సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో చంద్రబాబుకు పట్టిన గతే రేవంత్‌కూ పడుతుందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై డీజీపీ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. దమ్ముంటే బీఆర్‌ఎస్ దిమ్మెలు కూలగొట్టండి. మేమేంటో చూపిస్తామంటూ జగదీష్‌రెడ్డి సవాల్ విసిరారు. రోత రాతల పత్రికపై చర్యలు తీసుకోవాలని ఐఏఎస్‌ల సంఘం కోరాలి. త్వరలోనే పోలీసుల కూడా ప్రభుత్వంపై తిరగబడే రోజు వస్తుందంటూ జగదీష్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
‘‘తొందరలోనే రేవంత్ అధికార కోట కూలుతుంది. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలకు అర్థం కావడం లేదు. దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్లు, పంచుకునేందుకు ఒకరికొకరు సహకరించుకుంటున్నారు. నేడు ఖమ్మం సభలో తెలుగుదేశం జెండాలు కనిపించినప్పుడే అర్థమైంది. ఆనాడు చంద్రబాబు కూడా ఇలానే మాట్లాడిండు. అలా మాట్లాడిన బాబును పాతాళలోకానికి ప్రజలు పాతరేశారు.’’ అని జగదీష్‌రెడ్డి గుర్తు చేశారు.
‘‘చంద్రబాబు వైఖరినీ రాజకీయంగా కేసీఆర్ ఎదుర్కొన్నారు. తప్పా వ్యక్తిగత ఆరోపణలు చేయలేదు. కేసీఆర్ కాలి గోటికి రేవంత్ రెడ్డి సరిపోడు. కేసీఆర్ స్థాయికి.. రేవంత్ రెడ్డి గడ్డి పోసతో సమానం. కేటీఆర్‌పై సోషల్ మీడియాలో పోస్టులపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు చేస్తే ఇంత వరకు చర్యలు లేవు’’ అని జగదీష్‌రెడ్డి మండిపడ్డారు.


