వాతావరణ మార్పులకు తట్టుకునేలా..
రామగుండంలో వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్ మోడల్ రోడ్డు
మేడిపల్లి నుంచి పీకే రామయ్య కాలనీ రోడ్డు ఎంపిక
రూ.14.50 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణ పనులు
కోల్‌సిటీ(రామగుండం): వాతావరణ మార్పులను తట్టుకునేలా రామగుండంలో వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్ ద్వారా నమూనా మోడల్ రోడ్డను నిర్మించడానికి నగరపాలక సంస్థ కౌన్సిల్ నిర్ణయించింది. ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజ్‌ఠాకూర్ చొరవతో ఎన్టీపీసీలోని మేడిపల్లి సెంటర్ నుంచి పీ.కే.రామయ్య కాలనీ బోర్డు వరకు కిలోమీటర్ దూరం, 80 ఫీట్ల వెడల్పుతో క్లైమేట్ రెసిలియెంట్ మోడల్ రోడ్డుగా అభివృద్ధి చేయనున్నారు. రూ.14.50 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించేందుకు ఈనెల 25న కౌన్సిల్‌లో తీర్మానించారు. వాతావరణ మార్పులను తట్టుకునేలా, వర్షపు నీటి సమస్యలను తగ్గించేలా, ఎండ తీవ్రతను ఎదుర్కొనేలా నిర్మాణం చేపట్టడమే ప్రధాన ఉద్దేశమని అధికారులు వెల్లడిస్తున్నారు.
వర్షపు నీటికి ప్రత్యేక ప్రణాళిక
భారీ వర్షాలు, వరదల సమయంలో నీరు రహదారులపై నిలిచిపోకుండా మెరుగైన డ్రైనేజీ వ్యవస్థలు ఏర్పాటు చేయడం, సాధ్యమైన చోట నీటిని నేలలోకి ఇంకేలా చేసే పేవ్‌మెంట్లు, బయోస్వేల్స్ వంటి ప్రకృతి ఆధారిత విధానాలను వినియోగించడంలో సీఆర్‌ఐయూఆర్‌సీ భాగంగా ఉంది. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో అర్బన్ హీట్ ఐలాండ్ ప్రభావాన్ని తగ్గించేలా అవసరమైన చోట కప్పు కలిగిన మార్గాలు, అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే నాణ్యమైన నిర్మాణ సామగ్రి వినియోగం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోనున్నారు.
రూ.14.50 కోట్లతో
మేడిపల్లి సెంటర్ నుంచి పీ.కే.రామయ్య కాలనీ బోర్డు వరకు ప్రతిపాదించిన వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్ కింద చేపట్టనున్న మోడల్ రోడ్డు నిర్మాణ పనులకు మొత్తం రూ.14.50 కోట్ల అంచనా వ్యయాన్ని ప్రతిపాదించారు. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద 25శాతం కేంద్ర సహాయం, 50 శాతం సంస్థాగత/మార్కెట్ రుణ సమీకరణ, 25 శాతం రాష్ట్ర ప్రభుత్వ సహాయం ద్వారా నిధులు సమకూర్చే ప్రతిపాదన ఉంది. ప్రత్యామ్నాయంగా ప్రపంచ బ్యాంకు నుంచి 70 శాతం రుణ సహాయం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 30 శాతం సహాయంతో ప్రాజెక్టును చేపట్టే అవకాశాన్ని కూడా ప్రతిపాదనలో పొందుపరిచారు.
పరిపాలనా అనుమతులకు
రామగుండంలో నిర్మించబోయే మోడల్ రోడ్ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదన, కాన్సెప్ట్ నోట్‌ను బెంగళూరుకు చెందిన మెసర్స్ శుబ్ కన్సల్టెంట్ అండ్ టెక్నోక్రాట్ సంస్థ సిద్ధం చేసింది. వీటిని కౌన్సిల్ పరిశీలించి ఆమోదించింది. డీపీఆర్‌తో పాటు కౌన్సిల్ తీర్మానాన్ని సీడీఎంఏకు సమర్పించడానికి నివేదికలను తయారు చేయడంతో ఇంజినీర్లు నిమగ్నమయ్యారు.
సీడీఎంఏకు సమర్పిస్తాం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్‌లైన్స్ మేరకు ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ ప్రతిపాదనలతో మేడిపల్లి సెంటర్ నుంచి పీ.కే.రామయ్య కాలనీ బోర్డు వరకు మోడల్ రోడ్డు అభివృద్ధికి ఎంపిక చేశాం. వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్ కింద చేపట్టనున్న మోడల్ రోడ్డు నిర్మాణ పనులకు డీపీఆర్ ద్వారా మొత్తం రూ.14.50 కోట్ల అంచనా వ్యయాన్ని ప్రతిపాదించా రు. ఇటీవల ఈ ప్రతిపాదనలకు కౌన్సిల్ ఆమోదం కూడా తెలిపింది. ఈ ప్రాజెక్ట్ అనుమతి కోసం సమగ్ర నివేదికను సీడీఎంఏకు సమర్పిచడానికి నివేదిక సిద్ధం చేస్తున్నాం.
– అరుణశ్రీ, కమిషనర్, నగరపాలక సంస్థ


