గోడౌన్‌ పైకప్పు కూలిన ఘటన.. మమతకు షాకిచ్చేలా సీఎం సువేందు నిర్ణయం | After Roof Collapse Deaths Bengal Halts All Construction Approved By Trinamool | Sakshi
Sakshi News home page

గోడౌన్‌ పైకప్పు కూలిన ఘటన.. మమతకు షాకిచ్చేలా సీఎం సువేందు నిర్ణయం

Jun 24 2026 10:58 PM | Updated on Jun 25 2026 12:49 AM

After Roof Collapse Deaths Bengal Halts All Construction Approved By Trinamool

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ఓ గోడౌన్‌ పైకప్పు కూలి ఐదుగురు మృతి చెందిన నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి బుధవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. గత మమతా బెనర్జీ ప్రభుత్వం నుంచి ఆమోదం పొంది, నిర్మాణంలో ఉన్న అన్ని వాణిజ్య ప్రాజెక్టుల పనులను జులై 31 వరకు నిలిపివేస్తూ, వాటిపై సమగ్ర ఆడిట్ నిర్వహించాలని సువేందు అధికారి ఆదేశించారు.

ప్రమాద స్థలాన్ని సందర్శించిన తర్వాత ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేశారు. కూలిపోయిన గిడ్డంగికి సంబంధించిన భవన ప్లానింగ్‌లో లోపాలు ఉన్నట్లు తనకు అందిన ప్రాథమిక నివేదికలు సూచించాయని చెప్పారు.

“కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌కు, పట్టణాభివృద్ధి-మున్సిపల్ వ్యవహారాల శాఖకు నేను ఆదేశాలు ఇచ్చాను. గత ప్రభుత్వం ఆమోదించిన నిర్మాణంలో ఉన్న అన్ని వాణిజ్య భవనాల పనులు నిలిపివేయాలి. చెరువులను పూడ్చి అనుమతి పొందిన ప్రాజెక్టులు కూడా ఇందులో ఉంటాయి. వీటన్నింటిపైనా ఆడిట్ జరుగుతుంది” అని ముఖ్యమంత్రి చెప్పారు.

“ఇలాంటి ప్రాంతాల్లో నిర్మాణ పనులు జులై 31 వరకు నిలిపివేస్తాం” అని సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అధికారి చెప్పారు. తర్వాత ఈ ఆడిట్ ప్రక్రియను హౌరా, బిధాన్నగర్ మున్సిపల్ ప్రాంతాలకు విస్తరిస్తామని చెప్పారు.

ఈ ఆడిట్‌ను ప్రజాపనుల శాఖ, పౌర రక్షణ, అగ్నిమాపక-అత్యవసర సేవలు, కోల్‌కతా పోలీసు, కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో కూడిన బృందం నిర్వహిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు.

“ఈ బృందం ప్రధాన కార్యదర్శి మార్గదర్శకత్వంలో పనిచేస్తుంది. స్థల ప్రణాళికలు, భవన ప్రణాళికలు పరిశీలించి, ప్రత్యక్ష తనిఖీలు నిర్వహించి నివేదిక సమర్పిస్తుంది” అని చెప్పారు. కోల్‌కతా మెట్రో, శ్యామ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ అథారిటీ భూములను లీజుకు తీసుకుని నిర్మించిన ప్రాజెక్టులు కూడా ఆడిట్ పరిధిలోకి వస్తాయని అధికారి చెప్పారు.

“నిబంధనలు, భద్రతా ప్రమాణాలు పాటించారా లేదా అన్నది తెలుసుకోవడమే లక్ష్యం. ఆడిట్ పరిధిలోకి వచ్చే ప్రతి ప్రాజెక్టును పరిశీలిస్తాం” అని చెప్పారు. ప్రధాన కార్యదర్శి పర్యవేక్షణలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తుందని తెలిపారు.

అయితే ఆసుపత్రులు, అగ్నిమాపక మౌలిక వసతుల వంటి అత్యవసర సేవలకు సంబంధించిన నిర్మాణ పనులపై ఈ నిలుపుదల ప్రభావం ఉండదని చెప్పారు. “ఆసుపత్రులు, అత్యవసర సేవలకు సంబంధించిన ప్రాజెక్టులు కొనసాగుతాయి. అవి అత్యవసరాలకు చెందినవి” అని ముఖ్యమంత్రి తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement