పోసాని కృష్ణమురళిపై కూటమి సర్కార్‌ మరో కుట్ర | Case Registered Against Posani Krishna Murali At Bapatla Police Station | Sakshi
Sakshi News home page

పోసాని కృష్ణమురళిపై కూటమి సర్కార్‌ మరో కుట్ర

Mar 12 2025 6:38 PM | Updated on Mar 12 2025 7:16 PM

Case Registered Against Posani Krishna Murali At Bapatla Police Station

సాక్షి, గుంటూరు: పోసాని కృష్ణమురళిపై కూటమి సర్కార్‌ మరో కుట్రకు తెరతీసింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ బాపట్ల పోలీస్‌స్టేషన్‌లో పోసానిపై కేసు నమోదు చేశారు. పోసాని పీటీ వారెంట్‌ను అనుమతించాలంటూ తెనాలి కోర్టులో బాపట్ల పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. పోసాని పీటీ వారెంట్‌ను తెనాలి కోర్టు అనుమతించింది.

కాగా, పోసాని కృష్ణమురళిపై నమోదైన అన్ని కేసుల్లో ఇప్పటికే బెయిల్‌ లభించింది. ఈ తరుణంలో ఆయన ఇవాళ ఆయన కర్నూలు జైలు నుంచి విడుదల కావాల్సి  ఉంది. అయితే చివరి నిమిషంలో రిలీజ్‌కు బ్రేక్‌ పడింది. సోషల్‌ మీడియాలో అనుచిత పోస్ట్‌ పెట్టారంటూ పోసానిపై మరో కేసు తెరపైకి తెచ్చారు.

పోసాని కృష్ణమురళిపై మొత్తం ఏపీ వ్యాప్తంగా 30 ఫిర్యాదులకుగానూ 17 కేసులు నమోదు అయ్యాయి. ఫిబ్రవరి 26వ తేదీన అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పీఎస్‌లో నమోదైన కేసుకు గానూ ఆయన అరెస్ట్‌ అయ్యారు. అయితే న్యాయస్థానాల్లో ఊరట దక్కవచ్చనే ఉద్దేశంతోనే.. వరుసగా ఒక్కో పీఎస్‌లో నమోదైన కేసుకుగానూనా ఆయన్ని తరలిస్తూ వచ్చారు. అలా 2 వేల కిలోమీటర్లకుపైగా తిప్పి పోసానిని హింసించారు.

అక్రమ కేసులతో వేధిస్తున్న చంద్రబాబు సర్కారు అదే రీతిలో రెడ్‌బుక్‌ పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తోంది.. తాము బనాయిస్తున్న అక్రమ కేసులు ఎలాగూ న్యాయస్థానాల్లో నిలబడవు కాబట్టి విచా­రణ పేరుతో వేధించాలని పోలీసులను పురిగొల్పుతోంది. సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై లెక్కకు మించి అక్రమ కేసులు బనా­యించింది. 67 ఏళ్ల వయసున్న పోసాని కృష్ణ మురళికి కొంతకాలం క్రితమే గుండెకు శస్త్ర చికిత్స జరిగింది. ఆయనకు ఇతరత్రా తీవ్ర ఆరోగ్య సమస్యలున్నాయి. దీంతో చాలా ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటూ హైదరాబాద్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.

అయినా సరే చంద్రబాబు ప్రభుత్వం రెడ్‌బుక్‌ కుట్రలను ఆపలేదు. టీడీపీ, జనసేన పార్టీల నేతలు పక్కా పన్నాగంతో పోసాని కృష్ణ మురళిపై వివిధ జిల్లాల్లో అక్రమ కేసులు పెట్టారు. అనంతరం వరుస అరెస్టులతో దాష్టీకానికి తెగించారు. జనసేన కార్యకర్త ఫిర్యాదు మేరకు మొదట అరెస్ట్‌ చేయగా అక్కడ నుంచి రాష్ట్రమంతా తిప్పుతూ వరుసగా అరెస్ట్‌ల పర్వం కొనసాగించారు. 17 అక్రమ కేసులు బనాయించగా నాలుగు కేసుల్లో అరెస్టు చేశారు. తాజాగా  బాపట్ల పోలీస్‌స్టేషన్‌లో మరో కేసు నమోదు చేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement