కోల్‌సిటీ: పెద్దపల్లి జిల్లా రామగుండంలోని సింగరేణి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(సిమ్స్)కు బోధానస్పత్రి గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. సోమవారం ఓ వృద్ధురాలికి మోకీలు మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు.
రెండేళ్లుగా నొప్పితో..
రెండేళ్లుగా ఎడమ మోకాలిలో నొప్పితోపాటు నడవడంలో ఇబ్బంది పడుతున్న మంచిర్యాల జిల్లా నస్పూర్ ప్రాంతానికి చెందిన పెంటమ్మ(74)ను జీజీహెచ్ ఆర్థోపెడిక్స్ విభాగానికి ఈనెల 11న తీసుకొచ్చారు. పరీక్షల్లో మోకీలులో ఆర్థరైటిస్ మార్పులు, కీళ్ల మధ్య ఖాళీ తగ్గడం, మోకీలు ఆకతిలో వైకల్యం ఉన్నట్లు గుర్తించారు. వ్యాధి తీవ్రత, రోజువారీ కార్యకలాపాలపై ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుని మోకీలు మార్పిడి శస్త్రచికిత్స చేయాలని వైద్యులు నిర్ణయించారు.
విజయవంతంగా శస్త్రచికిత్స...
ఈనెల 12న ఆర్థోపెడిక్స్ ప్రొఫెసర్ ప్రదీప్‌చంద్ర నేతృత్వంలో డాక్టర్లు బండి శ్రీధర్, బి.యాకూబ్, ఇ.హేమంత్, ఎన్.హేమంత్‌తో కూడిన వైద్య బృందం శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించింది. అనెస్థీషియా ప్రొఫెసర్ భానులక్ష్మి పర్యవేక్షణలో డాక్టర్లు శ్రీనివాస్, జయప్రకాశ్, జాకీర్ సహకరించారు. నర్సింగ్ సిబ్బంది రాజేశ్, అజయ్ సేవలందించారు. ప్రస్తుతం వృద్ధురాలి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతోపాటు సంతప్తికరంగా కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ అధునాతన వైద్య సేవలు
ప్రభుత్వ వైద్యసంస్థలోనే మోకీలు మార్పిడి వంటి అధునాతన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించడం సిమ్స్ ప్రొఫెసర్ల వైద్యసేవల సామర్థ్యం మరింత బలోపేతమైందని కలెక్టర్ కోయ శ్రీహర్ష కొనియాడారు. ఈ సందర్భంగా జీజీహెచ్ సూపరింటెండెంట్ హిమబిందు సింగ్, ఆర్‌ఎంవో కృపాభాయి, ఆర్థోపెడిక్స్, అనెస్థీషియా నిపునులు, నర్సింగ్, సహాయక సిబ్బంది సమన్వయంతో చేసిన కృషిని అభినందించారు.


