కోల్‌సిటీ(రామగుండం): రూ.లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన అత్యాధునిక పారిశుధ్య వాహనాలు నిరుపయోగంగా మారాయి. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ తుప్పుపట్టే దశకు చేరాయి. రూ.65లక్షల విలువ చేసే స్వీపింగ్ మిషన్ వాహనాన్ని సింగరేణి సంస్థకు వాడుకోవడానికి ఉచితంగా ఇస్తామని చెప్పినప్పటికీ, ఇంధనం ఖర్చుకు భ యపడి సింగరేణి అధికారులు ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో నిరుపయోగంగా ఉన్న 12 వాహనాలను ఈవేలం ద్వారా విక్రయించేందుకు రామగుండం నగరపాలక సంస్థ అధికారులు సోమవారం టెండరు పిలిచారు. 12వాహనాలను రూ.85.50 లక్షల కనీస ధరతో వేలానికి ఉంచారు. రూ.65లక్షలతో కొనుగోలు చేసిన రోడ్ స్వీపింగ్ మిషన్ వాహనాన్ని రూ.22.50 లక్షలకు, రూ.45 లక్షలతో కొనుగోలు చేసిన పోర్టబుల్ కంపాక్టర్ వాహనాన్ని రూ.17 లక్షలకు, రూ.45 లక్షలతో కొ నుగోలు చేసిన హుక్ లోడర్ వాహనాన్ని రూ.23 లక్షలకు, రూ.35 లక్షలతో కొనుగోలు చేసిన స్టాటిక్ కంపాక్టర్ యంత్రాన్ని రూ.11 లక్షలతో విక్రయించడానికి కనీస ధరగా నిర్ణయించారు. వీటితోపాటు ఏడు ట్రాక్టర్ ట్రైలర్లు రూ.7 లక్షలు, డంపర్ ప్లేసర్ రూ.5 లక్షల కనీస ధరతో విక్రయించనున్నారు.
9న ఈ–వేలం
వాహనాలను పరిశీలించేందుకు ఈనెల 28 నుంచి అక్టోబరు 8వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అవకాశం కల్పించారు. కేవైసీ పత్రాలతో ఆన్‌లైన్ నమోదు, ఈఎండీ చెల్లింపునకు అక్టోబరు 8 సాయంత్రం 5 గంటల వరకు గడువు విధించారు. అక్టోబరు 9న మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు ఈ వేలం జరుగుతుందని, వేలంలో ఎంపికై న వారు మిగిలిన మొత్తాన్ని అక్టోబరు 13లోగా చెల్లించాలని, వాహనాల అప్పగింత అక్టోబరు 22 నుంచి 24 వరకు జరుగుతుందని వెల్లడించారు.


