అబద్ధాలను పటాపంచలు చేస్తాం: హరీశ్‌రావు | BRS Leaders Harish Rao And KTR Fires On Congress Govt | Sakshi
Sakshi News home page

అబద్ధాలను పటాపంచలు చేస్తాం: హరీశ్‌రావు

Jun 8 2025 1:46 AM | Updated on Jun 8 2025 1:46 AM

BRS Leaders Harish Rao And KTR Fires On Congress Govt

కాళేశ్వరంపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇస్తున్న హరీశ్‌రావు

కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌లో హరీశ్‌రావు 

అది ఒక ఇంజనీరింగ్‌ అద్భుతం.. ప్రతికూల పరిస్థితుల్లో కల్పతరువు 

విచారణ కమిషన్‌ ఎదుట నిజాలు చెప్పి దుష్ప్రచారాన్ని తిప్పికొడతాం 

ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతాం.. సీఎం దుర్మార్గ విధానంతో రాజ్యమేలుతున్నాడు: కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో బీఆర్‌ఎస్‌కు మంచిపేరు రావడంతోపాటు లబ్ధి జరుగుతుందనే దురుద్దేశంతో నాడు ప్రతిపక్షంలో, నేడు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ బురద జల్లుతోందని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ‘గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై చేసిన ఆరోపణలను నిజమని నిరూపించేందుకు కాంగ్రెస్‌ అనేక ప్రయత్నాలు చేస్తోంది. 

కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ఇంజనీరింగ్‌ అద్భుతం. తెలంగాణ జీవధార. ప్రతికూల పరిస్థితుల్లో తెలంగాణకు కల్పతరువు. అలాంటి ప్రాజెక్టును రీఇంజనీరింగ్‌ను చేయడంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టి, ప్రజలకు నిజాలు వివరిస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిషన్‌ ముందుకు వెళ్లి నిజాలు చెప్పి కాంగ్రెస్‌ ప్రభుత్వం చెబుతున్న అబద్ధాలను పటాపంచలు చేస్తాం. తాటాకు చప్పుళ్లకు బీఆర్‌ఎస్‌ నాయకత్వం బెదరదు. 

ప్రభుత్వం భేషజాలకు పోకుండా మేడిగడ్డ బరాజ్‌కు మరమ్మతులు చేసి సాగునీటిని అందించాలి. లేనిపక్షంలో ప్రజాఉద్యమాల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతాం’అని హరీశ్‌రావు హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం–వాస్తవాలు అనే అంశంపై హరీశ్‌రావు సోమవారం పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె. తారక రామారావు సహా పార్టీ ముఖ్యనేతలు హాజరైన ఈ సమావేశంలో సుమారు గంటన్నరపాటు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పూర్వాపరాలను వివరించారు. 

సీఎం, మంత్రులది దుష్ప్రచారం.. 
‘మేడిగడ్డ ప్రాజెక్టుకు మరమ్మతులు చేయకుండా రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలపైనే కాంగ్రెస్‌ దృష్టి పెట్టింది. కాళేశ్వరం కుప్పకూలిందంటూ దుష్ప్రచారం చేస్తున్న వారు ఈ ప్రాజెక్టు అనేక రిజర్వాయర్లు, బ్యారేజీలు, కాలువలు, పంప్‌హౌస్‌ల సమాహారమని గుర్తించాలి. కానీ ఈ అంశాన్ని విస్మరించి ప్రాజెక్టు వ్యయం పెంపు, ఆయకట్టు మొదలుకొని అనేక విషయాలపట్ల సీఎం, మంత్రులు దుష్ప్రచారం చేస్తున్నారు. 

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 20.33 లక్షల ఎకరాలకు ప్రయోజనం చేకూరుతోంది. రాష్ట్ర అవతరణకు ముందు పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పేరు చెప్పినా ఒక్క అనుమతి సాధించలేదు. మొబిలైజేషన్‌ అడ్వాన్సుల పేరిట రూ. 2,328 కోట్లు కాంట్రాక్టర్లకు ఇచ్చింది. 

పనులు చేపట్టకుండానే అంచనాలను రూ. 17,875 కోట్ల నుంచి రూ. 40 వేల కోట్లకు పెంచింది. తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తున ఆనకట్ట నిర్మించేందుకు మహారాష్ట్ర అంగీకరించకపోవడం, నీటి లభ్యత కేవలం 44 టీఎంసీలు ఉండటం, పర్యావరణ, అటవీ అనుమతులకు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొనే ప్రాజెక్టు రీడిజైనింగ్‌పై ఆలోచన చేశాం’అని హరీశ్‌రావు వివరించారు. 

తుమ్మడిహెట్టి వద్ద ప్రయత్నాలు విఫలమైనందునే.. 
‘తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించేందుకు మహారాష్ట్రలోని కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలతో జరిపిన సంప్రదింపులు విఫలమయ్యాయి. తుమ్మడిహెట్టి వద్ద ప్రతిపాదించిన బ్యారేజీ నిర్మాణం కోసం ప్రభుత్వ పరంగా రాజకీయంగా ఎన్నో ప్రయత్నాలు చేశాం. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్‌ సూచన మేరకు మేడిగడ్డను ఎంపిక చేశాం. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా కేవలం 11 టీఎంసీల నీటినే నిల్వ చేసే అవకాశం ఉండేది. 

కానీ కేసీఆర్‌ ముందు చూపుతో కాళేశ్వరం ద్వారా 141 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా 16 రిజర్వాయర్ల నిర్మాణం జరిగింది. ప్రాజెక్టును విస్తరించడం వల్లే అంచనా వ్యయం పెరిగింది. దేశంలో అతితక్కువ అంచనా వ్యయం పెంపుతో, అతితక్కువ సమయంలో నిర్మితమైన ప్రాజెక్టు కాళేశ్వరం మాత్రమే. పోలవరం ప్రాజెక్టు కుప్పకూలినా ఎన్నడూ సందర్శించని ఎన్‌డీఎస్‌ఏ.. ఇప్పుడు ఈడీ, సీబీఐ తరహాలో కేంద్ర ప్రభుత్వ జేబు సంస్థలా వ్యవహరిస్తోంది. 

ఎన్‌డీఎస్‌ఏ నివేదిక వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కుప్పకూలిందని ప్రచారం చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి.. రెండు రోజుల క్రితం శంకుస్థాపన చేసిన గంధమల్లకు నీరు ఎక్కడి నుంచి వస్తోందో చెప్పాలి’అని హరీశ్‌రావు ప్రభుత్వాన్ని నిలదీశారు. 

నిందలు, దందాలు, చందాల నినాదంతో రేవంత్‌ పాలన: కేటీఆర్‌ 
‘తెలంగాణ ఉద్యమ నినాదమైన నీళ్లు, నిధులు, నియామకాలకు పాతరేసిన సీఎం రేవంత్‌ దుర్మార్గపు విధానంతో రాజ్యమేలుతున్నాడు. బీఆర్‌ఎస్‌పై నిందలు, కాంట్రాక్టర్లతో దందాలు, ఢిల్లీ కాంగ్రెస్‌ పెద్దలకు చందాలు అనే నినాదంతో పాలన సాగిస్తున్నాడు. గోదావరి, కృష్ణాలో ప్రతి నీటిబొట్టునూ ఒడిసిపట్టి తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకే కేసీఆర్‌ కాలంతో పోటీపడి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. 

పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును, సీతారామ ప్రాజెక్టును 90 శాతం పూర్తి చేశారు. అనుమతి లేకుండా ఏపీ ప్రభుత్వం అనేక ప్రాజెక్టులు కడుతున్నా సీఎం, మంత్రులు, బీజేపీ నాయకులు మాట్లాడటం లేదు. దేశంలో, రాష్ట్రంలో ఏ ప్రాజక్టులు, బ్రిడ్జీలు కూలినా స్పందించని ఎన్‌డీఎస్‌ఏ.. కాళేశ్వరంలోని 100 కాంపోనెంట్లలో కేవలం ఒక్కచోట రెండు పిల్లర్లు కుంగితే ఏడాదిన్నరగా మరమ్మత్తు చేయకుండా రాద్ధాంతం చేస్తోంది. 

ఎన్‌డీఎస్‌ఏ నివేదిక పేరిట బీజేపీ ఆఫీసులో ఎన్‌డీఏ రిపోర్ట్‌ తయారు చేసి దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ నివేదిక చెత్తబుట్టలో వేయడానికి తప్ప దేనికీ పనికి రాదని ఎల్‌ అండ్‌ టీ సంస్థ తేల్చిచెప్పింది. పార్లమెంటు నూతన భవనం, కాంగ్రెస్‌ కేంద్ర కార్యాలయాన్ని నిర్మించింది కూడా ఎల్‌ అండ్‌ టీ సంస్థే. కాంగ్రెస్, బీజేపీ కలసికట్టుగా తెలంగాణ రైతుల గొంతు నొక్కే కుట్ర చేస్తున్న నేపథ్యంలో జిల్లాకు కూడా వెళ్లి వాస్తవాలు చెప్తాం’అని కేటీఆర్‌ స్పష్టం చేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement