అనకాపల్లి: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తూ ప్రజాస్వామ్య విలువలకు విఘాతం కలిగిస్తున్నారని పైడివాడ అగ్రహారం జనసేన సర్పంచ్ అభ్యర్థి అక్కిరెడ్డి రామలక్ష్మి ఆరోపించారు. టీడీపీ సర్పంచ్ అభ్యర్థి బొబ్బరి అర్జున భవానీ, ప్రస్తుత వైస్ ఎంపీపీ దాసరి సత్యవతి కలిసి ఓట్ల కొనుగోలుకు పాల్పడుతున్నారని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి, సబ్బవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 21న గ్రామంలోని సుమారు 150 మంది ఓటర్లతో ఒక్కో ఓటుకు రూ.10 వేల నుంచి రూ.15 వేల చొప్పున, మొత్తం రూ.15 లక్షల వరకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇందుకు సంబంధించిన అగ్రిమెంట్ పత్రాలను కూడా జతచేశారు. డబ్బులు తీసుకున్న ఓటర్లు కత్తెర గుర్తుపై ఓటు వేసినట్లు పోలింగ్ కేంద్రంలో సెల్‌ఫోన్లతో ఫొటోలు లేదా వీడియోలు తీసి చూపించాలని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. ఒప్పందానికి విరుద్ధంగా ఓటు వేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరిస్తున్నారని ఫిర్యాదులో వివరించారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఓట్లు కొనుగోలు చేశామని, ఎన్నికల్లో తమదే విజయమంటూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు.
అధికార పదవులను అడ్డుపెట్టుకుని ఓటర్లను ప్రభావితం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఓటు ప్రజాస్వామ్యం కల్పించిన హక్కు తప్ప అమ్మకానికి పెట్టే వస్తువు కాదని, ఓటరు తన ఇష్టానుసారం ఓటు వేసే స్వేచ్ఛను కాపాడాలని రామలక్ష్మి కోరారు. అగ్రిమెంట్ పత్రాలపై సమగ్ర విచారణ జరిపి, సంబంధిత అభ్యర్థిపై అనర్హత వేటుతో పాటు వైస్ ఎంపీపీ దాసరి సత్యవతిపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలింగ్ కేంద్రాల్లో సెల్‌ఫోన్ల వినియోగాన్ని నియంత్రించి, పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, ఓటర్లు ఎలాంటి ప్రలోభాలు, బెదిరింపులకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటు వేసే వాతావరణం కల్పించాలని కోరారు.



