అబ్బే.. పీజీ కోర్సులా? | - | Sakshi
Sakshi News home page

అబ్బే.. పీజీ కోర్సులా?

Sep 29 2026 12:33 AM | Updated on Sep 29 2026 12:33 AM

సీట్లు

శాతవాహన వర్సిటీలో కనిష్ట సంఖ్యలో రిపోర్ట్‌ చేసిన విద్యార్థులు

తొలిఫేజ్‌లో 758 సీట్లకు కేవలం 251 మంది చేరిక

బయోమెట్రిక్‌తో క్యాంపస్‌లో చేరేందుకు విముఖత ?

కేవలం 33 శాతం మంది చేరికపై సర్వత్రా ఆందోళన

మరో రెండు ఫేజ్‌లలో 67 శాతం మంది చేరుతారా? అని అనుమానం

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌:

శాతవాహన యూనివర్సిటీలో పీజీ అడ్మిష న్లు తీవ్రంగా నిరాశ పరిచాయి. 2026–27 విద్యా సంవత్సరంలో క్యాంపస్‌లో వివిధ కోర్సుల్లో అందుబాటులో ఉన్న సీట్లకు 33 శాతం మంది విద్యార్థులే అడ్మిషన్‌ తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. పీజీ సెట్‌ కౌన్సెలింగ్‌ తొలివిడత ఈనెల 23వ తేదీతో ముగిసింది. మొత్తం సీట్లలో సగం సీట్లలోనూ విద్యార్థులు చేరనప్పుడు, సెకండ్‌, థర్డ్‌ ఫేజ్‌ల్లో మిగిలిన సీట్లు ఎలా భర్తీ అవుతాయన్న ప్రశ్న విద్యార్థులు, అధ్యాపకులలో మొదలైంది.

ఫిజిక్స్‌లో ఒక్కరు.. సోషియాలజీలో ఆరుగురు

ప్రస్తుతం ఏడాదిలో ఫిజిక్స్‌ విభాగంలో ఒకేఒక్క విద్యార్థి చేరగా, సోషియాలజీలో ఆరుగురు చేరా రు. ఎంఏ ఉర్దూ, ఎంఏ ఇంగ్లిష్‌, ఎంఎస్‌డబ్లూ, ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, మ్యాథ్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ కోర్సుల్లో పదిలోపు విద్యార్థులు జాయినయ్యారు. యూనివర్సిటీలో కేటాయించిన సీట్ల కన్నా చేరిన విద్యార్థుల సంఖ్య చూసి అధ్యాపకులు ఒకరిద్దరి కోసం ఏడాది మొత్తం పాఠాలు చెప్పాలా? అని తల పట్టుకుంటున్నారు. దీనిపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ఉస్మానియా, కాకతీయలో సీటు కోసం ఎదురుచూసే విద్యార్థులంతా సెకండ్‌, థర్డ్‌ఫేజ్‌ల్లో చేరే అవకాశాలున్నాయని కొందరు అధ్యాపకులు విశ్వాసం వ్యక్తం చేశారు. ఇంతటి కనిష్టస్థాయిలో విద్యార్థులు రిపోర్టు చేయడం నానాటికీ పీజీ కోర్సులకు తగ్గుతున్న ఆదరణకు నిదర్శనమని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

బయోమెట్రిక్‌ భయపెట్టిందా?

యూనివర్సిటీలో ఆర్ట్స్‌, సైన్స్‌ కలిపి మొత్తం 18వరకు కోర్సులున్నాయి. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా బయోమెట్రిక్‌ విధానం కారణంగానే విద్యార్థులు చేరేందుకు వెనకడుగు వేస్తున్నారన్న అపవాదును యూనివర్సిటీ మూటగట్టుకుంది. గత విద్యా సంవత్సరంలో హాజరుశాతం తక్కువగా ఉందన్న కారణంతో పలు కోర్సుల విద్యార్థులను పరీక్షలు రాయకుండా చేసిన సంఘటన ఈ విద్యా సంవత్సరంలో ప్రవేశాలపై ప్రభావం చూపిందని వర్సిటీ అధ్యాపకులు, విద్యార్థులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. వాస్తవానికి రాష్ట్రంలోని అన్ని యూని వర్సిటీలలో బయోమెట్రిక్‌ విధానం ఉన్నా.. ఇక్కడ కఠినంగా అమలవుతుందని విద్యార్థులు వాపోతున్నారు. అదే సమయంలో శాతవాహన పరిధిలోని ఏ అనుబంధ, ప్రైవేటు కాలేజీలో లేని బయోమెట్రిక్‌ అమలు కాకపోవడం ఏంటని నిలదీస్తున్నారు. పైగా పోటీ పరీక్షలకు ఎంతో ఉపయోగపడే లైబ్రరీ లో విద్యార్థులకు ఆంక్షలు విధించడం, ప్రతీ చిన్న విషయానికి పోలీసులను క్యాంపస్‌లోకి పిలిపించి విద్యార్థులపై కేసులు పెట్టిస్తామంటూ బెదిరించడం కూడా వర్సిటీ ప్రవేశాలపై ప్రతికూల ప్రభావం చూపిందని విద్యార్థులు వాపోతున్నారు. అదే సమయంలో ఎల్‌ఎల్‌బీ, పీహెచ్‌డీ విద్యార్థులకు హాస్టల్‌ సదుపాయం లేకపోవడం కూడా ప్రవేశాలు తగ్గేందుకు పరోక్ష కారణమైందని చెబుతున్నారు.

కోర్సు మొత్తం సీట్లు అడ్మిటెడ్‌

ఆర్ట్స్‌ 210 54

సైన్స్‌ 325 73

కామర్స్‌ 80 29

లా 143 95

మొత్తం 758 251

కోర్సు మొత్తం చేరికలు

ఎంఏ ఎకానమిక్స్‌ 40 10

ఎంఎస్‌డబ్ల్యూ 30 09

ఎంఏ తెలుగు 40 12

ఎంఏ ఉర్దూ 30 09

ఎంఏ ఇంగ్లిష్‌ 40 08

ఎంఏ సోషియాలజీ 30 06

ఎల్‌ఎల్‌బీ 124 77

ఎల్‌ఎల్‌ఎం 19 18

ఎమ్మెస్సీ మ్యాథ్స్‌ 40 06

ఎమ్మెస్సీ బాటనీ 40 11

ఎమ్మెస్సీ ఫుడ్‌ సైన్స్‌ 50 20

ఎమ్మెస్సీ ఫోరెన్సిక్‌ సైన్స్‌ 30 14

ఎమ్మెస్సీ కంప్యూటర్‌ సైన్స్‌ 50 05

ఎమ్మెస్సీ కెమిస్ట్రీ 60 09

ఎమ్మెస్సీ ఫిజిక్స్‌ 25 01

ఎమ్మెస్సీ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ 30 07

ఎంకాం జనరల్‌ 40 13

ఎంకాం ఫిన్‌టెక్‌ 40 16

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement