రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటే చరిత్రహీనులవుతారు

Adimulapu Suresh Fires On Chandrababu TDP Yellow Media - Sakshi

ప్రభుత్వంపై విషం చిమ్మడమే టీడీపీ, ఎల్లో మీడియా లక్ష్యం  

అసత్య కథనాలపై మున్సిపల్‌ శాఖ మంత్రి సురేష్‌ ఆగ్రహం

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం మేలు చేస్తుంటే ఓర్వలేని చంద్రబాబు, ఆయనకు వంతపాడే ఎల్లో మీడియా దుష్ప్రచారానికి దిగుతున్నట్లు పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ మండిపడ్డారు. రాజధాని ప్రాంతంలో నిరుపేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వాలనుకోవడం ద్రోహమన్నట్టు ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు, టీవీ 5 చానల్‌ చంద్రబాబుతో కలిసి విషప్రచారానికి తెరతీశాయని విమర్శించారు. ‘దొడ్డి దారిన సీఆర్డీఏ చట్టం, రాజధానికి ద్రోహం’ అంటూ ఆంధ్రజ్యోతి, ఈనాడులో వచ్చిన కథనాలను ఆయన గురువారం ఒక ప్రకటనలో ఖండించారు.

తాము రాజధానికి ఏవిధంగా ద్రోహం చేస్తున్నామో చర్చకురావాలని మంత్రి సవాలు విసిరారు. అధికారం కోల్పోయామన్న అక్కసుతో టీడీపీ ముఖ్య నాయకులు దిగజారి ప్రవర్తిస్తున్నారని, వారు తల్లకిందులుగా తపస్సు చేసినా తమ ప్రభుత్వం చేస్తున్న రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోలేరని పేర్కొన్నారు. టీడీపీ నాయకులకు ప్రజలు బుద్ధిచెప్పినా పద్ధతి మార్చుకోకుండా దిగజారి ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. అబద్ధాలను వండివార్చి ఎల్లో మీడియాలో ప్రచురించినంత మాత్రాన ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని పేర్కొన్నారు.

రాష్ట్రాభివృద్ధిని, ప్రజాసంక్షేమాన్ని అడ్డుకుంటే చరిత్రహీనులుగా మిగిలిపోతారని గుర్తుంచుకోవాలని తెలిపారు. అభివృద్ధి వికేంద్రీకరణ తమ ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు. ‘మీరు పెట్టిన ల్యాండ్‌ లిటిగేషన్స్‌ వల్ల అభివృద్ధి నిలిచిపోయిందన్నది వాస్తవం కాదా..’ అని ఎల్లో మీడియాను, టీడీపీ నేతలను ప్రశ్నించారు. టీడీపీ సృష్టిస్తున్న అభివృద్ధి ఆటంకాలను అధిగమిస్తూ అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నామని, అందుకోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిబద్ధతతో కృషిచేస్తున్నారని తెలిపారు.

రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు ప్రతి సంవత్సరం కౌలు చెల్లిస్తున్నామని, తమ ప్రభుత్వ హయాంలో ఇప్పటిదాకా దాదాపు రూ.750 కోట్లు చెల్లించామని వివరించారు. భూములిచ్చిన రైతులకు క్రమం తప్పకుండా కౌలు ఇవ్వడం కూడా ద్రోహమేనా అని నిలదీశారు. ఇవన్నీ దాస్తే దాగేవికాదని, టీడీపీ అబద్ధాలను సృష్టించి ఎల్లో మీడియాలో ఎంతగా ప్రచారం చేసినా అవి వాస్తవాలు కాలేవని ఆయన పేర్కొన్నారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top