అరెస్ట్‌ అయిన వారంతా కవిత గెలుపు కోసం పనిచేశారు: ఎంఐఎం ఒవైసీ

Asaduddin Owaisi Interesting Comments Over MIM Contest In Telangana - Sakshi

సాక్షి, నిజామాబాద్‌: ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ నిజామాబాద్‌ జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్బంగా నిజామాబాద్‌ జిల్లా జైలులో ఉన్న బోధన్‌ ఎంఐఎం నేతలతో ములాఖత్‌ అయ్యారు. అయితే, ఇటీవలే బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే షకీల్‌ ఫిర్యాదుతో మజ్లిస్‌ నేతలు అరెస్ట్‌ అయిన విషయం తెలిసిందే. 

జైలు ములాఖత్‌ అనంతరం ఒవైసీ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. ఈ సందర్బంగా ఒవైసీ మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో మెజార్టీ స్థానాల్లో పోటీ చేస్తాం. ఎక్కడెక్కడ పోటీ చేస్తామనేది ఎన్నికల ముందు జాబితాను ప్రకటిస్తాం. బోధన్‌లో ఎంఐఎం పోటీ చేస్తుంది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే షకీల్‌కు ఎన్నికల ద్వారా తగిన బుద్ధి చెబుతాం. ఎంఐఎం కౌన్సిలర్స్‌, నేతలపై అక్రమ కేసులు పెట్టారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్‌, డీజీపీ దృష్టికి తీసుకువెళ్తాం. అరెస్ట్‌ అయిన ఎంఐఎం నేతలు.. ఎమ్మెల్సీ కవిత, షకీల్‌ గెలుపు కోసం పనిచేశారు.  

తెలంగాణలో ముస్లింలకు కూడా ముస్లిం బంధు ఇవ్వాలి. ముస్లింలలో పేద ప్రజలు ఎక్కవగానే ఉన్నారు. గతంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లాము. కానీ, ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మసీదులు తొలగించి సచివాలయం నిర్మించారు.  ఆ మసీదులు వెంటనే కట్టాలి అని డిమాండ్‌ చేశారు. 

ఇదే క్రమంలో ఎంఐఎం బలపడటం కోసం ముందుగా పనిచేస్తాం. ఏ పార్టీతో మద్దతు.. ఏ పార్టీతో ముందుకెళ్లాలనేది ఆలోచిస్తాం. పాట్నా మీటింగ్‌కు ప్రతిపక్ష పార్టీలు నన్ను పిలవలేదు. తెలంగాణలో మేం కూడా ప్రత్యామ్నాయమే. తెలంగాణలో గెలుపోటములను ప్రజలు నిర్ణయిస్తారు. మణిపూర్‌లో మైనార్టీలకు అన్యాయం చేస్తున్నారు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 

ఇది కూడా చదవండి: బీజేపీలో కోల్డ్‌వార్‌ పాలిటిక్స్‌.. జేపీ నడ్డాకు వారు ముగ్గురు ఏం చెప్పారు?

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top