
ప్రకాశం, సాక్షి: జనసేన ఆవిర్భావ సభలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశిస్తూ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి(Balineni Srinivasa Reddy) చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ భగ్గుమంది. వైఎస్సార్‌సీపీ ఇచ్చిన అధికారంతో పదవి అనుభవించడమే.. అడ్డగోలుగా అకమార్జనకు పాల్పడ్డారని, పైగా కోవర్టు రాజకీయాలతో బాలినేని పార్టీని ఘోరంగా దెబ్బ తీశారని వైఎస్సార్‌సీపీ నేతలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
‘‘బాలినేని.. నీ మంత్రి పదవి త్యాగం చేశావా?. కనబడ్డ భూమి అంతా కబ్జా చేశావ్. ఒంగోలులో బ్రాహ్మణుల భూమి కాజేశావు. వేల కోట్ల రూపాయలతో సామ్రాజ్యం నిర్మించుకున్నావ్. నీ చరిత్ర ఏంటో మొత్తం ప్రకాశం జిల్లాకి తెలుసు. వైవీ సుబ్బారెడ్డి ద్వారానే కదా నువ్వు వైఎస్సార్‌కు బంధువైంది. అలాంటిది జగన్ వెంట నడవడానికే నెలల తరబడి ఆలోచించావు కదా?.
నువ్వు ఆస్తులు అమ్ముకున్నావా?. మీ నాన్న ఆస్తి ఎంత ఉంది.. ఎక్కడ అమ్మావు?. కోట్ల రూపాయల ఖర్చు చేసి స్పెషల్ ఫ్లైట్ వేసుకొని రష్యా వెళ్తావు. కాసినోకు వెళ్తా అని నువ్వే చెప్పావు.. బహుశా ఆస్తి అంతా అక్కడే పోగొట్టావా?. మొదటి నుండి నువ్వొక టీడీపీ కోవర్టువి. ఆ పార్టీలో కుదరక పోవడంతోనే జనసేనలో చేరావ్. నీలాంటి వాడికి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(Jagan Mohan Reddy) గురించి మాట్లాడే స్థాయి ఉందా?’’ అంటూ వైస్సార్సీపీ ఒంగోలు ఇంచార్జ్ కామెంట్స్ చుండూరి రవి బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
జిల్లాలో వైఎస్సార్‌సీపీ ఓటమికి బాలినేనే కారణమని మాజీ పీడీసీ బ్యాంకు చైర్మన్ డాక్టర్ మాదాసు వెంకయ్య ఆరోపించారు. బాలినేని గ్రూపులు చేసి పార్టీని భ్రష్టుపట్టించారు. ఇక్కడి విషయాలు జగన్ దాకా చేరకుండా అడ్డం పడ్డారు. ఇప్పుడు ఆయన పార్టీని వీడాక స్వేచ్ఛగా ఉంది. అధికారం అనుభవించి కోట్లు పోగేసుకున్న బాలినేని.. ఇప్పుడు ప్రేలాపనలు చేస్తున్నారని మండిపడ్డారాయన.