నోటీస్‌ కాదు.. నన్ను సస్పెండ్‌ చేయండి: ఎమ్మెల్యే రాజాసింగ్‌ | BJP MLA Raja Singh Sensational Comments | Sakshi
Sakshi News home page

నోటీస్‌ కాదు.. నన్ను సస్పెండ్‌ చేయండి: ఎమ్మెల్యే రాజాసింగ్‌

Jun 2 2025 7:49 PM | Updated on Jun 2 2025 9:01 PM

BJP MLA Raja Singh Sensational Comments

హైదరాబాద్‌: ఇటీవల కాలంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై పెదవి విరుస్తూ వస్తున్న గోషామహల్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌.. మరోసారి తన అసంతృప్తి వెళ్లగక్కారు.  ప్రధానంగా నిన్న(ఆదివారం) బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన వర్క్‌ షాపుకు రాజాసింగ్‌ దూరంగా ఉన్నారు. పలువురు నేతలు ఈ వర్క్‌ షాపుకు దూరం కాగా, అందులో రాజాసింగ్‌ కూడా ఉన్నారు.  ఈ నేపథ్యంలో రాజాసింగ్‌కు పార్టీ అధిష్టానం నోటీసులు ఇవ్వబోతుందనే వార్త మీడియాలో చక్కర్లు కొడుతోంది.  

ప్రధానంగా దీనిపై స్పందించిన రాజాసింగ్‌.. ‘ మీడియాలో ఒక వార్త నడుస్తుంది, రాజాసింగ్‌కు నోటీస్‌ ఇవ్వడానికి పార్టీ ప్లాన్‌ చేస్తోందనే చర్చ తెరపైకి వచ్చింది. ఒకవేళ అదే నిజమైతే నోటీస్‌ కాదు..  ఏకంగా నన్ను సస్పెండ్‌ చేయండి’ అంటూ రాజాసింగ్‌ సంచలన ప్రకటన చేశారు. అదే సమయంలో కొన్ని అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు రాజాసింగ్‌. ఒకవేళ నన్ను సస్పెండ్‌ చేస్తే అప్పుడు అందరి జాతకం బయటపెడతా. ఎవరి వల్ల పార్టీకి నష్టం జరిగింది అనే నిజం చెప్పి అందరి జాతకం ప్రజలు ముందు పెడతా’ అని రాజాసింగ్‌ పేర్కొన్నారు.

ఇదిలా ఉంచితే, గత కొంతకాలంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై రాజాసింగ్‌ గుర్రుగా ఉన్నారు. పార్టీకి అంటీముట్టనట్లు వ్యవహరిస్తన్నారు. కొన్ని రోజుల క్రితం ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌.. రాజాసింగ్‌ వద్దకు వెళ్లి రాజీ చేసే యత్నం చేశారు. పార్టీ అభివృద్ధి కలిసి నడవాలని రాజాసింగ్‌కు సూచించారు. ఆ సమయంలో బండి సంజయ్‌తో జరిగిన సఫలం అయినట్లు కనిపించినా తాజా ఎపిసోడ్‌తో రాజాసింగ్‌ మళ్లీ వార్తల్లోకి వచ్చారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైనట్లు ఆయన తాజా వ్యాఖ్యల్ని బట్టి తెలుస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి: 

కిషన్‌రెడ్డితో సఖ్యత లేదా?.. బీజేపీలో ఏం జరుగుతుంది?

‘టైమ్ పాస్ మీటింగ్‌లతో అలసిపోయాం’

Advertisement
 
Advertisement
Advertisement