
తొలిదశ మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు జారీ
జిల్లాల వారీగా ఎక్కడికక్కడ విడుదల చేయనున్న అధికారులు
వెనువెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం
మొదటి దశలో 292 జెడ్పీటీసీ, 2,963 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు
ఏర్పాట్లపై కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్‌ఈసీ వీడియో కాన్ఫరెన్స్
ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించాలని ఆదేశం
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా తొలివిడత జరిగే మండల, జిల్లా ప్రజా పరిషత్ ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్లు జారీ కానున్నాయి. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ఇచ్చిన జీవో, రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ జారీపై అప్పటికప్పుడు స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించడంతో, ముందుగా నిర్ణయించిన ప్రకారం ఎన్నికల నోటిఫికేషన్లు జారీ చేసేందుకు ఆటంకం లేకుండా పోయింది. దీంతో గురువారం.. తొలిదశలో ఎన్నికలు జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు జిల్లాల వారీగా అధికారులు ఎక్కడికక్కడ నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు.
మొత్తం 31 జిల్లాల్లో (హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి అర్బన్ జిల్లాలు మినహాయించి) ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఖాళీల వివరాలతో అధికారులు ఇప్పటికే గెజిట్ విడుదల చేశారు. ఒక్కో దశకు ఆయా తేదీలకు అనుగుణంగా ఎక్కడికక్కడ రిటరి్నంగ్ అధికారులు ఆయా స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. ఈ ఎన్నికల నోటీసులు జారీ చేసిన రోజు కలిపితే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు మూడురోజుల పాటు అవకాశం ఉంటుంది.
ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలి: మొదటి విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్, నామినేషన్ల ప్రక్రియ గురించి జిల్లా కలెకర్లు, ఎస్పీలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఐ.రాణీకుముదిని బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తీరు, గురువారం ఉదయం నుంచి నోటిఫికేషన్ల జారీ, ఇతర అంశాలకు సంబంధించి తీసుకుంటున్న చర్యలు, చేసిన సన్నాహాల గురించి ఆరా తీశారు.
అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని సూచించారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని, ఎక్కడా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఎస్‌ఈసీ ఆదేశాల మేరకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ, నోటిఫికేషన్ల జారీకి సిద్ధంగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్లు తెలిపారు. ఇప్పటికే ఎన్నికల అధికారులకు శిక్షణ, పునఃశ్చరణ శిక్షణ కూడా పూర్తిచేశామన్నారు.
5 దశల్లో స్థానిక సమరం
మొత్తం అయిదు దశల్లో జరిగే మండల, జిల్లా పరిషత్, గ్రామపంచాయతీ ఎన్నికలకు గాను..తొలి రెండు దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు (మొదటి విడత అక్టోబర్ 23న, రెండో విడత అక్టోబర్ 30న) జరగనున్నాయి. ఆ తర్వాత మూడు విడతల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు..సర్పంచ్, వార్డు సభ్యులకు (మొదటి దశ అక్టోబర్ 31న, రెండోదశ నవంబర్ 4న, మూడోదశ నవంబర్ 8న ) ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గత నెల 29న విడుదల చేసిన విషయం తెలిసిందే.
అక్టోబర్ 9న మొదటి దశ మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీతో మొదలయ్యే స్థానిక ఎన్నికల ప్రక్రియ నవంబర్ 11న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాల వెల్లడితో ముగియనుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల ఓట్ల కౌంటింగ్ నవంబర్ 11న (రెండు దఫాలకు కలిపి) జరగనుండగా.. సర్పంచ్, వార్డు సభ్యుల ఓట్ల లెక్కింపు ఎప్పటికప్పుడు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు. హైకోర్టు స్టే ఉత్తర్వులకారణంగా ములుగు జిల్లా మంగపేట మండలంలోని 14 ఎంపీటీసీ స్థానాలకు, 25 గ్రామపంచాయతీలు, 230 వార్డులకు ఎన్నికలు జరగడం లేదు. అలాగే కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని కుర్మపల్లి, రామచంద్రాపూర్ పంచాయతీలరే, వీటిలోని 16 వార్డులకు కూడా ఎన్నికలు నిర్వహించడం లేదు.
నోటిఫికేషన్లకు ఏర్పాట్లు పూర్తి
31 జిల్లాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ మొదటి దశ ఎన్నికలకు నోటిఫికేషన్ల జారీకి జిల్లా ఎన్నికల అధికారులు (కలెక్టర్లు) ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదటి దశలో మొత్తం 53 రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 292 మండలాల పరిధిలో ఉన్న 292 జెడ్పీటీసీ, 2,963 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎంపీటీసీలకు మండల కార్యాలయాల్లో, జెడ్పీటీసీల కోసం జిల్లా పరిషత్‌కార్యాలయాల్లో నామినేషన్లు స్వీకరించనున్నారు.
నాలుగైదు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు కలిపి ఒక రిటర్నింగ్ అధికారిని నియమించారు. మొదటి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ల జారీ, నామినేషన్లు స్వీకరణ, ఎన్నికల కోడ్ అమలు, భద్రతా ఏర్పాట్లపై బుధవారం జిల్లా కలెక్టర్లు.. జిల్లా అధికారులు, రిటర్నింగ్ అధికారులు, తహసీల్దార్‌లు, ఎంపీడీవోలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.