సీఆర్‌డీఏ కృష్ణానదీగర్భంతోపాటు చెరువులు, వాగులు, వంకలను పూడ్చేస్తోంది
వాటిలో భారీ ఎత్తున కాంక్రీట్ నిర్మాణాలు చేపడుతోంది
ఇది వరద ముప్పు మరింత పెరగడానికి దోహదం చేస్తుంది
ఆర్‌టీఐ కింద ఇచ్చిన అధికారిక రికార్డులే తార్కాణం
ఇదే అంశంపై ఆక్షేపిస్తూ ప్రభుత్వానికి ఎన్జీటీ నోటీసులు జారీచేసింది
భూసమీకరణ, భూసేకరణలో అక్రమాలపై సీఆర్‌డీఏ తప్పుడు నివేదికలు ఇస్తోంది
ఈ వ్యవహారంపై తక్షణమే స్వతంత్ర దర్యాప్తు జరిపి.. నిజనిర్ధారణ చేసి.. న్యాయం చేయండి
ప్రపంచబ్యాంకు, ఏడీబీలకు రాజధాని ప్రాంత రైతు సమాఖ్య ఫిర్యాదు
ఊహాజనిత భూముల ధరలను అభివృద్ధి సూచికగా చూపవద్దని వినతి
ప్రస్తుత వాస్తవ ఆదాయం, స్థిరమైన జీవనోపాధి పునరుద్ధరణను మాత్రమే ప్రాతిపదికగా తీసుకోవాలంటూ డిమాండ్
సాక్షి, అమరావతి: రాజధాని ప్రాంతంలో 23 గ్రామాల్లో కృష్ణానది గర్భంతోపాటు చెరువులు, వాగులు, వంకలు వంటి జలవనరులను రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(సీఆర్‌డీఏ) పూడ్చివేసి ప్రాజెక్టుల నిర్మాణాల కోసం కేటాయించినట్లు సమాచారహక్కు చట్టం (ఆర్‌టీఐ) ద్వారా సేకరించిన అధికారిక రికార్డులు స్పష్టం చేస్తున్నాయని ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ)లకు రాజధాని ప్రాంత రైతుల సమాఖ్య(సీఆర్‌ఎఫ్‌ఎఫ్) ఫిర్యాదు చేసింది. పర్యావరణ అనుమతి ఇస్తూ.. విధించిన షరతులను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారంటూ దాఖలైన పిటిషన్‌పై విచారించిన జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఈనెల 18న రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసిందని గుర్తుచేసింది.
కృష్ణానది పరీవాహక ప్రాంతాలు, నదీగర్భంలో భారీ ఎత్తున సాగుతున్న కాంక్రీట్ నిర్మాణాలపై ఎన్‌జీటీ తీవ్రంగా స్పందించిందని తెలిపింది. అత్యంత ప్రధానమైన హైడ్రో–జియోమార్ఫలాజికల్, వరద నిర్వహణ అధ్యయనాలు పూర్తిచేయకముందే 2025 జూన్‌లో.. వరద నివారణ పనులను ఏ ప్రాతిపదికన ప్రారంభించారని ప్రశి్నంచింది. జలవనరులను ధ్వంసం చేయడం, శాస్త్రీయ అధ్యయనాలు చేయకుండా వరద నివారణ పనులు చేపట్టడం వల్ల రాజధాని ప్రాంతానికి వరద ముప్పు మరింత పెరిగే ప్రమాదం ఉందంటూ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై స్వతంత్ర సంస్థతో విచారణ జరిపి.. నిజనిర్ధారణ చేసి.. పర్యావరణాన్ని పరిరక్షించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.
ప్రపంచబ్యాంకు, ఏడీబీలకు సీఆర్‌ఎఫ్‌ఎఫ్ చేసిన ఫిర్యాదులో ప్రధానాంశాలు
⇒ రాజధాని ప్రాంతంలో భూసమీకరణ, భూసేకరణలో అక్రమాలు, నిబంధనల ఉల్లంఘన.. ప్లాట్ల కేటాయింపులు.. భూసేకరణలపై రైతుల నుంచి వచ్చిన అభ్యంతరాలు అన్నింటినీ పరిష్కరించామంటూ సీఆర్‌డీఏ తప్పుడు నివేదికలు సమర్పిస్తోంది. ఇక రాయపూడిలో గద్దె బుచ్చయ్య, పెనుమత్స శేషుకుమారి, వెంకటపాలెం గ్రామానికి చెందిన పసుపులేటి పార్వతీదేవి వంటి బాధిత రైతులకు సీఆర్‌డీఏ నుంచి ఎలాంటి అధికారిక ఉత్తర్వులు ఇవ్వకుండానే.. వారి సమస్య పరిష్కారమైనట్లుగా పరిగణించకూడదు.
⇒ భూముల వర్గీకరణపై సీఆర్‌డీఏ 2026 ఆగస్టు 4న ఆర్‌టీఐ కింద అధికారిక ఇచ్చిన సమాచారంలో.. రాజధాని ప్రాంతంలోని భూములకు ఎలాంటి పట్టణ వర్గీకరణ లేదని, ఇవన్నీ సాంకేతికంగా గ్రామీణ పరిధిలోనివేనని స్పష్టం చేసింది. ప్రపంచబ్యాంకు, ఏడీబీలు ఈ ప్రాజెక్టును అమరావతి ఇంటిగ్రేటెడ్ అర్బన్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం(ఏఐయూడీపీ) పేరుతో పట్టణ ప్రాజెక్టుగా పేర్కొంటుండగా.. సీఆర్‌డీఏ రికార్డుల్లో ఇవి గ్రామీణ ప్రాంతాలుగా ఉండటం బ్యాంకుల ముందస్తు సామాజిక అంచనా లోపాన్ని సూచిస్తోంది.
⇒ వ్యవసాయ ఆధారిత కూలీలు, కౌలురైతులు, భూసమీకరణ పరిధిలోకిరాని సామాన్య రైతుల సామాజిక–ఆర్థిక రక్షణను, వారి భూ–ఆధారిత జీవనోపాధిని అంతర్జాతీయ బ్యాంకులు పూర్తిగా విస్మరించాయి. భవిష్యత్తులో పెరగబోయే ఊహాజనిత భూముల ధరలను అభివృద్ధి సూచికగా చూపకుండా.. ప్రస్తుత వాస్తవ ఆదాయం, స్థిరమైన జీవనోపాధి పునరుద్ధరణను మాత్రమే ప్రాతిపదికగా తీసుకోవాలి.
⇒ సీఆర్‌డీఏ పరిధిలో గ్రామ పంచాయతీలు, మునిసిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించడం లేదు. సీఆర్‌డీఏ అధికారుల పాలన వల్ల స్థానిక ప్రజలు తమ స్వంత భూములు, వనరులపై హక్కులపై సరైన రీతిలో తమ గళాన్ని వినిపించలేకపోతున్నారు. సిటిజన్స్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) కేవలం ఒక అలంకారప్రాయమైన వేదికగా మారి, అధికారపక్ష రాజకీయ శ్రేణులతో నిండిపోయింది.
⇒ పర్యావరణ విధ్వంసం.. భూసమీకరణ, భూసేకరణలో అక్రమాలపై తక్షణమే ప్రపంచబ్యాంకు, ఏడీబీ స్వతంత్ర విచారణ జరిపి.. నిజనిర్ధారణ చేసి, తగిన న్యాయం చేయాలి. కేవలం భూసమీకరణ కింద భూములు ఇచ్చిన రైతులే కాకుండా.. భూసేకరణను వ్యతిరేకిస్తున్న రైతులు, కోర్టులను ఆశ్రయించిన భూయజమానులు, కౌలు రైతులు, మహిళలు, దళిత, భూమిలేని కూలీల అభిప్రాయాలను రహస్య ఇంటర్వ్యూల ద్వారా సేకరించాలి.


