పెద్దపల్లి: ప్రజావాణిలో వచ్చే అర్జీలను సత్వరమే పరిష్కరించాలని, పెండింగ్‌లో ఉంచొద్దని అదనపు కలెక్టర్ బి.శ్రీరాములు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. రామగుండానికి చెందిన ఎండీ.అహ్మోదొద్దీన్ దివ్యాంగుడనని, బీకాం పూర్తి చేశానని, ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని కోరగా, వారధి సొసైటీకి పంపించారు. ‘పెద్దపల్లిలోని ఖుద్రత్‌నగర్‌లో నిర్వహిస్తున్న క్రీసెంట్ మైనారిటీ బీఈడీ కళాశాలలో విద్యార్థులకు సౌకర్యాలు లేవు. శిక్షణ ఇవ్వకుండానే బీఈడీ సర్టిఫికెట్లు అందిస్తున్నారు. విద్యార్థుల హాజ రు రికార్డులు, పాఠశాలల హాజరు రిజిస్టర్లు, ఉపాధ్యాయుల ధ్రువీకరణలు, పర్యవేక్షణ రికార్డులను అధికారులు పరిశీలించాలని బీజేపీ జిల్లా ఉపా ధ్యక్షుడు కరుణాకర్, కుమారస్వామి ఫిర్యాదు చేశా రు. ‘పెద్దపల్లి మండలం రాఘవాపూర్ గ్రామంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల్లో భారీగా అక్రమాలు జరిగాయి. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. వేసవికాలంలో చలివేంద్రం పేరిట రూ.13,300 బిల్లులు డ్రా చేశారు. ఇతర పనుల్లోనూ భారీగా అక్రమాలకు పాల్పడ్డారు. అన్నింటిపై అధికారులు విచారణ చేపట్టాలి’. అని రాఘవాపూర్ యువకులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో బండి ప్రకాశ్ పాల్గొన్నారు.


