జూ.ఎన్టీఆర్‌ X టీడీపీ

Chandrababu was not impressed with the routine speech - Sakshi

ఫ్లెక్సీలతో హడావిడి.. అభిమానుల కొట్లాట

ఆచంట, తిరువూరులో టీడీపీ కార్యకర్తల దౌర్జన్యం.. రెండు చోట్లా కానరాని జనస్పందన 

రొటీన్‌ ప్రసంగంతో ఆకట్టుకోలేకపోయిన టీడీపీ అధినేత చంద్రబాబు

సాక్షి, భీమవరం/పెనుగొండ/తిరువూరు: పశ్చిమ­గోదావరి జిల్లా ఆచంట, ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ‘రా... కదలి రా..’ పేరిట ఆదివారం నిర్వహించిన సభకు హాజరైన జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులపై టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు. వారు తీసుకొచ్చిన ఫ్లెక్సీలు, జెండాలను లాక్కుని వారిపై వీరంగం సృష్టించి అక్కడినుంచి తరిమేశారు. ఆచంటలో వారిని అడ్డుకునేందుకు వచ్చిన జనసేన కార్యకర్తలపైనా టీడీపీ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు.

ఆచంటలో లక్ష మంది జనంతో ఈ సభ నిర్వహించాలని టీడీపీ నాయకత్వం విస్తృత ప్రచారం నిర్వహించినా కనీసం 12 వేల మంది కూడా హాజరుకాకపోవడంతో క్యాడర్‌లో నిరుత్సాహం నెలకొంది. ఈ తరుణంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ జై ఎన్టీఆర్‌ పేరుతో జూనియర్‌ ఎన్టీఆర్‌ బొమ్మతో రూపొందించిన ఫ్లెక్సీలు తీసుకుని సభాస్థలికి వచ్చారు. టీడీపీ క్యాడర్‌ వారిని అడ్డుకున్నారు. వారి చేతిలోని ఫ్లెక్సీని లాక్కుని వారితో వాగ్వాదానికి దిగారు.

ఈ సందర్భంగా జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులు జై ఎన్టీఆర్, జై జూనియర్‌ ఎన్టీఆర్‌ అంటూ నినాదాలు చేశారు. ఇదే సమయంలో జనసేన అభిమానులు సైతం వారి పార్టీ జెండాలతో రావడంతో వారి చేతుల్లోని జెండాలను కూడా టీడీపీ క్యాడర్‌ లాక్కుని బయటకు విసిరేశారు. ఈ తరుణంలో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది.

ఆచంటలో కానరాని జనసేన టీడీపీ, జనసేన నాయకత్వం మధ్య అంతర్గత పోరు జరుగుతున్నట్టు ఆచంటలో జరిగిన చంద్రబాబు సభ ద్వారా బయటపడింది. ఈ సభకు సంబంధించి జనసేనకు సరైన సమాచారం ఇవ్వలేదన్న భావనతో ఆ పార్టీ నాయకులు బహిరంగ సభకు దూరంగా ఉన్నారని తెలియవచ్చింది. నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జి చేగొండి సూర్యప్రకాష్‌ సైతం రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. 

వెలవెలబోయిన రెండు సభలు
తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించిన రెండు సభలకు జనం నుంచి ఆదరణ కరువైంది. రెండు చోట్లా ఆశించిన రీతిలో జనం రాకపోవడంతో నాయకులు హతాశులయ్యారు. ఆచంటలో చంద్రబాబు జనంకోసం ఎదురు చూస్తూ హెలీప్యాడ్‌ వద్దే నిరీక్షించాల్సి వచ్చింది. దీంతో ఆలస్యంగా సభ ప్రారంభం కావడంతో వచ్చిన జనం కాస్తా వెనుదిరిగి వెళ్లిపోయారు.

ఇక తిరువూరులో 20 ఎకరాల్లో ఏర్పాటు చేసిన సభ జనం లేక వెలవెలబోయింది. సగానికి పైగా స్థలంలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. సభకు వచ్చిన జనం కూడా చంద్రబాబు ప్రసంగం ప్రారంభించకముందే వెనుదిరగడం గమనార్హం. ఎంపీ కేశినేని నాని రావడం లేదన్న సమాచారంతో ద్వితీయ వర్గం నాయకులు, కార్యకర్తలు డుమ్మా కొట్టారు.

విసుగెత్తించిన ‘బాబు’ ప్రసంగం
రెండు సభల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించిన తీరు హాజరైన ప్రజలను విసుగెత్తించింది. ఆరు హామీల అమలుపై ‘బాబు’ ప్రసంగంపై మహిళలు పెదవి విరిచారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో అమలుచేసే సంక్షేమ పథకాలు తమకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయంటూ బాహాటంగానే విమర్శించడం గమనార్హం. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు విమర్శించిన తీరుని సైతం పలువురు తప్పుపట్టారు. ప్రసంగం ఆద్యంతం ఆత్మస్తుతి పరనిందగా సాగింది. ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తూనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది తానేనని చెప్పుకొచ్చారు. 

అంబులెన్సుకూ దారివ్వని తమ్ముళ్లు
తిరువూరు సభకు వచ్చిన వాహనాలు విజయవాడ–జగదల్‌పూర్‌ జాతీయ రహదారిపై అడ్డదిడ్డంగా నిలిపివేయడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.  దూరప్రాంతాల నుంచి వచ్చిపోయే భారీవాహనాలతో పాటు అత్యవసర చికిత్స నిమిత్తం రోగులను తరలించే అంబులెన్సుకు కూడా దారి ఇవ్వకుండా తెలుగుతమ్ముళ్ళు అవరోధాలు కల్పించారు. తిరువూరు సీఐ అబ్దుల్‌ నబీ తన సిబ్బందితో ట్రాఫిక్‌ నియంత్రణ చేసి అంబులెన్సును పంపారు.

అధికారమిస్తే ఆరుపథకాలు
తిరువూరు, ఆచంట సభల్లో చంద్రబాబు నాయుడు
తిరువూరు/సాక్షి, భీమవరం/పెనుగొండ: రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమిని గెలిపించి అధికారం కట్టబెడితే ఆరు పథకాలను అమలు చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తెలిపారు. ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు, పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో ఆదివారం నిర్వహించిన రా కదలిరా పేరిట టీడీపీ నిర్వహించిన సభల్లో ఆయన ప్రసంగించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి, మూడు వంటగ్యాస్‌ సిలిండర్లు ఉచిత సరఫరా, రైతులకు ఏడాదికి రూ.50 వేల ఆర్థికసాయం ప్రధానంగా అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలోని ప్రతి పేదవాడికీ అండగా నిలబడటమే టీడీపీ, జనసేన లక్ష్యమని చెప్పుకొచ్చారు.

తెలుగు జాతిని తిరుగులేని శక్తిగా తయారు చేసే బాధ్యతను తీసుకుంటామని పేర్కొన్నారు. ఆక్వారంగాన్ని వైఎస్సార్‌సీపీ అతలాకుతలం చేసిందనీ, తాము అధికారంలోకి వస్తే ఆక్వా రంగానికి పూర్వ వైభవం తెస్తామని తెలిపారు. ఈ ప్రభుత్వంలో సమర్థుడైన మంత్రి ఒకరూ లేరన్నారు. తాము అధికారంలోకి రాగానే 20 లక్షల ఉద్యోగాలు తెస్తామని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తన విజన్‌ కారణంగానే హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ రంగానికి ప్రధాన కేంద్రమైందని, లక్షలాదిమంది ఉద్యోగాలు పొందడానికి తానే కారణమని గొప్పగా చెప్పారు.

తిరువూరు సభలో వేదికపై ఎంపీ కేశినేని నానికి ప్రోటోకాల్‌ ప్రకారం చంద్రబాబు పక్కనే సీటు కేటాయించారు. కానీ ఆయన డుమ్మాకొట్టారు. తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు సైతం సభ వైపునకు రాకపోవడం చర్చనీయాంశమైంది. తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా ప్రకటిస్తారని ఆశించిన ప్రస్తుత ఇన్‌చార్జి శావల దేవదత్‌ ఆ ఊసే లేకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆచంట సభలో పాలకొల్లు, ఉండి ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు, మాజీ మంత్రులు పితాని సత్యనారాయణ, కేఎస్‌ జవహర్, పీతల సుజాత తదితరులు ప్రసంగించారు. 

whatsapp channel

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top