మంథని: గోదావరి పుష్కరాల సందర్భంగా మంథనిలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో వేగం పెంచి నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. సోమవారం మంథనిలో పర్యటించిన ఆయన గోదావరి పుష్కర ఘాట్ల నిర్మాణ పనులు, గౌతమేశ్వర ఆలయ పునర్నిర్మాణ పనులు, భూసేకరణ తదితర అంశాలను పరిశీలించారు. గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని మంథనిలో అవసరమైన అభివృద్ధి పనులను ముందస్తుగా పూర్తి చేయాలని సూచించారు. పుష్కరాలకు అవసరమైన భూమిని సేకరించి పెండింగ్‌లో ఉన్న భూసేకరణ అంశాలను పరిష్కరించాలన్నారు. పుష్కరాల సమయంలో పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున భక్తుల రాకపోకలకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించాలన్నారు. గౌతమేశ్వర ఆలయ పునర్నిర్మాణ పనులను త్వరగా ప్రారంభించి పూర్తి చేయాలన్నారు. మల్లెపల్లి ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాలను స్థానిక బాలుర పాఠశాల అవరణలోకి మార్చిన నేపథ్యంలో విద్యార్థులకు వసతులు కల్పించాలని మున్సిపల్ కమిషనర్ మనోహర్‌ను ఆదేశించారు. ఆర్డీవో సురేశ్, తహసీల్దార్ అరిఫోద్దీన్ పాల్గొన్నారు.


