సీఎం టూర్ ఇలా..
నేడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన
మధ్యాహ్నం కరీంనగర్ కలెక్టరేట్ ప్రారంభం
సాయంత్రం సిరిసిల్లలో బహిరంగసభ
ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు, విప్‌లు
భారీ జనసమీకరణలో కాంగ్రెస్ శ్రేణులు
సాక్షిప్రతినిధి, కరీంనగర్/సిరిసిల్ల:
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. కరీంనగర్‌లో నూతన కలెక్టరేట్‌ను ప్రారంభించి, సాయంత్రం సిరిసిల్ల బహిరంగ సభలో పాల్గొంటారు. రూ.840 కోట్ల యూసీఎఫ్ నిధులతో కరీంనగర్‌లో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతారు. సిరిసిల్లలో రూ.345.78 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. సీఎం హోదాలో కరీంనగర్, సిరిసిల్లలకు రేవంత్‌రెడ్డి రావడం ఇదే మొదటిసారి. నూతన కలెక్టరేట్ ప్రారంభం సందర్భంగా అధికారులు ఏర్పాట్లు చేయగా, సిరిసిల్లలో నిర్వహించనున్న బహిరంగసభకు కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్త్తున ఏర్పాట్లు చేసింది. మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, చింతకుంట విజయ రమణారావు, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
బుధవారం మధ్యాహ్నం 3గంటలకు హెలి క్యాప్టర్ ద్వారా సీఎం రేవంత్‌రెడ్డి కరీంనగర్ చేరుకుంటారు. నూతన కలెక్టరేట్ సముదాయాన్ని ప్రారంభిస్తారు. 3.10 నుంచి 3.40 వరకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవి ష్కరిస్తారు. స్మార్ట్‌సిటీ నిధులతో నిర్మించిన ఇంటిగ్రేడెట్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ)భవనాన్ని, డిజిటల్ లైబ్రరీ భవనాన్ని ప్రారంభిస్తారు. అర్బన్ చాలెంజ్‌ఫండ్ (యూసీఎఫ్) నిధులు రూ.840 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. 3.40 నుంచి 4.25 వరకు కలెక్టరేట్‌లోని చాంబర్లను సందర్శిస్తారు. 4.30కు హెలిక్యాప్టర్ ద్వారా బయలుదేరి 4.45 గంటలకు సిరిసిల్ల చేరుకుంటారు. 4.50కి కాలేజీ మైదానం నుంచి కాలినడకన బయలుదేరి 5గంటలకు అంబేద్కర్ సర్కిల్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి కాలినడకన పాత బస్టాండు నేతన్న చౌక్, చంద్రంపేట మీదుగా రగుడు బైపాస్ రోడ్డులోని సభాస్థలికి 6 గంటలకు చేరుకుంటా రు. 6.15 గంటల వరకు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారు. 6.15 నుంచి 7.45 గంటల వరకు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 7.45కు రోడ్డు మార్గాన హైదరాబాద్ వెళ్తారు.


