
సాక్షి, విజయవాడ: పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీపీ ఉప ఎన్నికల్లో టీడీపీ అరాచకం రాజ్యమేలుతుందని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు, ఓటర్లు బూత్‌ల వద్దకు వెళ్లకుండా అడ్డుకున్నారు. టీడీపీ, పోలీసులు కలిసి వ్యూహాత్మకంగా పద్ధతి ప్రకారం కుట్ర చేశారని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల, ఒంటిమిట్టలో టీడీపీ అరాచకాలపై ఎస్‌ఈసీకి వైఎస్సార్‌సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
‘‘పోలీసుల సహాయంతో మా పోలింగ్ ఏజెంట్లను బయటికి నెట్టేశారు. ఇతర నియోజకవర్గాల నుంచి వందలాది మంది టీడీపీ గూండాలు వచ్చారు. వైఎస్సార్‌సీపీ నేత బలరాంరెడ్డి పోలింగ్ ఏజెంట్‌గా ఉన్నప్పటికీ ఆయన్ని వెళ్లనివ్వలేదు. వైఎస్సార్‌సీపీకి ఓటు వేసే వారిని గుర్తించి బయటికి పంపించేస్తున్నారు. ఎంపీ అవినాష్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారు. ఆయన ఇంటిని ధ్వంసం చేశారు. సాయంత్రం వరకూ అవినాష్ రెడ్డిని తిప్పాలనుకున్నారు. ప్రజలు తిరగబడటంతో ఎర్రగుంట్లలో వదిలిపెట్టారు
..ఎస్వీ సతీష్ రెడ్డిని ఇంటి నుంచి బయటికి రాకుండా అరెస్ట్ చేశారు. వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్ధిని కూడా బయటికి రానివ్వలేదు. టీడీపీ అభ్యర్ది మాత్రం అన్ని చోట్లా తిరగనిస్తున్నారు. నల్లకుంట్ల పాడులో పోలీసుల కాళ్లు పట్టుకుని మరీ ఓటర్లు వేడుకున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన రోజే కుట్ర మొదలైంది. పులివెందుల, ఒంటిమిట్టలో కుట్రలతో గెలవాలని ముందే ప్లాన్ చేశారు. కుట్రలతో గెలిచి వైఎస్ జగన్ పనైపోయిందని ప్రచారం చేయాలని చూస్తున్నారు
టీడీపీ ఓటర్లు మాత్రమే ఓటేసేలా ప్లాన్ చేసుకున్నారు. ఇది చాలా ప్రమాదకరం. నంద్యాలలో కూడా చంద్రబాబు ఇలానే చేశారు. చంద్రబాబు చర్యలతో వందేళ్లు వెనక్కిపోయాం. చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాడు. ఇంత దుర్మార్గంగా ఎన్నడూ ఎన్నికలు జరగలేదు. కనంపల్లిలో వైఎస్సార్‌సీపీ సర్పంచ్‌ను తుపాకీతో బెదిరించారు. జమ్మలమడుగు మార్కెట్ యార్డ్ ఛైర్మన్ టీడీపీ నేత నాగేశ్వరరెడ్డి పులివెందులలో ఓట్లు వేశారు. ఎన్నికల కమిషన్ తీరు చెవిటోడి ముందు శంఖం ఊదినట్లు ఉంది. ఎన్నికల కమిషన్, టీడీపీ, పోలీసులు ఒక్కటైపోతే ఎన్నికలు ఏం జరుగుతాయి?
బ్యాలట్ ఓటింగ్‌లోనే ఇంత అరాచకం చేస్తే.. ఇక ఈవీఎంలు అయితే మరింత దారుణంగా వ్యవహరించేవారు. పులివెందులలో గెలిచానని చెప్పుకోవడానికి చంద్రబాబు ఇలా చేస్తున్నాడు. పులివెందుల వైఎస్సార్‌సీపీ జడ్పీటిసి అభ్యర్థి గన్‌మెన్‌ను రాత్రికి రాత్రి మార్చేశారు. రాబోయే కాలంలో ప్రతిఫలం చంద్రబాబు అనుభవించక తప్పదు. చంద్రబాబు నీచమైన వ్యక్తి అని ఈ ఎన్నికల ద్వారా తేలిపోయింది.

ఇంతకంటే దుర్మార్గం ఏముంది?: వెలంపల్లి శ్రీనివాస్
పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికల్లో దారుణంగా వ్యవహరించారు. తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు పోలీసుల కాళ్లు పట్టుకునేలా చేశారు. ఇంతకంటే దుర్మార్గం ఏముంది?. చంద్రబాబుకి శునకానంద తప్ప ఏమీ ఒరగదు. ఎప్పుడు ఎన్నిక వచ్చినా కూటమి పార్టీలకు డిపాజిట్లు గల్లంతవ్వడం ఖాయం. ఏం సాధించావని ఎన్నికల్లో ఇలా వ్యవహరిస్తున్నారు.
దొంగ ఓట్లు వేయడానికి టీడీపీ నేతలు క్యూ కట్టారు: మల్లాది విష్ణు
ఎన్నికల కమిషన్ నియమనిబంధనల ప్రకారం నడుచుకోవడం లేదు. పులివెందుల, ఒంటిమిట్టలో రెవిన్యూ, పోలీసులను ఇష్టానుసారంగా వాడుకున్నారు. ఓటర్లను గ్రామ పొలిమేర్లలోనే అడ్డుకుంటున్నారు. రాష్ట్ర మంత్రులకు పులివెందుల, ఒంటిమిట్టలో ఏం పని?. దొంగ ఓట్లు వేయడానికి టీడీపీ నేతలు క్యూ కట్టారు. ఇది అసలు ఎన్నికే కాదు. ఈ ఎన్నికను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఓటమి భయంతో కుట్రపూరితంగా చంద్రబాబు వ్యవహరించారు. ఎలాగైనా పులివెందులలో గెలవాలని చంద్రబాబు తాపత్రయపడుతున్నారు. ఈ ఎన్నిక ప్రజాస్వామ్య బద్ధంగా జరగలేదు