నేడే తొలి విడత పంచాయతీ పోలింగ్‌ | - | Sakshi
Sakshi News home page

నేడే తొలి విడత పంచాయతీ పోలింగ్‌

Nov 26 2026 12:18 AM | Updated on Nov 26 2026 12:18 AM

● సాయంత్రానికి ఫలితాల వెల్లడి ● పల్లెల్లో ఎన్నికల సందడి

పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు

సాక్షి , అనకాపల్లి: జిల్లాలో తొలి విడత పంచాయితీ పోరుకు సమయం ఆసన్నమయ్యింది.అనకాపల్లి జిల్లాలోని అనకాపల్లి, చోడవరం,పెందుర్తి నియోజక వర్గాల పరిధిలోని ఉన్న 8 మండలాల్లో ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. తొలి విడత ఎన్నికల పోలింగ్‌,కౌంటింగ్‌ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్‌ విజయకృష్ణన్‌ వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. 4,55,232 మంది తమ ఓటు హక్కుని వినియోగించుకోనున్నారు. తొలి విడతలో నిర్వహించాల్సిన అనకాపల్లి మండలంలోని పాపయ్యపాలెం, పాపయ్య సంతపాలెం ఎన్నికల్ని ఓటర్ల జాబితాలో సవరణ కారణంగా మూడో విడతకు వాయిదా వేశారు.

ఏకగ్రీవం మినహా మిగిలిన గ్రామాల్లో ఎన్నికలు..215 పంచాయతీల్లో ఎన్నికలు జరగాల్సిన ఉన్నప్పటికీ 29 సర్పంచ్‌ స్థానాలు, 280 వార్డు స్థానాలు ఏకగ్రీవం అవ్వడంతో మిగిలిన చోట్ల ఎన్నికలు నిర్వహించనున్నారు. ముందుగా అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం రెవెన్యూ డివిజన్‌ల వారీగా ఎన్నికలు నిర్వహించాల్సిన ఉన్నప్పటికీ ఆ పరిధిలోని నియోజక వర్గాల పరిధిలోకి మార్చారు.తొలి విడత ఎన్నికలకు ఈ నెల 13న నోటిఫికేషన్‌ రాగా వివిధ దశల అనంతరం 26న పోలింగ్‌,అదే రోజు సాయంత్రం ఫలితాల వెల్లడి జరగనుంది.532 అతి సమస్యాత్మక,.713 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించడంతో ఆయా చోట్ల పోలిస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. 113 మంది రూట్‌ ఆఫీసర్లు విధులు నిర్వహిస్తున్నారు.6,936 మంది సిబ్బంది తొలి విడత ఎన్నికల్లో విధులు నిర్వహిస్తున్నారు.ఎన్నికల్లో ఓటు వేసేందుకు గానూ ఆయా విభాగాల పరిధిలో సెలవు గానీ,కనీసం 3 గంటల పాటు అనుమతి ఇవ్వాలని ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు.అంతే కాకుండా పోలింగ్‌ జరిగే ప్రాంతాల్లో ఇప్పటికే 25,26వ తేదీల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు.ఎన్నికల బందోబస్తుకు సంబంధించి ఏర్పాట్లలో భాగంగా జిల్లా ఎస్పీ తుహిన్‌ సిన్హా పరవాడ మండలంలో పర్యటించారు.

ప్రలోభాలకు తెర...

పంచాయతీ ఎన్నికల తొలి విడత ప్రచారంలో భాగంగా మంగళవారం రాత్రి నుంచి నిషేధం ఉన్నప్పటికీ దాదాపు అన్ని గ్రామాల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే ప్రక్రియ మొదలయ్యింది. ఓటర్లకు తాయిలాలు ఇవ్వడం,సుదూర ప్రాంతాల్లో స్థిరపడిన గ్రామస్తుల్ని ఓటు వేసేందుకు అవసరమయ్యే రవాణా ఛార్జీలు భరించేందుకు అభ్యర్థులు ముందుకు రావడంతో గ్రామాల్లో సందడి మొదలయ్యింది.ఎన్నికలు జరుగుతున్న గ్రామాల్లో సందడి కనిపించగా,ఏకగ్రీవం అయిన చోట్ల నిశ్శబ్ధం ఆవరించింది.

పెరిగిన దూకుడు...

తుమ్మపాల: జిల్లాలో రెండో సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్‌ను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి ఆర్డీవోలు, ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలతో తొలి విడత ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల విధులకు నియమించిన సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన సదుపాయాలతో పాటు ఎన్నికల విధుల్లో ఉన్న అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, ముందస్తు ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్‌, పారిశుద్ధ్యం వంటి మౌలిక సదుపాయాలను ముందుగానే పరిశీలించాలని సూచించారు. ఎన్నికల సామగ్రి పంపిణీ, పోలింగ్‌ సిబ్బంది రవాణా, పోలింగ్‌ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా అమలు చేస్తూ ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. పోలింగ్‌ ప్రక్రియను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించాలని స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావులేకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ శౌర్యమాన్‌ పటేల్‌, జిల్లా పంచాయతీ అధికారి కిరణ్‌ కుమార్‌ పాల్గొన్నారు.

ఒకవైపు తొలి విడత పోలింగ్‌కు కౌంట్‌ డౌన్‌ మొదలవ్వగా, రెండవ విడతకు సంబంధించి కీలక ప్రక్రియ చోటు చేసుకుంది.రెండవ విడత పోలింగ్‌ జరగనున్న గ్రామాల్లో గుర్తుల ఖరారు జరగడంతో ప్రచారం ఊపందుకుంది.మంగళవారం సాయంత్రం అభ్యర్థికి గుర్తులు తెలియడంతో వెంటనే ఎన్నికల ప్రచార సామాగ్రిలో భాగంగా గుర్తులతో కూడిన డమ్మీ బ్యాలెట్‌ పత్రాలను రూపొందించడం, ఆయా గుర్తుల్ని ఓటర్ల మదిలో చొప్పించేందుకు అవసరమైన ప్రచార వనరుల్ని ఉపయోగించుకునే పనిలో అభ్యర్థులు నిమగ్నం అయ్యారు.రెండవ విడత ఎన్నికల ప్రచారానికి మరో రెండు రోజుల సమయం మాత్రమే ఉండడంతో అభ్యర్థులు,రాజకీయ పార్టీ నేతలు పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది.మూడవ విడత ఎన్నికలకు సంబంధించి తిరస్కరించిన నామినేషన్లపై ఆయా అభ్యర్థులు అప్పీల్‌కు వెళ్లారు. మూడో విడత ఎన్నికల్లో నిలిచే అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు శుక్రవారం సాయంత్రం పూర్తి కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement