
మీడియాతో మాట్లాడుతున్న మండలి ప్రతిపక్ష నేత బొత్స. చిత్రంలో వైఎస్సార్‌సీపీ సభ్యులు
శాసనమండలిలో ప్రభుత్వ తీరును నిలదీసిన ప్రతిపక్ష నేత బొత్స
ప్రజాస్వామ్యంలో ప్రజారోగ్యం ప్రైవేటీకరణా?.. దీనిని అడ్డుకునేందుకు ఎంతవరకైనా పోరాడతాం
ఏ సంస్థ తీసుకున్నా.. మేం అధికారంలోకి వచ్చాక రద్దు చేస్తాం
పీపీపీలో వ్యాపారం చేసుకోక, వాళ్ల డబ్బులు తెచ్చి పెడతారా?
విద్య, వైద్యం కమర్షియల్ అన్న ప్రభుత్వ ఆలోచనే దురదృష్టకరం.. ప్రజారోగ్యంపై రూ.10 వేల కోట్లు–రూ. 20 వేల కోట్లు ఖర్చు పెట్టడం ప్రభుత్వ బాధ్యత
చంద్రబాబు ఎప్పుడు సీఎం అయినా ప్రైవేటీకరణ కోసం ప్రయత్నాలే
పీపీపీపై పునరాలోచన చేయకుంటే చంద్రబాబు చరిత్ర హీనులే
ప్రభుత్వ తీరును నిరసిస్తూ మండలి నుంచి వైఎస్సార్‌సీపీ వాకౌట్
సాక్షి, అమరావతి: ‘‘ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ పేరుతో ప్రైవేట్‌కు అప్పగిస్తే వాళ్లేమైనా ఇంట్లో డబ్బులు తెచ్చి కాలేజీలు, ఆస్పత్రులను నిర్వహిస్తారా? ప్రజారోగ్యాన్ని ప్రైవేటు చేతుల్లో పెట్టడం అంటే పేదలకు ఉచిత వైద్యం అందకుండా చేయడమే’’ అని శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రజారోగ్యాన్ని ప్రైవేటుపరం చేస్తే బాధ్యత వహించేది ఎవరు? అని ప్రభుత్వ తీరును సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వ పెద్దల స్వార్థం, వాళ్ల తాబేదారులకు ప్రయోజనం చేకూర్చేందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని దుయ్యబట్టారు. దీనిని నిరసిస్తూ వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించారు.
‘వైద్య కళాశాలల విషయంలో ప్రభుత్వ విధానం’పై బుధవారం శాసనమండలిలో జరిగిన స్వల్పకాలిక చర్చలో బొత్స మాట్లాడారు. ‘ప్రపంచంలో ఎక్కడైనా ప్రజారోగ్యం, విద్య ప్రభుత్వం చేతుల్లోనే ఉన్నాయి. మన దగ్గర ఉన్న డబ్బు, బడ్జెట్‌తో ప్రజల ఆరోగ్యంతో ముడిపడిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కొలవడం చాలా దురదృష్టకరం. కోవిడ్ లాంటివి వస్తే పీపీపీ మోడ్‌లో ఉన్న ప్రైవేటు కళాశాలలు చూడవు. ప్రభుత్వ ఆస్పత్రులే దిక్కు. అందుకే విపత్కర పరిస్థితుల్లో ప్రతి జిల్లాలో ప్రభుత్వ కళాశాల ఉంటే, ప్రజలకు మెరుగైన వైద్యం దక్కుతుందని వైఎస్ జగన్ ఆలోచించారు. కానీ, దానిని కూటమి ప్రభుత్వం డబ్బుతో కొలుస్తోంది’’ అని తూర్పారపట్టారు.
బాబుది ప్రైవేటు జపమే..
చంద్రబాబు ఎప్పుడు సీఎం అయినా ప్రైవేటీకరణతోనే మొదలుపెడతారని బొత్స దుయ్యబట్టారు. ఆయనకు ప్రభుత్వ సంస్థలంటే చిన్న చూపని చెప్పారు. విద్య, వైద్యం కమర్షియల్ కాదని ప్రజల ఆరోగ్యానికి సంబంధించినవని, వాటిని ప్రైవేటుపరం చేయడం తగదని పేర్కొన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీలోకి తీసుకెళ్తే చంద్రబాబు చరిత్ర హీనుడుగా మిగిలిపోతారని తెలిపారు.
ప్రజారోగ్యంపై ఆమాత్రం ఖర్చు పెట్టలేరా?
‘‘ప్రజారోగ్యానికి రూ.10 వేల కోట్లు లేదంటే రూ.20 వేల కోట్లు అవుతాయి. ఆమాత్రం ఖర్చు పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా? విద్య, వైద్యంలో మూడో వ్యక్తి ప్రమేయం ఉంటే అనర్థం. పేదలకు నష్టం కలిగే ఈ విధానానికి మా పార్టీ పూర్తిగా వ్యతిరేకం. దీనిపై ఎంతవరకైనా పోరాడతాం. ఏ సంస్థ తీసుకున్నా.. మేం అధికారంలోకి వచ్చాక రద్దు చేసి వెనక్కి తీసుకుంటాం’’ అని బొత్స స్పష్టం చేశారు.
వాకౌట్ చేసి శాసన మండలి నుంచి బయటకు వస్తున్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు
కమర్షియల్.. సంక్షేమం మధ్య పోలికా?
‘‘పీపీపీ మోడ్ అంటే 33 ఏళ్లకు అద్దెకిస్తున్నాం అంటున్నారు. మరో 33 ఏళ్లకు వెసులుబాటు ఇచ్చారు. అంటే, 66 ఏళ్లు ప్రజారోగ్యాన్ని తాకట్టు పెట్టారు. అద్దె ఇంట్లో ఉన్నవాడు ఆ ఇంటిని ఎలా చూస్తాడు..? గంగవరం పోర్టుకు ప్రభుత్వాస్పత్రులకు పోలికా..? అవి కమర్షియల్ ప్రాపర్టీస్.. ఇవి ప్రజల ఆస్పత్రులు. భేషజాలకు పోకుండా.. ప్రజా శ్రేయస్సు, సంక్షేమం దృష్ట్యా మెడికల్ కాలేజీలను ప్రభుత్వ ఆ«దీనంలోనే నడపాలి’’ అని డిమాండ్ చేశారు.
సభలో గందరగోళం
తొలుత ఆరోగ్య మంత్రి సత్యకుమార్ చర్చను ప్రారంభిస్తూ దేశంలో హైవేలు, విద్యా సంస్థలు పీపీపీ మోడ్‌లోనే చేస్తున్నారన్నారు. ప్రైవేటీకరణ, పీపీపీకి తేడా తెలియకుండా మెడికల్ కాలేజీలపై వైఎస్సార్‌సీపీ వాళ్లు దుష్ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ సమయంలో సభ్యులకు పంచిన ప్రకటనలో లేనివారి పేర్లను ప్రస్తావించి ఆరోపణలతో సుదీర్ఘ ఉపన్యాసం చేయడంపై వైఎస్సార్‌సీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. బొత్స స్పందిస్తూ... స్వల్పకాలిక చర్చలో సభ్యులు మాట్లాడాక మంత్రి ఎంతసేపు సమాధానం చెప్పినా తమకు అభ్యంతరం లేదన్నారు. దానికిముందే సుదీర్ఘ ప్రసంగంతో పేర్లు ప్రస్తావిస్తూ మాట్లాడుతున్నారని, సభకిచి్చన ప్రకటనలో ఆ పేర్లు పెట్టి మాట్లాడాలని సూచించారు. దీంతో టీడీపీ సభ్యులు వెనక్కితగ్గారు.
కన్నబిడ్డను పెంచలేమని అమ్ముకుంటారా?
‘‘కావాల్సిన అనుమతులన్నీ వచ్చి నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలకు అప్పగించడం అంటే పుట్టిన బిడ్డను పెంచలేమని అమ్ముకోవడమే. ప్రజారోగ్యం బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకోవడమే’’ అని ప్రభుత్వాన్ని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు దుయ్యబట్టారు. ‘వైద్య కళాశాలల విషయంలో ప్రభుత్వ విధానం’పై బుధవారం శాసన మండలిలో స్వల్పకాలిక చర్చలో వారు మాట్లాడారు.
‘‘రూ.లక్షల కోట్లతో రాజధాని అమరావతి నిర్మాణానికి సిద్ధమైన ప్రభుత్వం రూ.వేల కోట్ల ప్రజా సంపద అయిన వైద్య కళాశాలలను కాపాడలేదా? ఎవరి స్వార్థం.. ఎవరి జేబులు నింపేందుకు.. ఏ పెత్తందార్లకు దోచిపెట్టేందుకు పీపీపీని తీసుకొస్తున్నారు? నాణ్యమైన విద్య, వైద్యం ప్రజల హక్కు. ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత. దాన్నుంచి తప్పించుకునే ప్రభుత్వాన్ని ఏమనాలి?’’ అంటూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు దుయ్యబట్టారు. కుంభా రవిబాబు, పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి, సిపాయి సుబ్ర మణ్యం, కల్పలత, ఇజ్రాయిల్, సూర్యనారాయణరాజు, మాధవరావు మాట్లాడుతూ మెడి కల్ కాలేజీల ప్రైవేటీకరణ సరికాదని పేర్కొన్నారు. దీనికి డబ్బులు లేవని సాకు చెప్పడం ఏమిటని విమర్శించారు. అమరావతిలో ఒక్క రోడ్డు ఖర్చు సాటి రాదు కదా అని ప్రశ్నించారు.