
బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద నిర్వహించిన సంబరాల్లో బండి సంజయ్, రాజాసింగ్, లక్ష్మణ్ తదితరులు
సాక్షి, హైదరాబాద్: ఉత్తరప్రదేశ్‌తో సహా నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేయడం పట్ల బీజేపీ శ్రేణులు పెద్దఎత్తున సంబరాలు చేసుకున్నాయి. గురువారం ఫలితాలు వెలువడ్డాక బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద విజయోత్సవాలు నిర్వహించారు. టపాకాయలు కాల్చి, స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలంగాణలోనూ రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.
ప్రజలు డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని కోరుకుంటున్నారని, వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో, తెలంగాణలోనూ బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడడం ఖాయమన్నారు. ‘కేసీఆర్‌కు కోతలెక్కువ. దేశం మొత్తం తిరిగి టెంట్, ఫ్రంట్ పెడతానన్న కేసీఆర్ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రచారానికి ఎందుకు వెళ్లలేదు?’అని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ.. ‘యూపీలో గూండా, మాఫియా రాజ్యాన్ని యోగి సర్కార్ ఖతం చేసింది.
తెలంగాణలో కేసీఆర్ పాలనలో మాఫియా రాజ్యమేలు తోంది. అవినీతి పేట్రేగిపోతోంది. సంజయ్ సారథ్యంలో తెలంగాణలో బీజేపీ గెలుపు ఖాయం’అని చెప్పారు. తెలంగాణలోనూ యూపీ తరహా పాలన కావాలని ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. ‘ఔర్ ఏక్ దక్కా... తెలంగాణ పక్కా’నినాదంతో ముందుకెళ్తామన్నారు. ఈ ఉత్సవాల్లో సీనియర్ నేతలు ఎన్.ఇంద్రసేనారెడ్డి, స్వామిగౌడ్, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి పాల్గొన్నారు.