పెద్దపల్లి: పెద్దపల్లి నియోజకవర్గంలో రూ.250 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు ఈనెల 17న మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు తెలిపారు. సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో నిర్వహించనున్న మంత్రుల బహిరంగసభ ఏర్పాట్లను ఆయన శుక్రవారం పరిశీలించారు. అనంతరం స్థానిక వైశ్య భవన్‌లో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ శ్రేణులతో సమావేశమయ్యారు. మంత్రుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అన్నయ్యగౌడ్, సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ బిరదు రాధాకృష్ణ, పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.


