మంథని: యాదవ చారిటబుల్ ట్రస్ట్, అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో చేపట్టిన శ్రీకృష్ణ సేవా విద్యానిధి యాత్ర పట్టణంలో శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. యాదవులు, బడుగు, బలహీన వర్గాల పేదవిద్యార్థులు చదువులో వెనుకబడుతున్నారని, వారిని విద్యకు దగ్గర చేయడంతోపాటు ఉన్నత చదువుల వైపు ప్రోత్సహించాలనే సదుద్దేశంతో ఈయాత్ర చేపట్టామని నిర్వాహకులు తెలిపారు. విద్య ద్వారా సామాజిక అభివృద్ధి సాధించాలనే సంకల్పంతో యాత్ర కొనసాగుతుందని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో పేద విద్యార్థుల కోసం ఉచిత విద్య, వసతి భవనం నిర్మిస్తున్నామని, ఈ కార్యక్రమానికి యాదవులు సహకరించాలని కోరారు. అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు మేకల మల్లేశం యాదవ్, గొర్రెలకాపరుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సలేంద్ర రాములు యాదవ్, అఖిల భారత యాదవ మహాసభ మహిళా విభాగం అధ్యక్షురాలు సల్పాల సుమలత, ప్రధాన కార్యదర్శి ఓదెలు, నాయకులు వేముల లక్ష్మణ్, పెగడ శ్రీనివాస్, అశోక్, సామ తిరుపతి, సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు.


