అన్సారీది దేశద్రోహం.. మాజీ ఉపరాష్ట్రపతిపై బీజేపీ తీవ్ర ఆరోపణలు | BJP cites Pak journalist claim to attack Ansari, he counters: Litany of falsehood | Sakshi
Sakshi News home page

అన్సారీది దేశద్రోహం.. మాజీ ఉపరాష్ట్రపతిపై బీజేపీ తీవ్ర ఆరోపణలు

Jul 14 2022 1:10 AM | Updated on Jul 14 2022 7:04 AM

BJP cites Pak journalist claim to attack Ansari, he counters: Litany of falsehood - Sakshi

నుస్రత్‌ మీర్జా అనే పాకిస్తాన్‌ జర్నలిస్టు తాను పలుమార్లు భారత్‌లో పర్యటించి అత్యంత రహస్యమైన సున్నిత సమాచారాన్ని సేకరించి పాక్‌ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐకి అందించానంటూ చేసిన వ్యాఖ్యలు కొద్ది రోజులుగా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

న్యూఢిల్లీ: ఐఎస్‌ఐ తరఫున గూఢచర్యం చేసిన పాకిస్తాన్‌ జర్నలిస్టు ఒకరితో మాజీ ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ దేశ రహస్యాలను పంచుకున్నారంటూ బీజేపీ చేసిన తీవ్ర ఆరోపణలు బుధవారం రాజకీయంగా తీవ్ర కలకలం రేపాయి. సదరు జర్నలిస్టును అన్సారీ స్వయంగా భారత్‌కు ఆహ్వానించారంటూ బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్‌ భాటియా ఆరోపించారు. వీటిని అన్సారీ తోసిపుచ్చారు. సదరు జర్నలిస్టును తానెన్నడూ కలవడం గానీ, భారత్‌కు ఆహ్వానించడం గానీ చేయలేదన్నారు.

నుస్రత్‌ మీర్జా అనే పాకిస్తాన్‌ జర్నలిస్టు తాను పలుమార్లు భారత్‌లో పర్యటించి అత్యంత రహస్యమైన సున్నిత సమాచారాన్ని సేకరించి పాక్‌ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐకి అందించానంటూ చేసిన వ్యాఖ్యలు కొద్ది రోజులుగా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఉగ్రవాదంపై భారత్‌లో జరిగిన ఓ సెమినార్‌లో కూడా తాను పాల్గొన్నానని, అన్సారీ అందులో ప్రసంగించారని మీర్జా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో మీర్జా వ్యాఖ్యలను ఉటంకిస్తూ అన్సారీపై భాటియా తీవ్ర ఆరోపణలు చేశారు.

‘‘2005–11 మధ్య అన్సారీ తనను కనీసం ఐదుసార్లు భారత్‌కు ఆహ్వానించినట్టు మీర్జా చెప్పాడు. దేశ రక్షణకు సంబంధించిన అత్యంత రహస్య సమాచారాన్ని కూడా మీర్జా ఆయన నుంచి రాబట్టి ఐఎస్‌ఐతో పంచుకున్నట్టుగా కన్పిస్తోంది. అన్సారీ ఇరాన్‌లో భారత రాయబారిగా కూడా దేశ ప్రయోజనాలకు భంగం కలిగేలా వ్యవహరించారు. ఇదంతా దేశద్రోహం కాక మరేమిటి? దేశ ప్రజలు ఆయన్ను ఎంతగానో గౌరవిస్తుంటే ఆయనేమో దేశానికే ద్రోహం తలపెట్టారు’’ అంటూ దుయ్యబట్టారు. ‘‘ఈ మొత్తం ఉదంతంలో అన్సారీతో పాటు యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ బదులివ్వాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయి.

వాళ్లు తక్షణం నిర్దోషిత్వం నిరూపించుకోవాలి’’ అని డిమాండ్‌ చేశారు. శత్రు గూఢచారులను భారత్‌కు అధికారికంగా ఆహ్వానించడమే ఉగ్రవాదంపై కాంగ్రెస్‌ వైఖరా అని ప్రశ్నించారు. అన్సారీని ఉద్దేశించి పాక్‌ జర్నలిస్టు బయటపెట్టిన విషయాలు చాలా తీవ్రమైనవని బీజేపీ ఉపాధ్యక్షుడు బైజయంత్‌ జై పండా అన్నారు. ‘‘అన్సారీ వంటి వ్యక్తిని యూపీఏ రెండుసార్లు ఉపరాష్ట్రపతిని చేసింది. దీన్నిబట్టి యూపీఏ హయాంలో దేశ అత్యున్నత పదవుల్లో నియామకాల విషయంలో గోల్‌మాల్‌ జరిగిందా అన్న తీవ్రమైన అనుమానాలు తలెత్తుతున్నాయి’’ అంటూ ట్వీట్‌ చేశారు. 2007లో యూపీఏ హయాంలో ఉపరాష్ట్రపతి అయిన అన్సారీ 2017 దాకా పదవిలో కొనసాగారు.

మోదీ అండ్‌ కో దిగజారుడుతనం: జైరాం
బీజేపీ ఆరోపణలపై కాంగ్రెస్‌ తీవ్రంగా మండిపడింది. ఇది అన్సారీ, సోనియా వ్యక్తిత్వాలను కించపరిచే నీచ ప్రయత్నమంటూ కాంగ్రెస్‌ ఎంపీ జైరాం రమేశ్‌ దుయ్యబట్టారు. వ్యక్తిత్వ హననానికి ఇది పరాకాష్ట అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన అనుయాయుల దిగజారుడుతనానికి అంతులేకుండా పోతోందని విమర్శించారు. వాళ్ల మనసులు ఎంత రోగగ్రస్తంగా మారాయో ఈ వ్యాఖ్యలను బట్టి తెలుస్తోందన్నారు.

నాది మచ్చలేని పనితీరు: అన్సారీ
బీజేపీ ఆరోపణలను ఖండిస్తూ అన్సారీ ప్రకటన విడుదల చేశారు. ‘‘2010 డిసెంబర్‌ 10న ఉగ్రవాదంపై సదస్సును నేను ప్రారంభించి ప్రసంగించాను. నిర్వాహకులు ఎవరిని ఆహ్వానించిందీ నాకు తెలియదు. నేనెవరినీ ఆహ్వానించలేదు’’ అని పేర్కొన్నారు. ‘‘ఇరాన్‌ రాయబారిగా నేను చేసిన ప్రతి పనీ నాటి కేంద్ర ప్రభుత్వ ఎరుకలో ఉంది. జాతీయ భద్రత దృష్ట్యా ఈ విషయాలపై ఇంతకంటే ఏమీ వ్యాఖ్యానించలేను.

ఇరాన్‌ విధుల అనంతరం ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధిగా నియుక్తుడినయ్యా. నా పనితీరును భారత్‌తో పాటు ప్రపంచమంతా గుర్తించింది’’ అని చెప్పారు. అన్సారీ ఉపరాష్ట్రపతిగా ఉండగా ఆయన ఓఎస్డీగా పని చేసిన గుర్‌ప్రీత్‌సింగ్‌ సప్పల్‌ కూడా బీజేపీ ఆరోపణలను ఖండించారు. ‘‘మీర్జా ఎక్కడా తనను అన్సారీ ఆహ్వానించారని చెప్పలేదు. ఆయన ప్రసంగించిన సెమినార్లో మిగతా జర్నలిస్టులతో పాటు మీర్జా కూడా ఉన్నాడంతే’’ అంటూ ట్వీట్‌ చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement