
సాక్షి, పల్నాడు: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రజాదరణ చూసి కూటమి సర్కార్ కొత్త కుట్రలకు తెర లేపింది. ఆయన పర్యటనలకు వెళ్లకుండా అడ్డంకులు సృష్టించేందుకు కొత్త ప్లాన్‌తో ముందుకు సాగుతోంది. వైఎస్ జగన్ నేడు పల్నాడు జిల్లా పర్యటనకు వెళ్తున్న సందర్భంగా.. ఆయన పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. వైఎస్ జగన్ పర్యటనపై పోలీసులు సాయంతో కూటమి సర్కార్ అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తోంది.
వైఎస్ జగన్ నేడు పల్నాడు జిల్లా రెంటళ్లపాడు పర్యటన సందర్బంగా పోలీసులు ఆంక్షలు విధించారు. వైఎస్ జగన్ పర్యటనకు కేవలం వంద మంది మాత్రమే రావాలంటూ పోలీసులు ఆంక్షలు పెట్టారు. కేవలం మూడు వాహనాలను మాత్రమే అనుమతి ఇస్తామని ఎస్పీ ఓ ప్రకటనలో తెలిపారు. అయితే, నిరసన, ధర్నా కాకపోయినా ఇలా.. పోలీసుల ఆంక్షలు విధించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్సార్‌సీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించే స్వేచ్చ కూడా లేదా అంటూ వైఎస్సార్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల ద్వారా వైఎస్ జగన్ పర్యటనను కూటమి సర్కార్ నియంత్రించే కుట్రలు చేస్తోందని ఆరోపించారు.

ఇక, వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ నేతలు అనుమతి కోసం ఇప్పటికే ఏడు సార్లు జిల్లా ఎస్పీకి వినతి పత్రం ఇచ్చారు. అయినప్పటికీ పోలీసులు ఇలా ఆంక్షలు విధించడమేంటని నేతలు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు సర్కార్ ఆదేశాల మేరకే వైఎస్ పర్యటనలను నియంత్రించేందుకు పోలీసులు ఇలా ఆదేశాలు జారీ చేశారని అటు ప్రజలు సైతం మండిపడుతున్నారు.

మరోవైపు.. వైఎస్ జగన్ పర్యటనలో పాల్గొన వద్దంటూ వైఎస్సార్‌సీపీ నేతలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి నేతల వరకు నోటీసులు పంపించారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి సహా పల్నాడు జిల్లా నేతలందరికీ నోటీసులు అందించారు. బుధవారం ఉదయం నుంచే వాహనాలను వెళ్లకుండా అడ్డంకులు సృష్టంచారు. పోలీసులు ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి వాహనాలను అడ్డుకుంటున్నారు. నరసరావుపేట, మాచర్ల, గుంటూరు వైపు నుండి సత్తెనపల్లి వైపు వాహనాలను వెళ్లనీయడం లేదు. రెంటపాళ్ల ఊరిలోకి ఇతరులను రానీయకుండా అడ్డుకుంటున్నారు. గ్రామస్థులను కూడా ఆధార్ కార్డు చూపాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. ఇక, ఇప్పటికే రెంటపాళ్లకు భారీ సంఖ్యలో ప్రజలు చేరుకుంటున్నారు.