ఇన్‌చార్జిలుగా కేటీఆర్, హరీశ్ సహా ఐదుగురు మాజీ మంత్రులు
12 నుంచి క్షేత్ర స్థాయిలోపార్టీ ప్రచారం షురూ
వార్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు వ్యూహాలకు పదును
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించిన ప్రచార వ్యూహం అమలు, పార్టీ నేతలు, ప్రచార బృందాల నడుమ సమన్వయం తదితరాల కోసం ‘వార్ రూమ్’ ఏర్పాటు చేయాలని బీఆర్‌ఎస్ నిర్ణయించింది. వార్ రూమ్ ఇన్‌చార్జిలుగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుతో పాటు మాజీ మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, మహమూద్ అలీ వ్యవహరిస్తారు.
ఈ నెల 12 నుంచి క్షేత్ర స్థాయిలో పార్టీ ప్రచారాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. పండితుల సూచనల మేరకు మంచి ముహూర్తం చూసుకుని మాగంటి సునీతా గోపీనాథ్ బీఆర్‌ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తారు. బుధవారం కేటీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, డివిజన్ ఇన్‌చార్జిలుగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీలు తక్కళ్లపల్లి రవీందర్‌రావు, దాసోజు శ్రవణ్, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఈ భేటీలో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, పార్టీ నేత రావుల శ్రీధర్‌రెడ్డి తదితరులతో పాటు మాగంటి సునీత, మాగంటి గోపీనాథ్ సోదరుడు వజ్రనాథ్ కూడా హాజరయ్యారు.
నేడు, రేపు బూత్ కమిటీలతో భేటీలు
బీఆర్‌ఎస్ ప్రచార బృందాల పనితీరు, రోడ్ షోలు, రోజూ వారీ ప్రచార షెడ్యూలు తదితర అంశాలపై ఈ భేటీలో చర్చించారు. వార్ రూమ్ నుంచి అందే ఆదేశాలకు అనుగుణంగా ప్రచార వ్యూహానికి పదు ను పెట్టాలని నిర్ణయించారు. గురు, శుక్రవారాల్లో బూత్ కమిటీలతో డివిజన్ ఇన్‌చార్జిలుగా వ్యవహరి స్తున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశాలు నిర్వ హించి ప్రచార వ్యూహాన్ని వివరిస్తారు.
ఈ నెల 10 వ తేదీలోగా బూత్‌కమిటీల సమావేశాలు పూర్తి చేసి 12వ తేదీ నుంచి ప్రచార పర్వంలో అడుగు పెట్టా లని కేటీఆర్ ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరగని పక్షంలో ఇతర జిల్లాలకు చెందిన ఎమ్మెల్యే లు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర కీలక నేతలను కూడా ఉప ఎన్నిక ప్రచారంలో భాగస్వాములను చేస్తారు. ప్రచారం ముగింపులో పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ రోడ్ షోలో పాల్గొనే అవకాశం ఉందని బీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి.


