
కిషన్‌రెడ్డితో పాటు ముఖ్యనేతలు మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో..
సాక్షి, ఢిల్లీ: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ రేపు(గురువారం) ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో కుటుంబ సమేతంగా కలవనున్నట్లు సమాచారం. జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి దక్కిన నేపథ్యంలోనే కృతజ్ఞతలు తెలియజేయడానికి ఆయన కలుస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన హస్తినలో పలువురు పెద్దలను వరుసగా కలుస్తూ వచ్చారు.
ఇదిలా ఉంటే.. ఎల్లుండి(శుక్రవారం) ఉదయం ఢిల్లీ కేంద్ర కార్యాలయంలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆపై మధ్యాహ్నానికి హైదరాబాద్‌కు చేరుకుంటారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్ట్‌లో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు శ్రేణులు సిద్ధమవుతున్నాయి. అనంతరం శంషాబాద్‌లోనే ఓ ఫంక్షన్ హాల్‌లో సంజయ్ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం జరగనుంది. దానికి బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్‌రెడ్డి, ముఖ్యనేతలు హాజరు కానున్నారు.
ఏ రాష్ట్రం ఇస్తారో..
జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాతో బండి సంజయ్‌కు ఏదో ఒక రాష్ట్రం బాధ్యతలు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే.. దక్షిణాది రాష్ట్రం అయితే బాగుంటుందన్న భావనలో బండి సంజయ్ ఉన్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ ఇన్ చార్జ్ పోస్ట్ ఖాళీగా ఉంది.