వైస్ చైర్మన్ పీఠం కోసం బీటెక్ రవి వర్సెస్ తూగుట్ల మధు
25 మంది కౌన్సిలర్లతో మధు క్యాంపు.. బీటెక్ రవికి కేవలం 12 మందే మద్దతు
పార్టీ ఖర్చు చేసిన రూ. 10 కోట్లు తిరిగి ఇచ్చి రాజీనామా చేయాలని బీటెక్ రవి హుకుం
పరువు పోతుందని పెద్దల మధ్యవర్తిత్వం.. 2+3 ఏళ్ల ఫార్ములాతో సర్దుబాటు!
సాక్షి ప్రతినిధి, కడప: తెలుగుదేశం పార్టీ పులివెందులలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. మున్సిపల్ చైర్‌పర్సన్, కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారోత్సవం మరియు వైస్ చైర్మన్ ఎన్నిక ఇందుకు వేదికగా నిలిచింది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని పులివెందుల మున్సిపాలిటీని టీడీపీ ఏకపక్షంగా కైవసం చేసుకున్నప్పటికీ, పదవుల పంపకంలో మాత్రం నేతల మధ్య తీవ్ర స్థాయిలో చిచ్చు రేగింది.
నువ్వా–నేనా అన్నట్లుగా పోరు..
మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా టీడీపీ నేత తూగుట్ల మధుసూదన్‌రెడ్డి సతీమణి గీతను పార్టీ ఎంపిక చేసింది. దాదాపు రూ.3 కోట్ల వరకు ఖర్చు పెట్టేందుకు అంగీకరించి చైర్‌పర్సన్ పదవిని దక్కించుకున్నారు. అయితే, వైస్ చైర్మన్ ఎన్నిక వద్దకు వచ్చేసరికి అసలు కథ మొదలైంది. కిరికిరి బాషా సతీమణికి వైస్ చైర్మన్ పదవి ఇవ్వాలని నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి ప్రతిపాదించారు. అందుకు తూగుట్ల మధు ససేమిరా అన్నారు. తన సతీమణి చైర్‌పర్సన్‌గా ఉంటే, వైస్ చైర్మన్‌గా తన వర్గీయుడే ఉండాలని మొండికేశారు. ఇరువురి మధ్య వ్యవహారం ‘నువ్వా–నేనా’ అన్నట్లుగా మారడంతో మధ్యాహ్నం వరకు తీవ్ర ఉత్కంఠ, హైడ్రామా నడిచింది.
రూ.10 కోట్ల లెక్కలు.. రాజీనామా బెదిరింపులు!
ఈ క్రమంలో ఏకంగా 25 మంది కౌన్సిలర్లను తూగుట్ల మధు తన ఆధీనంలో ఉంచుకున్నారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ అయిన బీటెక్ రవికి కేవలం 12 మంది కౌన్సిలర్లు మాత్రమే మద్దతుగా నిలవడం గమనార్హం. ఈ పరిణామంతో ఆగ్రహించిన బీటెక్ రవి.. ‘మున్సిపల్ ఎన్నికల కోసం పార్టీ వెచ్చించిన రూ. 10 కోట్లు తిరిగి చెల్లించి, ఆ తర్వాత ఎవరైనా ఇష్టారాజ్యంగా రాజీనామా చేసుకోవచ్చు’ అంటూ హుకుం జారీ చేశారు. అందుకు తూగుట్ల మధు సైతం ఏమాత్రం తగ్గకుండా.. ‘మీరు కోరినట్లుగానే మొత్తం డబ్బు చెల్లించి రాజీనామా చేస్తాం’ అంటూ భీషి్మంచుకుని కూర్చున్నారు.
పరువు పోతుందని 2+3 ఏళ్ల ఫార్ములాతో సర్దుబాటు!
ఓవైపు ప్రజాబలం లేకుండా ఏకపక్షంగా మున్సిపాలిటీని కైవసం చేసుకున్న నేపథ్యంలో.. వర్గ విభేదాలతో రోడ్డున పడితే పార్టీ పరువు పూర్తిగా పోతుందని భావించిన కొందరు నేతలు ఇరువురి మధ్య మధ్యవర్తిత్వం నెరిపారు. ముందుగా బీటెక్‌రవి వర్గానికి రెండేళ్లు వైస్ చైర్మన్ పదవి ఇచ్చేలా, ఆ తర్వాత తూగుట్ల మధు ప్రతిపాదించిన వారికి మూడేళ్లు పదవి దక్కేలా ఒప్పందం కుదిర్చినట్లు సమాచారం. ఈ సర్దుబాటు కుదిరిన తర్వాతే మధు వర్గీయులు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా, 25 మంది కౌన్సిలర్లు తూగుట్ల మధుపై ప్రమాణం చేస్తూ తమ మద్దతు ప్రకటించడం పులివెందుల రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.


