చినా హామీలు అమలు చేసేంతవరకు ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు’అని తేల్చి చెప్పారు. కేసీఆర్ వెంట మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి తదితరులు ఉన్నారు.