
ఒకే అంశంపై రోజుకో రీతిలో మాట్లాడుతున్నాడు: కేటీఆర్
పర్సంటేజీల నుంచి దృష్టి మళ్లించేందుకే కేసీఆర్‌కు నోటీసులు
కాళేశ్వరాన్ని కూల్చి మళ్లీ నిర్మించి కమీషన్లు తీసుకోవాలనే కుట్ర
పీసీ ఘోష్ కమిషన్ విచారణ పూర్తయినా పొడిగింపు ఎందుకు?
మిస్ వరల్డ్ పోటీలకు మంత్రులు టూర్ గైడ్లుగా పనిచేస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిలో ఒక అపరిచితుడు ఉన్నాడని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఆయనకు ’మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్’ అనే భయంకరమైన మానసిక రుగ్మత ఉండటంతో ఒకే అంశంపై రోజుకో రీతిలో మాట్లాడుతున్నారని అన్నారు. తెలంగాణ భవన్‌లో గురువారం కేటీఆర్ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టి నిర్వహించారు. ‘పర్సంటేజీల పాలన నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు నోటీసులు అంటూ కాంగ్రెస్ నీచ రాజకీయాలు చేస్తోంది.
పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేసిన దుష్ప్రచారం సుప్రీంకోర్టు సాక్షిగా తేలి పోయి నిజాలు బయటకు వచ్చాయి. కాళేశ్వరంపై కాంగ్రెస్, బీజేపీ కలసికట్టుగా చేస్తున్న దు్రష్పచారం కూడా త్వరలో తేలిపోతుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం నియమించిన పీసీ ఘోష్ తన విచారణ పూర్తయిందని, నివేదిక సిద్ధంగా ఉందని చెప్పారు. కానీ తిరిగి కమిషన్ గడువును ఎందుకు పొడిగించారో చెప్పాలి’అని డిమాండ్ చేశారు.
కాళేశ్వరం అంశానికి సంబంధించి కేసీఆర్, హరీశ్‌రావుకు నేరుగా నోటీసులు అందినట్లు సమాచారం లేదని కేటీఆర్ తెలిపారు. నోటీసులు అందిన తర్వాత విచారణకు హాజరు కావడంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్ని బరాజ్‌లను కూలగొట్టి మళ్లీ టెండర్లు పిలవడం ద్వారా 20 నుంచి 30 శాతం కమీషన్లు తీసుకోవాలన్నదే ఈ నోటీసుల వెనుక ఉన్న అసలు ఎజెండా అని ఆరోపించారు.
రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే..
రాష్ట్రంలో 500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే సీఎం అందాల పోటీల్లో తలమునకలై ఉన్నారని కేటీఆర్ విమర్శించారు. అన్నదాతల ధాన్యం వర్షంలో కొట్టుకుపోతుంటే.. రేవంత్ అందాల పోటీలకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. గుల్జార్ హౌస్‌లో అతిపెద్ద అగ్ని ప్రమాదం జరిగితే కనీసం చూడటానికి కూడా వెళ్లని సీఎం.. అందాల పోటీలకు మాత్రం నాలుగు సార్లు హాజరయ్యారని ధ్వజమెత్తారు.
రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఒక్క రూపాయి కూడా లేదంటూనే అందాల పోటీలకు రూ.200 కోట్లు ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు. మంత్రులంతా మిస్‌వరల్డ్ పోటీదారులకు టూర్ గైడ్లుగా మారిపోయారని ఎద్దేవా చేశారు. మిస్ వరల్డ్ పోటీదారులకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులను చూపిస్తున్నారని, నిజాంలు, కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులు మినహా చూపించేందుకు కాంగ్రెస్ కట్టిన ఒక్క ప్రాజెక్టు కూడా లేకుండా పోయిందని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
అభిప్రాయభేదాలు సహజం
రాజకీయ పార్టీల్లో అభిప్రాయ భేదాలు సహజమని కేటీఆర్ అన్నారు. ‘నలుగురు కుటుంబ సభ్యులు ఉన్న ఇంట్లోనే కొన్ని విషయాల్లో అభిప్రాయ భేదాలు వస్తాయి. అలాంటిది లక్షల మంది కార్యకర్తలు ఉన్న పార్టీలో అభిప్రాయ భేదాలు ఉండడం సహజమే. వాటిని పక్కనపెట్టి అధిష్టానం ఎవరికి టికెట్ ఇస్తే వారి గెలుపు కోసం ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పని చేయాలి’అని సూచించారు. గురువారం హైదరాబాద్‌లో తనను కలిసిన నిర్మల్ జిల్లా బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.