
సాక్షి, హైదరాబాద్: నేడు బీజేపీ కీలక సమావేశాలు జరుగనున్నాయి. తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి అధ్యక్షతన బీజేపీ కోర్ కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా బీజేపీ శాసనసభాపక్ష నేతను ఎన్నుకునే అవకాశం ఉంది. కాగా, బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, మహేశ్వర్ రెడ్డిలో ఒకరికి ఛాన్స్ దక్కే అవకాశముంది.
వివరాల ప్రకారం.. కిషన్‌రెడ్డి అధ్యక్షతన బీజేపీ కోర్ కమిటీ సమావేశమైంది. ఈ భేటీలో పార్టీ అంతర్గత అంశాలు, నేతల మధ్య సమన్వయంపై చర్చ జరగనుంది. ఈ క్రమంలోనే లోక్‌సభ ఎన్నికల్లో సీటు ఆశిస్తున్న వారిపై రాష్ట్ర ఎన్నికల కమిటీలో చర్చ జరగనుంది. ఏకాభిప్రాయం ఉన్న స్థానాల్లో ముగ్గురితో కూడిన జాబితాను సిద్ధం చేసి నేతలు కేంద్ర కమిటీకి పంపించనున్నారు. ఇక, పార్లమెంట్‌లో పొలిటికల్ ఇంఛార్జ్‌లు, కన్వీనర్లతో సమావేశం సందర్భంగా పార్లమెంట్ ఎన్నికల రోడ్ మ్యాప్‌ను ఖరారు చేయనున్నారు. మరోవైపు, బీజేపీ శాసనసభాపక్ష నేతను కూడా నేడు ఎన్నుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాజాసింగ్, మహేశ్వర్‌రెడ్డిలలో ఒకరిని శాసనసభాపక్ష నేతగా ఎన్నుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం.
మరోవైపు.. ఆర్‌ఎస్‌ఎస్ ముఖ్య నేతలతో కిషన్ రెడ్డి, తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, అరవింద్ మీనన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ సంస్థాగత అంశాలు, పార్లమెంట్ ఎన్నికలు సమన్వయం, రామ మందిర దర్శనం తదితర అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి బీజేపీ సన్నద్ధమవుతోంది. ఈ నెలలోనే ప్రధాన మంత్రి నరేంద్రమోదీ రాష్ట్రంలో రెండు బహిరంగసభల్లో పాల్గొనేలో ప్రణాళికలు సిద్ధం చేశారు. ఉత్తర తెలంగాణలో ఒకటి, దక్షిణ తెలంగాణలో మరో సభకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ఆదివారం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంతి కిషన్‌రెడ్డి అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఇన్‌చార్జ్ సునీల్‌బన్సల్, సహ ఇన్‌చార్జ్ అరవింద్ మీనన్‌లు హాజరయ్యారు. ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన పది కమిటీలతో సమావేశమయ్యారు. ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని సునీల్ బన్సల్ ఆశాభావం వ్యక్తం చేశారు. పది కమిటీలు కేంద్ర నాయకత్వం సూచించిన విధంగా పనిచేస్తే, రాష్ట్రంలో పది లోక్‌సభ స్థానాలు కైవసం చేసుకోవడం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు.