
బీఆర్‌ఎస్ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మళ్లీ గెలవాలి
సీఎం రేవంత్‌రెడ్డికి ఉప ఎన్నికలకు వెళ్లే దమ్ముందా?
20 నెలల్లోనే ప్రభుత్వం రూ.2.80 లక్షల కోట్ల అప్పు చేసింది
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపాటు
మియాపూర్: రాష్ట్రంలో త్వరలోనే అసెంబ్లీ ఉప ఎన్నికలు రానున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వానికి అవే బైబై ఎన్నికలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు దమ్ముంటే తమ పదవులకు రాజీనామా చేసి ఉపఎన్నికల్లో పోటీచేసి గెలవాలని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఉప ఎన్నికలకు వెళ్లే దమ్ముందా? అని సవాల్ విసిరారు. మియాపూర్ నరేన్ గార్డెన్‌లో శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం ఆదివారం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ శంభీపురం రాజు, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రూ.2.80 లక్షల కోట్ల అప్పుచేసి అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను చేపడితే.. కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లు గడవకముందే రూ.2.20 లక్షల కోట్ల అప్పుచేసి ఒక్క మంచిపని కూడా చేయలేదని విమర్శించారు. కేసీఆర్ పాలనలో హైదరాబాద్‌ను మహా నగరంగా తీర్చిదిద్దామని చెప్పారు.
కరోనా సమయంలో ఏడాదిపాటు ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా ఆదాయం రాకపోయినా అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఆగకుండా కొనసాగించామని తెలిపారు. ఇప్పుడు 20 నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పుతో 42 ప్‌లైఓవర్లు, నాలుగు అత్యాధునిక ఆస్పత్రులు, 36 మురుగునీటి శుద్ధి కేంద్రాలు నిర్మించిందని వెల్లడించారు. రేవంత్ ప్రభుత్వం ఒక్క కొత్త వంతెన గానీ మోరీని గానీ నిర్మించిందా? అని ప్రశ్నించారు.
హైడ్రా అరాచకంతో హైదరాబాద్ అతలాకుతలం
కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన హైడ్రావల్ల హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుప్పకూలిందని కేటీఆర్ విమర్శించారు. హైడ్రా అరాచకాలతో నగరమంతా అతలాకుతలమైందని ఆరోపించారు. దుర్గంచెరువులో కాంగ్రెస్ హయాంలో సీఎం రేవంత్‌రెడ్డి అన్న తిరుపతిరెడ్డి అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చే దమ్ము హైడ్రాకు ఉందా? అని సవాల్ చేశారు.
పేదల ఇళ్లు కూలగొడుతున్న హైడ్రా.. పెద్దల జోలికి మాత్రం వెళ్లడం లేదని మండిపడ్డారు. 20 నెలల్లో హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకం సృష్టించిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు తాము ఏ పార్టీలో ఉన్నామో కూడా చెప్పుకోలేకపోతున్నారని, ఒకవేళ బీఆర్‌ఎస్ పార్టీలో ఉంటే ఈ కార్యక్రమానికి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రోజాదేవి రంగారావు, సిం«ధూ ఆదర్శ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.