అంతర్ రాష్ట్ర ఆనకట్ట నిర్మాణానికి అవకాశం
తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలమవుతుందని సంబురం
ఆంధ్రప్రదేశ్‌తోపాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకూ ప్రయోజనం
ఏటా రూ.30 కోట్ల చేపల ఎగుమతికి కూడా అవకాశం
మంథని: అంతర్ రాష్ట్ర వివాదం.. అటవీ, పర్యావరణ అడ్డంకుల సాకుతో ఇన్నాళ్లూ ఆగిన ఇచ్చంపల్లి ప్రాజెక్టు నిర్మాణంపై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. తెలంగాణకు తాగు, సాగునీరు అందిస్తూ, జలవిద్యుత్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ మధ్య రవాణా సౌకర్యం కల్పించేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీంతో ఈ ప్రాంత ప్రజల్లో సంబురాలు వ్యక్తమవుతున్నాయి.
ఇంజినీర్లకు కలరా సోకి..!
ఇచ్చంపల్లి నిర్మాణంతో తెలంగాణ సస్యశ్యామలమవుతుందని, ఈదిశగా చర్యలు తీసుకోవాలని రాజకీయపార్టీలు అప్పట్లో అనేక ఉద్యమాలు చేశాయి. అనేక అవాంతరాలతో మూలనపడింది. ప్రస్తుత ప్రభుత్వం దృష్టి సారించడంతో ప్రాజెక్టుపై ఆశలు చిగురిస్తున్నాయి. సుమారు ఎనిమిది దశాబ్దాల క్రితం దట్టమైన అటవీ ప్రాంతంలోని మంథని నియోజకవర్గం(ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లిపల్లి జిల్లా) పరిధిలో గల మహదేవపూర్ మండలం ఇచ్చంపల్లి వద్ద బ్రిటిష్ ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది. ప్రాజెక్టు పనుల్లో పాల్గొన్న ఫ్రెంచి ఇంజినీర్లు కలరాతో మృతి చెందటంతో నిర్మాణం ఆగిపోయినట్లు ప్రచారంలో ఉంది.
1978లో పునరుద్ధరించాలని సంకల్పించి..
1978లో ఇచ్చంపల్లి పనులు పునప్రారంభించాలని అప్పటి కేంద్రప్రభుత్వం సంకల్పించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లోని సుమారు వంద గ్రామాలు, వేలాది హెక్టార్ల అడవులు ప్రాజెక్టు నీటిలో కలిసి పోతాయని అప్పటి ఏపీ ప్రభుత్వం అడ్డుచెప్పింది. దీంతో ఇప్పటివరకు దీని నిర్మాణం అడుగుముందుకు పడలేదు. తద్వారా బహుళార్థ సాధక అంతర్జాతీయ ప్రాజెక్టు నిర్మాణం క్రమంగా పట్టుకోల్పోతూ వస్తోంది.
అప్పటి సీఎం వైఎస్సార్ హఠాన్మరణంతో..
1999లో అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ విద్యాసాగర్‌రావు ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించాలనే డిమాండ్‌తో ఇచ్చంపల్లి వరకు పాదయాత్ర చేపట్టారు. 2004 ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు చెందిన 41మంది ఎమ్మెల్యేలు ఇచ్చంపల్లి వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేయడానికి ప్రయత్నాలు తీవ్రతరం చేశారు. కానీ ఆయన హఠాన్మరణంతో ఫైలు మూలనపడింది.
ఎత్తు తగ్గించి.. ఎత్తిపోతలతో..
ప్రాజెక్టు ఎత్తు తగ్గించి ఎత్తిపోతల ద్వారా నీటిని మళ్లించవచ్చని, దీనిద్వారా ముంపునకు గురైయ్యే ప్రాంతాలు తక్కువగా ఉంటాయని నీటిపారుదల శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు.. ల్యాడర్ సిస్టంతో గోదావరి నదికి ఇరువైపులా ఆనకట్ట నిర్మిస్తే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గడ్‌కు రవాణా సౌకర్యం కలుగుతుందని చెబుతున్నారు. నౌకాయానంతోపాటు ఏటా రూ.30 కోట్ల విలువైన చేపలు ఎగుమతి చేసే అవకాశం ఉంటుందని అంటున్నారు. అంతర్‌రాష్ట్ర వివాదాల పరిష్కారానికి విధివిధానాలు ఉన్నాయని, ఒక్కో నదీజలాలు ఐదేసీ రాష్ట్రాలు వినియోగించుకుంటున్నాయని గుర్తుచేస్తున్నారు. కేవలం అంతర్ రాష్ట్ర వివాదాన్ని బూచీచూపుతూ ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణతోపాటు ఆంధ్రాలోని రెండు మండలాలకు సాగునీరు, మూడు రాష్ట్రాలకు ప్రయోజనం చేకూర్చేలా ప్రాజెక్టు నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని రైతాంగం కోరుతోంది.


