అనంతపురం జిల్లా పుట్లూరు మండలం ఓబుళాపురంలో ట్రాక్టర్‌తో అరటి తోటను దున్నేస్తున్న రైతు-గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం నాగులపాడులో పత్తి పంటను పీకేసి నిప్పు పెట్టిన రైతు
అన్నదాతలను నిండా ముంచి..
నేటి నుంచి ‘రైతన్నా మీ కోసం..’ అంటూ బాబు డ్రామాలు
‘సుఖీభవ’ అంటూ అన్నదాతలను దారుణంగా వంచించి ‘పంచసూత్రాలా’?
రైతులకు రెండేళ్లలో రూ.40 వేలకుగానూ ఇచ్చింది రూ.10 వేలే.. ఎగ్గొట్టింది రూ.30 వేలు
ఉచిత పంటల బీమా ఉండి ఉంటే.. ఎకరాకు రూ.20వేల నుంచి రూ.25 వేల సాయం అందేది
సకాలంలో ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చి ఉంటే రూ.1,100 కోట్లకుపైగా ప్రయోజనం చేకూరేది
ధరల స్థిరీకరణ నిధి ఉండి ఉంటే.. రైతన్నలకు భరోసా ఉండేది
హామీల ఎగవేత.. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రెడ్‌బుక్ రాజ్యాంగం అమలే ఏకైక లక్ష్యంగా వ్యవహరిస్తూ.. ఎన్నికల హామీలకు తూట్లు పొడిచి ప్రతి వర్గాన్ని దారుణంగా వంచించారనే చర్చ సర్వత్రా జరుగుతోంది. సూపర్ సిక్స్ లేవు.. సెవెన్లూ లేవు.. జగన్ ఇచ్చిన పథకాలన్నీ చంద్రబాబు రద్దు చేశారని పేర్కొంటున్నారు. ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకూ ఏటా రూ.18 వేలు చొప్పున ఇస్తామని సూపర్ సిక్స్‌లో హామీలిచ్చి రెండేళ్లలో రూ.36 వేలు ఎగ్గొట్టారు. గ్యాస్ సిలిండర్లు ఏటా మూడు ఉచితంగా ఇస్తామని చెప్పి గతేడాది ఇచ్చింది ఒక్కటి మాత్రమే.
మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణమని ఊరించి వారిని జిల్లా దాటనివ్వడం లేదు. అమ్మ ఒడి పేరు మార్చేసి తల్లికి వందనం అంటూ 30 లక్షల మందికి ఎగ్గొట్టారు. ఆ ఇచ్చిన వారికి కూడా కొందరికి రూ.8 వేలు, కొందరికి రూ.9 వేలే ఇచ్చారు. వలంటీర్ల వేతనం రూ.10 వేలకు పెంచుతామని నమ్మబలికి ఏకంగా ఆ వ్యవస్థనే రద్దు చేశారు. అవ్వాతాతల పింఛన్లు ఎగరగొడుతూ దాదాపు ఐదు లక్షల పెన్షన్లు కుదించారు. కొత్తవి ఒక్కటీ ఇవ్వలేదు. ప్రభుత్వ స్కూళ్లు, ఆస్పత్రులను నిరీ్వర్యం చేసి ఎడాపెడా అన్నీ ప్రైవేటీకరణ చేస్తున్నారు. పప్పు బెల్లాల మాదిరిగా తమ సన్నిహితులకు కేటాయిస్తున్నారు.
సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్: ‘చంద్రబాబూ..! ఈ 18 నెలల్లో రైతులకు ఒక్కటైనా మేలు చేశారా? అన్నదాతా సుఖీభవ కింద రెండేళ్లలో పెట్టుబడి సాయం కింద రూ.40 వేలు ఇవ్వాల్సి ఉంటే రూ.పది వేలు మాత్రమే విదిల్చి ఏకంగా రూ.30 వేలు ఎగ్గొట్టారు! ఉచిత పంటల బీమా ఎత్తివేశారు. అదే ఉండి ఉంటే.. రైతులకు న్యాయం జరిగేది. నష్టపోయిన ప్రతి ఎకరానికి రైతులకు కనీసం రూ.20 నుంచి రూ.25 వేల వరకు పరిహారం అందేది. విపత్తుల సమయంలో ఇవ్వాల్సిన ఇన్‌పుట్ సబ్సిడీని చంద్రబాబు ఎగ్గొట్టారు.
ఇవాళ ఏ పంటకి చూసినా గిట్టుబాటు ధర లేదు.. విపత్తు వస్తే ఆదుకునే దిక్కు లేదు.. మరి ఏ మొహం పెట్టుకుని వస్తున్నావ్ చంద్రబాబూ? రైతులకు తీవ్ర అన్యాయం చేసిన ముఖ్యమంత్రిగా మీరు చరిత్రలో మిగిలిపోవడం ఖాయం...!’ అంటూ అన్నదాతలు చంద్రబాబు సర్కారుపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఎన్నికల్లో చంద్రబాబు మాయమాటలు నమ్మి నిలువునా మోసపోయామంటూ ఆక్రోశిస్తున్నారు. 18 నెలలుగా ఏ ఒక్క రైతుకూ ఒక్క మేలు కూడా చేయని చంద్రబాబు నేటి నుంచి ‘రైతన్నా మీకోసం..’ ‘పంచ సూత్రాలు..’ అంటూ తమను మరోసారి వంచించేందుకు సిద్ధమవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలోని ఉప్పలపాడులో మోంథా తుపాను ధాటికి వర్షపు నీటిలోకి ఒరిగిపోయిన వరి పంట (ఫైల్)
కనీసం ఎరువులకూ కరువే.. బస్తా యూరియా కోసం పొలం పనులు వదిలేసి రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతూ మళ్లీ క్యూలలో నిలబడాల్సిన దుస్థితి కలి్పంచారని మండిపడుతున్నారు. సాగు వేళ అదునుకు విత్తనాలు, ఎరువులు దొరక్క పడరాని పాట్లు పడ్డాం. ఆర్బీకేల ద్వారా నాన్‌సబ్సిడీ విత్తనాల సరఫరాను నిలిపి వేశారు. సబ్సిడీ విత్తనాల్లో కూడా అడ్డగోలుగా కోత పెట్టారు. విత్తనాల నాణ్యతకు భరోసా లేదు. ప్రకృతి వైపరీత్యాల కంటే చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యం వల్లే దారుణంగా నష్టపోయామంటూ రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అన్నదాతా సుఖీభవ పథకం కింద సామాజిక వర్గాలకతీతంగా కౌలు రైతులందరికీ పెట్టుబడి సాయం అందిస్తామన్న హామీకి చంద్రబాబు ప్రభుత్వం తూట్లు పొడిచింది. ఏడాదిన్నరగా ఒక్క కౌలుదారుడికీ రూపాయి సాయం చేసిన పాపాన పోలేదు. ఏడాదిలో దాదాపు 16 సార్లు వైపరీత్యాల బారిన పడి పంటలు దెబ్బ తింటే చివరికి కరువు సాయం కూడా నిస్సిగ్గుగా ఎగ్గొట్టింది వాస్తవం కాదా? అని నిలదీస్తున్నారు. నయ వంచనకు పాల్పడిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కూటమి నేతలను ఎక్కడికక్కడ నిలదీసేందుకు అన్నదాతలు, రైతు సంఘాలు సన్నద్ధమవుతున్నాయి.
రూ.40 వేలు ఇవ్వాల్సి ఉంటే.. రూ.30 వేలు ఎగ్గొట్టారు
అన్నదాతా సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు పెట్టుబడి సాయంగా ఏటా రూ.20 వేలు చొప్పున రెండేళ్లలో మొత్తం రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా.. చంద్రబాబు సర్కారు రూ.పది వేలు మాత్రమే ఇచ్చి ఏకంగా రూ.30 వేలు ఎగ్గొడుతోంది! తొలి ఏడాది అన్ని పథకాల మాదిరిగానే దీనికి కూడా పూర్తిగా ఎగనామం పెట్టారు. అర్హులైన 53,58,366 మంది రైతులకు రెండేళ్లలో రూ.21,433.46 కోట్లు పెట్టుబడి సాయం కింద అందించాలి. కానీ 46,85,838 మంది రైతులకు రెండు విడతల్లో కలిపి చంద్రబాబు సర్కారు ఇచ్చింది కేవలం రూ.4,685.54 కోట్లు మాత్రమే. అంటే ఏడు లక్షల మంది రైతులకు ఎగ్గొట్టింది అక్షరాలా ఏకంగా రూ.16,746 కోట్లు. మరి ఆ బాకీ సంగతి ఏమిటి? మిగతా రూ.30 వేలు ఇవ్వాల్సిందే అని రైతులు నిలదీస్తున్నారు.
ఒక్కరికైనా పంటల బీమా పరిహారం ఇచ్చారా?
అన్నదాతలపై పైసా భారం పడకుండా ఐదేళ్ల పాటు అండగా నిలిచిన డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకానికి టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చీ రాగానే మంగళం పాడేసింది. జూన్ 2024లో చెల్లించాల్సిన రూ.930 కోట్ల ప్రీమియం బకాయిలు ఎగ్గొట్టడంతో రైతులకు రూ.1,385 కోట్ల పంటల బీమా పరిహారం అందకుండా చేశారు. ఉచిత పంటల బీమా పథకాన్ని రబీ నుంచి పూర్తిగా ఎత్తివేశారు. ఖరీఫ్–2024 సీజన్‌లో కొనసాగించిన ఉచిత పంటల బీమా పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం తమ వాటాగా చెల్లించాల్సిన రూ.838.57 కోట్ల ప్రీమియం మొత్తం చెల్లించకపోవడంతో నేటికీ ఖరీఫ్–24 సీజన్‌లో దెబ్బతిన్న రైతులకు పంటల బీమా పరిహారం అందకుండా చేసింది వాస్తవం కాదా?
రబీ 2024–25 సీజన్ నుంచి స్వచ్ఛంద నమోదు పద్ధతిలో శ్రీకారం చుట్టిన ఫసల్ బీమాలో ప్రీమియం భారం భరించలేక కేవలం 6.75 లక్షల మంది రైతులు 9.90 లక్షల ఎకరాల్లో సాగు చేసిన పంటలకే బీమా కవరేజ్ పొందగలిగారు. ప్రస్తుత ఖరీఫ్–2025లో కేవలం 12.36 లక్షల మంది రైతులు బీమా రక్షణ పొందగా 19.60 లక్షల ఎకరాలకు మాత్రమే బీమా కవరేజ్ లభించింది. గడిచిన ఖరీఫ్‌తో పోలిస్తే 51.57 లక్షల ఎకరాల్లో పంటలకు బీమా కవరేజ్, 73.47 లక్షల మంది రైతులు బీమా రక్షణ దక్కలేదన్నది వాస్తవం కాదా?
ఏ ఒక్క పంటకైనా ‘మద్దతు’ దక్కిందా?
రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) కల్పించడంలో చంద్రబాబు సర్కారు ఘోరంగా విఫలమైంది. ధాన్యం, మిరప, పొగాకు, కోకో, కందులు, మినుము, పెసలు, శనగ, వేరుశనగ, పసుపు, జొన్న, సజ్జ, టమాటా, ఉల్లి, అరటి, బత్తాయి.. ఇలా ఏ పంట చూసినా మద్దతు ధర దక్కని పరిస్థితి. చివరికి పూలు, కూరగాయలకు కూడా ధర లేని దుస్థితి. మద్దతు ధర దక్కక పొగాకు, మిరప, పొగాకు, పత్తి, మొక్కజొన్న తదితర పంటలకు అన్నదాతలు నిప్పు పెట్టగా.. మామిడి, అరటి, బత్తాయి తదితర పంటలను దున్నేసిన పరిస్థితులు దేశంలో ఎక్కడైనా ఉన్నాయేమో చంద్రబాబు చెప్పాలి.
ధాన్యం రైతులకు సైతం మద్దతు ధర దక్కలేదు. గడిచిన ఖరీ‹ఫ్ సీజన్‌లో కనీస మద్దతు ధర ప్రకారం 75 కేజీల బస్తాకు రూ.1,725 దక్కాల్సి ఉండగా ఏ ఒక్క రైతుకూ రూ.1,150–1,450కి మించి దక్కలేదు. మద్దతు ధర కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా ధాన్యం రైతులు రోడ్డెక్కి ధర్నాలు, ఆందోళనలు చేసిన ఘటనలు ఎప్పుడైనా చూశామా? ఉల్లి, టమాటా, చివరికి అరటికి కూడా కిలో రూపాయికి మించి దక్కని పరిస్థితులు నెలకొన్న మాట వాస్తవం కాదా? అని అన్నదాతలు నిలదీస్తున్నారు.
గతేడాది పరిహారమే అందలేదు..
నేను 2.20 ఎకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేస్తున్నా. గతేడాది అక్టోబర్‌లో వర్షాలు పడి పంట దెబ్బతింది. వ్యవసాయ సిబ్బంది నష్టపరిహారం కోసం పేరు నమోదు చేసుకున్నారు. నేటి వరకు పరిహారం అందలేదు. ఈ ఏడాది తుపాను వల్ల పంట దెబ్బతింది. ఇప్పటి వరకు ఎవరూ పట్టించుకోలేదు. ఈ ఏడాది కూడా కష్టాలు తప్పేలా లేవు.
– దాసరి వీరబాబు, రైతు తూర్పు తెలుగుపాలెం, పెడన, కృష్ణా జిల్లా
ఏం ముఖం పెట్టుకొని వస్తారు..?
కర్నూలు జిల్లా అస్పరి మండలం వలగొండ గ్రామానికి చెందిన కె.నాగేంద్రయ్య ఐదు ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ఎకరాకు రూ.60 వేలు చొప్పున రూ.3 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. వర్షాలకు దెబ్బతినడంతో మూడుసార్లకు బదులు ఒకే తీతతో సరిపెట్టాల్సి వచి్చంది. తేమ శాతం 8–12 శాతం మధ్య ఉన్నప్పటికీ ఆదోని మార్కెట్ యార్డుకు తీసుకెళితే రూ.37,200 వచ్చింది. రూ.2.63 లక్షల వరకు నష్టపోయాడు. ఖరీఫ్‌లో యూరియా దొరక్క చాలా ఇబ్బంది పడ్డామని, కాంప్లెక్స్ ఎరువు బస్తా కూడా రూ.2 వేలకు బ్లాకులో కొన్నట్లు ఆయన వాపోతున్నాడు. మరి ఏం ముఖం పెట్టుకుని మా గ్రామాలకు వస్తారు? అని నాగేంద్రయ్య మండిపడుతున్నారు.
ఏడాదిలో 300 మంది బలవన్మరణాలు..
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ధాన్యం మొదలుకొని మామిడి, కోకో, పొగాకు, మిరప, ఉల్లి, టమాటా, పత్తి, అరటి, మొక్కజొన్న, కంది, శనగ.. ఇలా ఏడాదిన్నరగా ఏ ఒక్క పంటకూ కనీస మద్దతు ధర దక్కలేదు. వరుస వైపరీత్యాలతో పంటలు దెబ్బ తినడంతో రూ.వేల కోట్ల పెట్టుబడిని నష్టపోయారు. చేతికొచ్చిన కొద్దిపాటి పంటను అమ్ముకునేందుకు నానా అగచాట్లు పడ్డామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేసిన అప్పులు తీర్చే దారిలేక గడిచిన ఏడాదిలో దాదాపు 300 మంది రైతులు ఆత్మహత్యలకు ఒడిగట్టడం రాష్ట్రంలో నెలకొన్న దారుణ పరిస్థితులకు అద్దం పడుతోంది.
పరిహారం పైసా అయినా ఇచ్చారా?
2024–25 సీజన్‌కు సంబంధించి ఖరీఫ్, రబీలో 1.51 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు కావాల్సి ఉండగా సాగైంది 1.24 కోట్ల ఎకరాల్లో మాత్రమే. 2025–26 ఖరీఫ్‌లో సాగైంది కేవలం 69 లక్షల ఎకరాలే. మరోవైపు వరుస వైపరీత్యాల బారిన పడి ఈ మూడు సీజన్‌లలో దాదాపు 30 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతినగా 12 లక్షల ఎకరాల్లో పంటలు కరువు బారిన పడి బీడు వారాయి. ఖరీఫ్–24లో 100 మండలాలు, రబీ 2024–25లో 80 మండలాలు, ఖరీఫ్–2025 సీజన్‌లో 65 మండలాలు కరువు కోరల్లో చిక్కుకోగా రాష్ట్ర ప్రభుత్వం కంటితుడుపుగా ఖరీఫ్–24లో 54, రబీ 2024–25లో 51, ఖరీఫ్–2025లో 37 చొప్పున మాత్రమే కరువు మండలాలను ప్రకటించి చేతులు దులుపుకొంది.
ఒక్క రూపాయి కూడా కరువు సాయం అందించిన పాపాన పోలేదు. వరుస వైపరీత్యాలు, కరువు సాయంతో కలిపి దాదాపు 10 లక్షల మంది రైతులకు రూ.1,350 కోట్లకు పైగా పంట నష్టపరిహారం (మోంథా తుపానుతో కలిపి ఇన్‌పుట్ సబ్సిడీ) చెల్లించాల్సి ఉండగా, కృష్ణా వరదలకు సంబంధించి కేవలం 1.85 లక్షలమందికి రూ.285 కోట్లు మాత్రమే జమ చేసింది. దాదాపు రూ.1,100 కోట్లకుపైగా పంట నష్ట పరిహారాన్ని ఎగ్గొట్టింది.
బాధిత కుటుంబాలకు పైసా సాయం చేశారా?
అందలం ఎక్కింది మొదలు అన్నదాతపై కక్ష కట్టినట్లుగా చంద్రబాబు సర్కారు వ్యవహరిస్తుండటంతో సాగు నష్టాలు భరించలేక, భరోసా కరువై రైతన్నలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తుపానులు, వరదలు, వర్షాభావం.. ఒకదాని తర్వాత ఒకటిగా వైపరీత్యాలు ముప్పేట దాడి చేయడంతో పంటను అమ్ముకునే పరిస్థితి లేక, మద్దతు ధర దక్కక దిక్కు తోచని స్థితిలో ఉన్న అన్నదాతలు ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారు. టమాటా నుంచి పొగాకు వరకు పంట ఉత్పత్తులను కొనే వారు లేక, చేసిన అప్పులు తీర్చే దారిలేక ఇప్పటికే 300 మందికిపైగా రైతులు, కౌలురైతులు ఆత్మహత్యలకు పాల్పడితే ఈ ప్రభుత్వం పైసా సాయం చేసిన పాపాన పోలేదని బాధిత కుటుంబాలు ఆక్రోశిస్తున్నాయి.
ఆక్వా, పాడి రైతులను నిండా ముంచేశారు
తాము అధికారంలోకి రాగానే నాన్ ఆక్వా జోన్‌తో పాటు 10 ఎకరాలకు పైబడి సాగు చేస్తున్న ఆక్వా రైతులందరికీ యూనిట్ రూ.1.50 చొప్పున విద్యుత్ సబ్సిడీ వర్తింప చేస్తానంటూ ఎన్నికల్లో చంద్రబాబు నమ్మబలికారు. అధికారంలోకి వచ్చి 18 నెలలైనా హామీని నెరవేర్చలేదు. సబ్సిడీపై ఏరియేటర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు ఇస్తామని ఒక్కరికీ ఇవ్వలేదు. ఆక్వా రైతులకు కోల్డ్ స్టోరేజ్‌లు అంటూ ఊరించి ఒక్కటీ నిరి్మంచలేదు. ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్ ఫ్లోటింగ్ జెట్టీల నిర్మాణాన్ని అటకెక్కించారు. మరోవైపు అమూల్ ప్రాజెక్టును అటకెక్కించి ప్రైవేటు డెయిరీల దోపిడీకి తలుపులు బార్లా తెరిచారు. పాడి రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నా ఆదుకునేందుకు చర్యలు తీసుకోలేదు.
రైతు ఆత్మహత్య చేసుకుని 8 నెలలైనా సాయం ఊసేలేదు

ఈ ఫొటోలోని వ్యక్తి పేరు రామాంజనేయులు. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం ఐరన్‌బండ గ్రామానికి చెందిన సన్నకారు రైతు. ఈయనకు సొంత భూమి 1.80 ఎకరాలు ఉండగా, మరో 3 ఎకరాలు కౌలుకు తీసుకుని ఉల్లి, మిరప, వేరుశనగ తదితర పంటలు సాగు చేశారు. రెండేళ్లుగా సాగు కోసం బ్యాంకులు, ప్రైవేట్ వ్యక్తుల వద్ద రూ.12లక్షలు అప్పు తెచ్చారు. పంటలు పండకపోవడం, అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఈ ఏడాది ఏప్రిల్ 11న పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నారు.
రామాంజనేయులుకు భార్య వీరేశమ్మ, కూతురు మమతాంజలి (16), కుమారుడు ప్రవీణ్‌కుమార్(14) ఉన్నారు. తండ్రి చనిపోవడంతో పిల్లల చదువులు అస్తవ్యస్తంగా మారాయి. సాయం చేయాలని వీరేశమ్మ కలెక్టర్‌ను కలిసినా ప్రయోజనం లేదు. రామాంజనేయులు మృతిచెంది 8 నెలలైనా ఇప్పటికీ త్రీ మెన్ కమిటీ విచారణ పెండింగ్‌లోనే ఉంది. ఈ కుటుంబానికి అన్నదాతా సుఖీభవ సాయం కూడా దక్కలేదు. దీంతో పెద్ద దిక్కును కోల్పోయి, ప్రభుత్వ సాయం అందక ఈ కుటుంబం అల్లాడుతోంది.
ఒడిశా నుంచి ఎరువులు తెచ్చుకున్నాం..
అనుకున్న సమయానికి ప్రభుత్వం యూరియా సరఫరా చేయకపోవడంతో పక్కనున్న ఒడిశా నుంచి వెయ్యి రూపాయలు వెచ్చించి కొనుగోలు చేశాం. నాలుగు ఎకరాలు సాగు చేస్తున్నా. కేవలం ఎరువుల కోసమే సుమారు రూ.20వేలు ఖర్చయింది. ప్రభుత్వం సకాలంలో విత్తనాలు కూడా సరఫరా చేయకపోవడంతో అధిక ధరలకు ప్రైవేటు మార్కెట్‌లో కొనుగోలు చేశాను. నేనే కాదు ఇచ్ఛాపురం మండలంలోని వందలాది మంది రైతులు ఒడిశా నుంచే యూరియా కొనుగోలు చేశారు.
– తిప్పన కృష్ణారెడ్డి, రైతు, హరిపురం, ఇచ్ఛాపురం
అధికారులు మా వైపు కన్నెత్తి చూడలేదు
ఎకరం తోటలో బొబ్బాయి పంట వేశాను. ఎకరాకు వెయ్యి మొక్కలు నాటాను. రూ.70 వేల పెట్టుబడి పెట్టాను. బొప్పాయి మొక్కలు ఏపుగా పెరిగాయి. దిగుబడి బాగా వస్తుందనుకున్న సమయంలో తుపాను, వరదలు వచ్చి దాదాపు 850 మొక్కలు విరిగిపడి చనిపోయాయి. పెట్టుబడులు, ఇతర ఖర్చులు కలిపి సుమారు రూ.80 వేల నష్టం వాటిల్లింది. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టాం. కనీసం ప్రభుత్వ అధికారులెవ్వరూ మావైపు కన్నెత్తి కూడా చూడలేదు. నష్టపరిహారం వివరాలు నమోదు చేయలేదు. ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. అప్పుల పాలైపోయాం.
– వాకపల్లి వీరబాబు, బొబ్బాయి రైతు, వలసలతిప్ప శివారు కొత్తలంక, ముమ్మిడివరం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా
రూ.40 వేలు ఇవ్వాలి.. రూ.10 వేలే ఇచ్చారు
అన్నదాతా సుఖీభవ కింద ఒక్కో రైతుకు రూ.20 వేలు చొప్పున ఆరి్థక సహాయం చేస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక అమలు చేయడం లేదు. చంద్రబాబు ఇచి్చన హామీ మేరకు గత రెండు ఖరీఫ్‌లకు కలిపి చంద్రబాబు ప్రభుత్వం నాకు రూ.40 వేలు ఇవ్వాలి. తీరా చూస్తే గత సంవత్సరం కేంద్రం ఇచ్చినది రూ.5 వేలు, ఈ ఏడాది రూ.5 వేలు ఇచ్చి గొప్పలు చెప్పుకొంటున్నారు. గత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచి్చన ప్రకారం ఏటా వైఎస్సార్ రైతు భరోసా కింద రూ.13,500 రైతుల ఖాతాలకు జమ చేశారు. ఈ ప్రభుత్వం అలా ఇవ్వకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం.
– తుంపాల చక్రబాబు, కాండ్రేగుల, జగ్గంపేట మండలం, కాకినాడ జిల్లా
నాడు పంటల బీమా ధీమా.. నేడు ఆ బీమా బరువు
నేను రెండెకరాలున్న చిన్న రైతును. పంటల బీమా ప్రీమియం భారంగా మారడంతో ఈసారి బీమా చేయించుకోలేకపోయాను. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వమే రైతుల పేరిట బీమా ప్రీమియం చెల్లించడంతో ధీమాగా ఉండేవాళ్లం. విపత్తులు సంభవిస్తే దెబ్బ తిన్న పంటలకు ప్రభుత్వం బీమా పరిహారం సకాలంలో అందింది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత పంటల బీమా ప్రీమియం రైతులే చెల్లించుకోవాలని చెప్పారు. ఎలా బీమా చేసుకోవాలో అవగాహన లేకపోవడం, ఆరి్థక భారం కారణంగా ప్రీమియం చెల్లించలేదు. దీంతో ఇటీవల తుపాను వల్ల పంటలు దెబ్బతిన్నాయి. బీమా లేకపోవడం ఇప్పుడు పెద్ద భారంగా మారింది.
– గుడిమెట్ల లక్ష్మణరెడ్డి, రైతు, కృష్ణంపాలెం, దేవరపల్లి మండలం, తూర్పు గోదావరి జిల్లా
పిడుగు పడి పాడి గేదె మృతిచెందినా పరిహారం లేదు
మా కుటుంబం పాడి గేదెలను పోషించుకుని జీవనం సాగిస్తోంది. సొంత పొలం కూడా లేదు. అక్టోబర్ 22న ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షంలో పిడుగుపాటుకు గురై మూడు నెలల సూడి గేదె మృత్యువాత పడింది. రూ.85వేలకు కొనుగోలు చేసిన కొన్ని రోజులకే ఇంటి దగ్గర చెట్టుకు కట్టేసిన సూడి గేదె పిడుగుపడి చనిపోయింది. గ్రామ రెవెన్యూ అధికారి, పశు వైద్యుడు రిపోర్టు రాసుకొని వెళ్లారు. కానీ ఇప్పటివరకు పరిహారం అందలేదు. కనీసం ఏమైందన్న సమాచారం రాలేదు. ప్రభుత్వం నష్టపరిహారం అందజేసి మా కుటుంబాన్ని ఆదుకోవాలి.
– లేళ్ల సత్యనారాయణ, పాడి రైతు, ఉయ్యందన గ్రామం, క్రోసూరు మండలం, పల్నాడు జిల్లా
జింక్ కొనుగోలు చేస్తేగాని యూరియా ఇవ్వలేదు
నాకు రెండున్నర ఎకరాల భూమి ఉంది. అందులో ఖరీఫ్‌లో వరి పంట వేశాను. ఎరువుల కోసం పడరాని పాట్లు పడ్డాం. జింక్ సల్ఫేట్ కొనుగోలు చేస్తేగాని యూరియా ఇవ్వలేదు. జింక్ అవసరం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో కొనుగోలు చేయాల్సి వచ్చింది.
– రొంగలి సత్యం, రైతు, ఉయ్యడవలస, మెంటాడ మండలం, విజయనగరం జిల్లా
ఆధార్ లింకు కాలేదని విద్యుత్ సబ్సిడీ ఎత్తేశారు
నేను 15 ఏళ్లుగా చేపలు, రొయ్యల చెరువులు చేస్తున్నా. మొదట్లో డీజిల్ ధర తక్కువగా ఉండటంతో ఆయిల్ ఇంజిన్లతో ఏరియేటర్ల ద్వారా రొయ్యలు, చేపలకు ఆక్సిజన్ అందించేవాళ్లం. డీజిల్ ధరలు పెరగడంతో పదేళ్లుగా విద్యుత్ వినియోగిస్తున్నాం. 2018 నుంచి వనామీ రొయ్యలకు వైట్ స్పాట్, విబ్రియో, ఈహెచ్‌పీ, వైట్ గట్ తదితర వైరస్‌లు సోకటంతో తీవ్ర నష్టాలు వచ్చి అప్పులపాలయ్యాం. కరెంటు కూడా యూనిట్‌కు రూ.3చొప్పున నెలకు సుమారు రూ.40వేలు బిల్లు వచ్చేది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే 2019లో మా ఆక్వా రైతుల కష్టాలను చూసి యూనిట్ విద్యుత్‌ను సబ్సిడీపై రూ.1.50లకే ఇచ్చారు. దీంతో నాలాంటి ఆక్వా రైతులకు చాలా మేలు కలిగింది. చంద్రబాబు 2024లో ముఖ్యమంత్రి అయ్యాక నా ఆధార్‌తో విద్యుత్ కనెక్షన్ లింకు కాలేదని సబ్సిడీ ఎత్తేశారు. ఒకవైపు యూనిట్‌కు రూ.3లు చొప్పున విద్యుత్ భారం, మరోవైపు చేపలు, రొయ్యల ధరలు, లీజులు పెరిగిపోయి మళ్లీ అప్పులే మిగులుతున్నాయి.
–పెచ్చెట్టి నాగ పెంటయ్య, ఆక్వా రైతు, ఎల్‌వీఎఎన్ పురం, పశ్చిమగోదావరి జిల్లా
ఆస్పత్రిలో డాక్టర్ లేరు.. మందుల్లేవు.. గొర్రెలకు నేనే నాటు వైద్యం చేస్తున్నా
మాది ప్రకాశం జిల్లా మర్రిపూడి. గొర్రెలు మేపుకొని జీవనం సాగిస్తున్నా. ఇటీవల జీవాలకు జబ్బు చేయడంతో మర్రిపూడిలోనే ఉన్న పశువుల ఆస్పత్రికి తీసుకెళ్లా. అక్కడ డాక్టర్ లేరు. సిబ్బంది మాత్రం జీవాలను చూసి మందులు లేవని చెప్పారు. అందువల్ల నేనే జీవాలకు నాటు వైద్యం చేస్తున్నా. కాళ్లకు పుండ్లు పడి నడవలేని స్థితిలో ఉన్న గొర్రెలను ఇంటి వద్దే వదిలేసి నేను పొలం పనులకు వెళ్తున్నా. జీవాలకు జబ్బు చేయడంతో ఒక్కొక్కటిగా చనిపోతున్నాయి. నాకు 80 గొర్రెలు ఉన్నాయి. గత నెల రోజుల వ్యవధిలో నాలుగు గొర్రెలు చనిపోయాయి. రేపు ఏమవుతుందో అని భయంతో బతుకున్నా. ఎన్నిసార్లు పశువుల ఆస్పత్రికి వెళ్లినా మందుల్లేవంటున్నారు.
– దుద్దుకుంట వెంకటేశ్వరరెడ్డి, గొర్రెలకాపరి, మర్రిపూడి, ప్రకాశం జిల్లా
అమూల్ లేక నెలకు రూ.6వేలు నష్టం
నాకున్న ఐదు ఆవులు పూటకు 20 లీటర్ల పాలిస్తాయి. ఉదయం, సాయంత్రం కలిపి 40 లీటర్ల పాలు అమ్ముతాను. ఎంతోకాలం హెరిటేజ్, శ్రీజ వంటిæ డెయిరీలకు అమ్మినా ఒక లీటరు పాలకు రూ.35 పైన ఎప్పుడూ ఇవ్వలేదు. అంత తక్కువ ఇస్తే ఎలాగని అడిగితే పాలలో వెన్న శాతం తక్కువగా ఉందన్నారు. అదే పాలను అమూల్ డెయిరీ డెయిరీ వాళ్లకు ఇచ్చినప్పుడు లీటరుకు రూ.38 నుంచి రూ.40 ఇచ్చారు. అమూల్ వల్ల ఒక లీటరుకు రూ.3 నుంచి రూ.5 వరకు అదనంగా రావడంతో 40 లీటర్లకు రోజుకు రూ.200 వరకు అదనపు లాభం వచ్చేది. ఈ ప్రభుత్వం వచ్చాక అమూల్‌ను లేకుండా చేయడంతో రోజుకు రూ.200 లెక్కన నెలకు రూ.6 వేలు వరకు నష్టపోతున్నా. అయినా ఏమీ చేయలేక శ్రీజ డెయిరీ వాళ్లకు పాలు అమ్ముకుంటున్నా. – రాజమ్మ, మహిళా పాడిరైతు, చిన్నగొట్టిగల్లు, తిరుపతి జిల్లా
అన్నదాతా సుఖీభవ.. రెండో ఏడాదీ మొండి చెయ్యి
మా ఊళ్లో 1.40 ఎకరాల్లో పంటలు సాగు చేసుకుంటున్నాను. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏటా వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం అందుకున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత నాకు గత ఏడాది అన్నదాతా సుభీభవ పథకం డబ్బులు పడలేదు. వ్యవసాయ శాఖ, సచివాలయ అధికారులను అడిగితే, నా భూమికి సంబంధించిన పత్రాలు అడిగారు. అవి అందజేసినా గత ఏడాది రావాల్సిన రూ.7 వేలు రాలేదు. ఇటీవల విడుదల చేసిన అన్నదాతా సుఖీభవ–పీఎం కిసాన్ పథకం సొమ్ము కూడా నాకు రాలేదు. వ్యవసాయాధికారులను అడిగితే సరైన సమాధానం లేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతుకు ఏదైనా సమస్య వస్తే మా ఊరిలోనే సచివాలయం, రైతు భరోసా కేంద్రాల్లో పరిష్కారం చూపేవారు. ప్రస్తుతం జిల్లా అధికారులను అడిగినా ప్రయోజనం కని పించడం లేదు.
– ఇనకొండ సత్యనారాయణ, రైతు, సిరివాడ, పెద్దాపురం మండలం, కాకినాడ జిల్లా
అప్పుల బాధ భరించలేక మా ఆయన ఉరి పోసుకున్నాడు
మాకున్న 4 ఎకరాలతోపాటు మరో 10 ఎకరాలు కౌలుకు తీసుకుని మా ఆయన సాగు చేశాడు. సాగు ఖర్చుల కోసం రూ.10 లక్షల వరుకు అప్పులు తెచ్చారు. సాగు చేసిన మిర్చి తెగుళ్ల వల్ల దెబ్బతింది. కాస్త పంట చేతికొచ్చినా గిట్టుబాటు ధర రాలేదు. బ్యాంకులవారు, అప్పులు ఇచి్చనవారు వెంటనే అప్పు తీర్చాలని ఒత్తిడి చేయడంతో మా ఆయన ఈ ఏడాది జూలై 2వ తేదీన మా ఇంటి పక్కన షెడ్డులో ఉరిపోసుకుని చనిపోయాడు. కొనకొండ్ల గ్రామం కెనరా బ్యాంకులో రూ.4 లక్షల అప్పుతోపాటు గుంతకల్లు మణప్పరంలో గోల్డ్ లోన్‌లో బంగారు తాకెట్టు పెట్టి రూ.2 లక్షలు తెచ్చారు. బయట వ్యక్తుల వద్ద రూ.4 లక్షల వరుకు అప్పులు ఉన్నాయి. నాకు ఇద్దరు కుమారులు. బాగా బతికిన మా కుటుంబం పరిస్థితి ఇప్పుడు దారుణంగా మారింది.
– ఉప్పర శంకరమ్మ, రైతు ధనంజయ భార్య, కొనకొండ్ల గ్రామం, వజ్రకరూర్ మండలం, అనంతపురం జిల్లా


